Skip to content
Opens in a new window

[1] ఒక మనిషి ఒకామెను పెండ్లి చేసుకొన్న తరువాత ఆమెలో ఏదో అవలక్షణం అతనికి కనిపించడంవల్ల ఆమెను ఇష్టపడడనుకోండి, అతడు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటినుంచి ఆమెను పంపివేస్తాడనుకోండి.

[2] ఆమె అతడి ఇంటినుంచి వెళ్ళి మరో పురుషుణ్ణి పెళ్ళి చేసుకొన్నాక,

[3] ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా, విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి పంపివేస్తాడనుకోండి. లేక, ఆమెను పెండ్లి చేసుకొన్న ఆ రెండోవాడు చనిపోతాడనుకోండి.

[4] అలాంటప్పుడు ఆమెను పంపివేసిన ఆ మొదటి భర్త ఆమెను భార్యగా మళ్ళీ స్వీకరించకూడదు. అతడికి ఆమె అశుద్ధం. అతడు ఆమెను మళ్ళీ చేర్చుకొంటే అది యెహోవాకు అసహ్యం. మీ దేవుడు మీకు వారసత్వంగా ఇచ్చే దేశంమీదికి అపరాధం తెచ్చిపెట్టకూడదు.

[5] ఎవడైనా కొత్తగా పెండ్లి చేసుకొంటే అతడు సైన్యంలో చేరకూడదు. అతడిమీద ఏ సాంఘిక బాధ్యతనూ మోపకూడదు. ఒక సంవత్సరం పూర్తిగా అలాంటి కర్తవ్యాలనుంచి విడుదల అయి, తను చేసుకొన్న భార్యను సంతోషపెట్టాలి.

[6] తిరగలిని గానీ, తిరగటి పై రాతిని గానీ తాకట్టు పెట్టకూడదు. అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.

[7] ఎవడైనా తన దేశస్తులలో – అంటే ఇస్రాయేల్‌ప్రజలలో – మనిషిని బలాత్కారంగా ఎత్తుకుపోయాడని వెల్లడి అయితే ఆ దొంగ చావాలి. అతడు ఆ మనిషిని దాసుడుగా చేసుకొన్నా, అమ్మివేసినా అతడు చావాలి. ఈ విధంగా మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి.

[8] చర్మవ్యాధి విషయంలో లేవీ గోత్రికులైన యాజులు మీకిచ్చే ఉపదేశమంతటి ప్రకారం ప్రవర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వారికాజ్ఞాపించినట్టు చేయడానికి జాగ్రత్తగా ఉండండి.

[9] మీరు ఈజిప్ట్‌నుంచి బయలుదేరి చేసిన ప్రయాణంలో మీ దేవుడు యెహోవా మిర్యాంకు ఏంచేశాడో జ్ఞాపకముంచుకోండి.

[10] మీలో ఎవరైనా పొరుగువాడికి ఏదైనా అప్పు గానీ, ఎరవు గానీ ఇస్తే అతడి దగ్గర వస్తువు తాకట్టు తీసుకోవడానికి అతడి ఇంట ప్రవేశించకూడదు.

[11] బయట నిలబడాలి. అప్పు గానీ, ఎరవు గానీ తీసుకొన్నవాడు బయటికి మీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇవ్వాలి.

[12] అతడు బీదవాడైతే అతడి తాకట్టు ఉంచుకొని పడుకోకూడదు.

[13] అతడు తన బట్టను కప్పుకొని పడుకొని, మిమ్మల్ని దీవించేలా ప్రొద్దు క్రుంకేవేళ ఆ తాకట్టును అతడికి మళ్ళీ అప్పగించి తీరాలి. అది యెహోవా దృష్టికి మీ లెక్కలో ధర్మంగా ఉంటుంది.

[14] ఇస్రాయేల్ వారిలో గానీ, మీ దేశంలో మీ గ్రామాలలో ఉన్న విదేశీయులలో గానీ దరిద్రులైన కూలివారిని బాధించ కూడదు.

[15] ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. ప్రొద్దు క్రుంకే ముందే దాన్ని ఇవ్వాలి. అతడు బీదవాడు గదా. ఆ కూలిమీద ఆశ పెట్టుకొంటాడు. ఆ విషయంలో మీ మీదికి అపరాధం రాకుండేలా, అతడు మీ గురించి యెహోవాకు మొరపెట్టకుండేలా అతడికి కూలి ఇవ్వాలి.

[16] కొడుకుల దోషాన్నిబట్టి తండ్రులకు మరణ శిక్ష విధించకూడదు; తండ్రుల దోషాన్నిబట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవడి పాపానికి వాడే మరణశిక్ష పొందాలి.

[17] విదేశీయులకు గానీ, తండ్రిలేనివారికి గానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. వైధవ్య వస్త్రాన్ని తాకట్టు తీసుకోకూడదు.

[18] మీరు ఈజిప్ట్‌లో దాసులై ఉన్నారనీ మీ దేవుడు యెహోవా మిమ్మల్ని అక్కడనుంచి విడిపించాడనీ జ్ఞాపకముంచుకోవాలి. అందుకనే మీరిలా చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాను.

[19] మీ పొలంలో పంట కోసేటప్పుడు ఒక పన మరచిపోతే అది తేవడానికి తిరిగి వెళ్ళకూడదు. మీ దేవుడు యెహోవా మీ పనులన్నిటిలోను మీకు ఆశీస్సులు ప్రసాదించేలా ఆ పన విదేశీయులకూ, తండ్రిలేనివారికీ, విధవలకూ విడిచిపెట్టాలి.

[20] ఆలీవ్ పండ్లను ఏరేటప్పుడు మీ వెనుక ఉన్న పరిగె ఏరకూడదు. అది విదేశీయులకూ, తండ్రిలేనివారికీ, విధవలకూ విడిచిపెట్టాలి.

[21] ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు నీ వెనుక ఉన్న పరిగె ఏరకూడదు. అది విదేశీయులకూ, తండ్రిలేనివారికీ, విధవలకూ విడిచిపెట్టాలి.

[22] మీరు ఈజిప్ట్‌దేశంలో దాసులై ఉన్నారని జ్ఞాపకముంచుకోవాలి. అందుకనే ఇలా చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాను.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters