[1] మీ దేవుడు యెహోవా ఎవరి దేశాన్ని మీకిస్తాడో ఆ జనాలను మీ దేవుడు యెహోవా నాశనం చేశాక మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకుని, వాళ్ళ పట్టణాలలో వాళ్ళ ఇండ్లలో కాపురం చేస్తారు.
[2] అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మూడు పట్టణాలు ప్రత్యేకించాలి.
[3] మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా చేసి ఆ పట్టణాలకు త్రోవలు తయారు చేయాలి. ఒకవేళ ఎవడైనా మరో వ్యక్తిని చంపితే ఆ పట్టణాలలో ఒకదానికి పారిపోయే విధంగా చేయాలి.
[4] మనిషిని చంపి, పారిపోయి, బ్రతకగల వారెవరంటే, ద్వేషించకుండా, బుద్ధిపూర్వకంగా కాకుండా పొరుగువాణ్ణి చంపినవారే.
[5] ఒక వ్యక్తి చెట్లు నరకడానికి తన పొరుగువాడితోపాటు అడవికి పోతాడనుకోండి. చెట్టు నరకడానికి చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి అతడి పొరుగువాడికి తగిలితే చస్తాడనుకోండి. అలాంటప్పుడు అతడు ఆ మూడు పట్టణాలలో ఒక దానికి పారిపోయి తన ప్రాణం దక్కించుకొంటాడు.
[6] లేకపోతే, త్రోవ ఎక్కువ దూరమైతే హత్య విషయం ప్రతీకారం చేసేవాడు కోపాగ్నితో మండిపడి, ఆ మనిషిని చంపినవాడి వెంట తరిమి అతణ్ణి చంపుతాడేమో. అయితే అతడు తన పొరుగువాణ్ణి అంతకుముందు ద్వేషించలేదు గనుక అతనికి మరణశిక్ష తగదు.
[7] అందుకనే “మీ కోసం మూడు పట్టణాలు ప్రత్యేకించాలి” అంటూ మీకాజ్ఞాపించాను.
[8] మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఎప్పుడూ ఆయన విధానాలలో నడుచుకోవాలని ఈ రోజు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే మీరు చేస్తే,
[9] మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు మీ సరిహద్దులు విశాలం చేస్తాడు, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిస్తాడు. అప్పుడు ఆ మూడు పట్టణాలు గాక ఇంకా మూడు పట్టణాలు ప్రత్యేకించాలి.
[10] మీ దేవుడు యెహోవా మీ వారసత్వంకోసం మీకిచ్చే దేశంలో నిరపరాధులను చంపడంవల్ల హత్య విషయమైన అపరాధం మీమీదికి రాకుండేలా మీరు ఈ విధంగా చేయాలి.
[11] కానీ ఎవడైన ఒక వ్యక్తి తన పొరుగువాణ్ణి ద్వేషిస్తూ, అతడికోసం పొంచివుండి, అతడిపైబడి అతణ్ణి చంపుతాడనుకోండి.
[12] ఆ పట్టణాలలో ఒక దానికి అతడు పారిపోయినా, వాడి ఊరి పెద్దలు మనుషులను పంపించి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి, హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అప్పగించి చంపించాలి.
[13] వాడిమీద జాలి చూపకూడదు. మీకు క్షేమంగా ఉండేలా ఇస్రాయేల్‌ప్రజల మధ్యనుంచి నిరపరాధుల హత్య విషయమైన అపరాధాన్ని తొలగించాలి.
[14] మీరు స్వాధీనం చేసుకోవాలని మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీ మీ వారసత్వాలలో పూర్వీకుల నియామకం ప్రకారం సరిహద్దు రాళ్ళు ఉంటాయి. మీ పొరుగువారి సరిహద్దు రాళ్ళను మీరు తీసివేయకూడదు.
[15] ఒక మనిషి ఏదైనా అపరాధం గానీ, తప్పిదం గానీ చేస్తే, అది ఏదైనా సరే, దాని గురించి ఒకే సాక్షి సాక్ష్యం మీరు అంగీకరించకూడదు. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదే ప్రతి సంగతి రూఢి అవుతుంది.
[16] ఇద్దరు వ్యక్తుల వ్యాజ్యం విషయంలో అపకార బుద్ధిగల సాక్షి నిలబడి వారిలో ఒకరిమీద అబద్ధ సాక్షం చెపితే,
[17] వ్యాజ్యమాడే ఆ ఇద్దరు యెహోవా సన్నిధానంలో, ఆ కాలంలో ఉండబోయే యాజుల, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
[18] న్యాయాధిపతులు ఆ సంగతిని బాగా విచారించాలి. ఆ సాక్షి అబద్ధసాక్షి అని, సాటి మానవుడి మీద అబద్ధసాక్ష్యం చెప్పాడని వెల్లడి అవుతుందనుకోండి.
[19] అలాంటప్పుడు వాడు సాటి మానవునికి చేయదలచినట్టే వాడికి చేయాలి. ఈ విధంగా మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి.
[20] మిగతా ప్రజలు అది విని, భయపడి అప్పటినుంచి మీ దేశంలో అలాంటి దుర్మార్గం చేయకుండా ఉంటారు.
[21] అలాంటి వాడిమీద జాలి చూపకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు – ఇదే మీకు నియమం.