[1] మీ దేవుడైన యెహోవాకు మచ్చగానీ, లోపం గానీ ఉన్న ఎద్దును, గొర్రెను బలిగా అర్పించకూడదు. అలా చేయడం మీ దేవుడు యెహోవాకు అసహ్యం.
[2] మీ మధ్యలో, మీ దేవుడు యెహోవా మీకిచ్చే గ్రామాలలో ఎవరైనా – పురుషుడు గానీ, స్త్రీ గానీ – మీ దేవుడు యెహోవా ఒడంబడిక మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేసి,
[3] నేనిచ్చిన ఆజ్ఞకు విరోధంగా ఇతర దేవుళ్ళను కొలిచి పూజించారంటే, సూర్యుణ్ణి గానీ, చంద్రుణ్ణి గానీ, ఆకాశ నక్షత్రాలలో ఉన్న దేనినైనా పూజించారంటే,
[4] అది మీకు తెలిసినప్పుడు, మీరు ఆ సంగతి విన్నతరువాత బాగా విచారణ చేయాలి. అది నిజమైతే, అలాంటి అసహ్య కార్యం ఇస్రాయేల్ ప్రజలలో జరగడం నిశ్చయం అయితే,
[5] ఆ దుర్మార్గం చేసిన వ్యక్తిని – పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ – మీ ఊరి ద్వారాల దగ్గరికి తీసుకువచ్చి రాళ్ళు రువ్వి చంపాలి.
[6] ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదే చావవలసిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి– ఒకే సాక్షి మాటమీద కాదు.
[7] ఆ వ్యక్తిని చంపడానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్య నుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి.
[8] హత్యకు హత్యకు, ఫిర్యాదుకు ఫిర్యాదుకు, దెబ్బకు దెబ్బకు, మీ గ్రామాలలో తగాదాలు పుట్టినప్పుడు వాటిని పరిష్కారం చేయడం మీకు చేతకాకపోతే, మీరు లేచి మీ దేవుడైన యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలానికి వెళ్ళాలి.
[9] అక్కడ యాజులైన లేవీగోత్రికుల దగ్గరికి, ఆ రోజుల్లో ఉండబోయే న్యాయాధిపతి దగ్గరికి వచ్చి విచారణ చేయాలి. వారు ఆ సంగతికి తగిన నిర్ణయం తెలుపుతారు.
[10] యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలంలో వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు జరిగించాలి. వారు మీకు ఇచ్చే అన్ని ఉపదేశాలకు అనుగుణంగా చేయడానికి జాగ్రత్తగా ఉండాలి.
[11] వారు మీకిచ్చే ఉపదేశం ప్రకారం, చెప్పే నిర్ణయంప్రకారం మీరు జరిగించాలి. వారు చేసే పరిష్కారంనుంచి కుడికి గానీ, ఎడమకు గానీ మీరు తిరుగకూడదు.
[12] మీ దేవుడైన యెహోవాకు సేవ చేయడానికి అక్కడ నిలబడే ఆ యాజి మాట గానీ, ఆ న్యాయాధిపతి మాట గానీ ఎవడైనా గర్వించి వినకపోతే ఆ మనిషి చావాలి. ఈ విధంగా దుర్మార్గాన్ని ఇస్రాయేల్‌ప్రజలలో లేకుండా నిర్మూలించాలి.
[13] అది విని ప్రజంతా భయపడి, అలా గర్వంగా ప్రవర్తించకుండా ఉంటారు.
[14] మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో చేరి, దానిని స్వాధీనం చేసుకొని, దానిలో నివసించేటప్పుడు “మన చుట్టూరా ఉన్న సమస్త జనాలలాగా మనమీద రాజును నియమించు కుందామ”ని మీరు చెప్పుకొంటే
[15] మీ దేవుడు యెహోవా ఎన్నుకొనేవాణ్ణే మీమీద రాజుగా నియమించుకోవాలి. మీ ప్రజలలోనే ఒక వ్యక్తిని మీమీద రాజుగా నియమించుకోవాలి. ఇస్రాయేల్‌వాడు కాని విదేశీయుణ్ణి మీమీద నియమించు కోకూడదు.
[16] ఆ రాజు ఎక్కువ గుర్రాలను సంపాదించు కోకూడదు. ఎక్కువ గుర్రాలను సంపాదించు కోవడానికి ప్రజలు ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళిపోయేలా అతడు చేయకూడదు. “ఇక నుంచి మీరు ఆ త్రోవన వెళ్ళకూడద”ని యెహోవా మీతో చెప్పాడు గదా.
[17] అతడి హృదయం యెహోవానుంచి తొలగి పోకుండేలా అతడు అనేక స్త్రీలను పెళ్ళి చేసుకోకూడదు. చాలా వెండి బంగారాలు తనకోసం సంపాదించుకోకూడదు.
[18] అతడు రాజ్యసింహాసనం మీద ఆసీనుడైన తరువాత ఈ ధర్మశాస్త్ర ప్రతిని ఒక దానిని తనకోసం వ్రాసుకోవాలి. లేవీగోత్రికులైన యాజుల స్వాధీనంలో ఉన్న గ్రంథం చూచి ఆ ప్రతిని వ్రాసుకోవాలి.
[19] ఆ ప్రతి అతడి దగ్గర ఉండాలి. తాను బ్రతికే రోజులన్నీ దాన్ని చదువుతూ ఉండాలి. అతడు తన దేవుడైన యెహోవాపట్ల భయభక్తులు కలిగి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ మాటలన్నీ, ఈ శాసనాలన్నీ శిరసావహించి వాటిప్రకారం ప్రవర్తించడానికి నేర్చుకోవాలని దీని ఉద్దేశం.
[20] అప్పుడు అతడు తన ప్రజలమీద మిడిసిపడడు, ఈ ఉపదేశంనుంచి కుడికి గానీ, ఎడమకు గానీ తొలగిపోడు. అయితే రాజ్యంలో అతడు, అతడి కొడుకులు ఇస్రాయేల్ ప్రజలమధ్య దీర్ఘ పరిపాలన చేయగలుగుతారు.