[1] మీరు మీ శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మీ కంటే ఎక్కువమందిని, గుర్రాలను, రథాలను చూస్తే వారికి భయపడకూడదు. ఈజిప్ట్‌దేశంనుంచి మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఉంటాడు.
[2] మీరు యుద్ధానికి సమీపించినప్పుడు యాజి ప్రజలదగ్గరికి వచ్చి వారితో ఇలా చెప్పాలి:
[3] “ఇస్రాయేల్ ప్రజలారా, వినండి! ఈవేళ మీరు శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీ హృదయంలో పిరికితనం ఉండనివ్వకండి. హడలిపోండి! అధైర్యం చెందకండి! వాళ్ళను చూచి భయపడకండి!
[4] మీ శత్రువులతో యుద్ధం చేయడానికీ మిమ్మల్ని రక్షించడానికీ మీతోపాటు వస్తున్నది మీ దేవుడు యెహోవాయే!”
[5] అధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి: “మీలో ఎవడైనా కొత్త ఇల్లు కట్టి ప్రతిష్ఠ చేయకుండా ఉన్నాడా? అయితే అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే ఈ యుద్ధంలో అతడు చనిపోతాడేమో, వేరొకడు ఆ ఇల్లు ప్రతిష్ఠ చేస్తాడేమో.
[6] ఎవడైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పండ్లు తినకుండా ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే అతడు ఈ యుద్ధంలో చనిపోతాడేమో, వేరొకడు దాని పండ్లు తింటాడేమో.
[7] ఎవడైనా స్త్రీని ప్రధానం చేసుకొని ఇంకా పెళ్ళిచేసుకోకుండా ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే అతడు ఈ యుద్ధంలో చనిపోతాడేమో, వేరొకడు ఆమెను పెళ్ళి చేసుకొంటాడేమో”.
[8] అధిపతులు ప్రజలతో ఇంకా అనాలి, “ఎవడికైనా భయాందోళనగా ఉందా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే అతడి అధైర్యంవల్ల అతడి సాటి సైనికుల గుండెలు కూడా నీరైపోతాయేమో”.
[9] అధిపతులు ప్రజలతో మాట్లాడడం ముగించాక వారిమీద సేనాధిపతులను నియమించాలి.
[10] ఏదైనా పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు శాంతికోసం రాయబారం పంపించాలి.
[11] ఆ పట్టణస్తులు శాంతి కావాలని ఒప్పుకొని ద్వారం తలుపులు తీస్తే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా మీకు కప్పం కట్టేవాళ్ళవుతారు. సేవ చేస్తారు.
[12] ఆ పట్టణం మీతో సమాధానపడక యుద్ధం జరిగిస్తే దానిని ముట్టడివేయాలి.
[13] మీ దేవుడు యెహోవా దానిని మీ చేతికప్పగించినప్పుడు దానిలో ఉన్న మగ వాళ్ళందర్నీ కత్తివాత హతం చేయాలి.
[14] స్త్రీలను, చిన్నవాళ్ళను, పశువులను, పట్టణంలో ఉండేదంతా కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ దేవుడు యెహోవా మీకిచ్చే మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు.
[15] మీ దగ్గర ఉన్న జనాల పట్టణాలు గాక మీకు చాలా దూరంగా ఉండే పట్టణాలు అన్నిటికీ ఇలాగే చేయాలి.
[16] అయితే మీ దేవుడు యెహోవా మీకు వారసత్వంగా ఇచ్చే జనాల పట్టణాలలో ఊపిరి పీల్చే దేనినీ బ్రతకనివ్వకూడదు.
[17] హిత్తి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవారిని, మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టే, సమూలంగా నాశనం చేయాలి.
[18] వాళ్ళు తమ దేవుళ్ళ విషయం చేసిన అసహ్యమైన పనులు మీకు నేర్పించకుండేలా, వాళ్ళలాగా మీరు మీ దేవుడు యెహోవాకు విరోధంగా పాపాలు చేయకుండేలా వాళ్ళను నిర్మూలించాలి.
[19] ఏదైనా పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి దానిమీదికి యుద్ధానికి వెళ్ళి చాలా రోజులు ముట్టడి వేస్తూవుంటే, అక్కడి చెట్లను గొడ్డలిచేత పాడు చేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలో ఉన్న చెట్లు మనుషులా? వాటి పండ్లు తినవచ్చు గాని, ఆ చెట్లను నరికివేయకూడదు.
[20] ఏ చెట్లయితే తినదగ్గ పండ్లు కాసేవి కావని మీరు తెలుసుకొంటారో వాటిని మాత్రమే పాడు చేయవచ్చు, నరికివేయవచ్చు, మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయేవరకు దానికి ముట్టడి దిబ్బలు వాటితో కట్టవచ్చు.