[1] మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించి, దానిని స్వాధీనం చేసుకొని, దానిలో కాపురమున్న తరువాత
[2] మీ దేవుడు యెహోవా మీకిచ్చే భూమినుంచి కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన వాటిని తీసుకొని, గంపలో ఉంచాలి; మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థలంగా ఎన్నుకొన్న స్థలానికి ఆ గంపను తీసుకుపోవాలి.
[3] ఆ రోజులలో ఉండబోయే యాజి దగ్గరకు చేరి, అతడితో “యెహోవా మనకిస్తానని పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చివున్న సంగతి ఈనాడు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో రూఢిగా చెపుతున్నాను” అనాలి.
[4] యాజి ఆ గంపను మీ చేతినుంచి తీసుకొని, మీ దేవుడు యెహోవా బలిపీఠం ముందు ఉంచినప్పుడు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో మీరు ఇలా చెప్పాలి:
[5] “నా పూర్వీకుడు సంచరిస్తూ ఉండే ఆరాం దేశీయుడు. అతడు ఈజిప్ట్‌కు వెళ్ళాడు. కొద్దిమందితో అక్కడికి చేరి విదేశీయుడుగా అక్కడ ఉండిపోయాడు. వారు అక్కడ సంఖ్యలో అధికం అయ్యారు, బలంగల గొప్ప జనమయ్యారు.
[6] ఈజిప్ట్ జాతివాళ్ళు మనల్ని హింసించి, బాధపెట్టి, మనమీద కఠిన దాస్యం మోపారు.
[7] మనం మన పూర్వీకుల దేవుడు యెహోవాకు మొరపెట్టాం. ఆయన మన మొర విని, మన బాధలు, కష్టాలు, కడగండ్లు చూశాడు.
[8] యెహోవా తన బలిష్ఠమైన హస్తంతో, చాపిన చేతితో, మహా భయంకరమైన చర్యలతో, అద్భుతమైన సూచనలతో, మహాక్రియలతో మనల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు.
[9] ఈ స్థలానికి మనల్ని తెచ్చి పాలు తేనెలు నదులై పారుతూవున్న ఈ దేశాన్ని మనకిచ్చాడు.
[10] ఇప్పుడు యెహోవా, నీవు నాకిచ్చిన భూమిలో మొదట పండిన వాటిని నేను తెచ్చాను.” అలా చెప్పి మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో ఆ గంపను పెట్టి, మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో ఆరాధించాలి;
[11] మీకూ మీ ఇంటివారికీ మీ దేవుడు యెహోవా అనుగ్రహించిన మేలంతటి విషయం మీరూ, లేవీగోత్రికులూ, మీమధ్య ఉన్న విదేశీయులూ సంతోషించాలి.
[12] మూడో సంవత్సరం మీ రాబడి అంతట్లో పదోవంతును ఇచ్చే సంవత్సరం. ఆ ఏట ఆ పదో వంతు లేవీగోత్రికులకూ విదేశీయులకూ తండ్రిలేనివారికీ విధవరాండ్రకూ ఇవ్వాలి. వారు మీ గ్రామంలో తిని తృప్తి పొందాక,
[13] మీరు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో ఇలా అనాలి: “నీవు నాకిచ్చిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం నా ఇంటినుంచి ప్రతిష్ఠ చేసిన పదో వంతును తీసివేసి, లేవీగోత్రికులకూ, విదేశీయులకూ, తండ్రిలేనివారికీ విధవరాండ్రకూ నేనిచ్చాను. నీ ఆజ్ఞలలో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరవలేదు.
[14] నేను శోకించే సమయంలో దానిలో కొంచెమైనా తినలేదు, అశుద్ధంగా ఉన్నప్పుడు దానిలో దేనినీ తీసివేయలేదు, చనిపోయిన వారికోసం దానిలో దేనినీ ఉపయోగించలేదు. నా దేవుడైన యెహోవా మాట విని, నీవు నాకాజ్ఞాపించినట్టు అంతా చేశాను.
[15] నీ పవిత్రాలయంనుంచి, పరలోకంనుంచి, చూచి నీ ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలను దీవించు; నీవు మా పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు మాకిచ్చిన దేశాన్ని, పాలు తేనెలు నదులైపారుతూవున్న ఈ దేశాన్ని ఆశీర్వదించు.”
[16] మీరు ఈ చట్టాలు, న్యాయ నిర్ణయాల ప్రకారం ప్రవర్తించాలని మీ దేవుడు యెహోవా ఈ రోజు మీ కాజ్ఞాపిస్తున్నాడు గనుక మీరు మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకోవాలి.
[17] యెహోవాయే మీకు దేవుడనీ, మీరు ఆయన విధానాల్లో నడుస్తూ, ఆయన చట్టాలు, ఆజ్ఞలు, న్యాయనిర్ణయాలు ఆచరణలో పెట్టుకుంటూ, ఆయన మాట వింటూ ఉంటామని ఈనాడు ఆయనతో మాట ఇచ్చారు.
[18] యెహోవా మీకు వాగ్దానం చేసినట్టు మీరే తన ప్రజలని, తనకు ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారని ఈ రోజు ఆయన మాట ఇచ్చాడు. తాను చెప్పినట్టు మీరు తన ఆజ్ఞలన్నీ పాటించాలనీ,
[19] తాను సృజించిన సమస్త జనాలకంటే మిమ్మల్నే హెచ్చిస్తాననీ, అలా తనకు కీర్తి, పేరు, మహిమ కలిగించుకొంటాననీ, మీరు మీ దేవుడు యెహోవాకు పవిత్ర ప్రజగా ఉంటారనీ చెప్పాడు.