[1] ఈలోగా సౌలు ప్రభు శిష్యులను వధిస్తానని బెదిరిస్తూ బుసలు కొడతూ ప్రముఖయాజి దగ్గరకు వెళ్లి
[2] దమస్కులో ఉన్న యూద సమాజ కేంద్రాలవారికి లేఖలు వ్రాసి ఇవ్వాలని కోరాడు. యేసు మార్గాన్ని అనుసరించిన స్త్రీ పురుషులు ఎవరైనా కనిపిస్తే వారిని ఖైదు చేసి జెరుసలం తీసుకురావాలని అతని ఉద్దేశం.
[3] అతడు ప్రయాణం చేసి దమస్కు సమీపానికి చేరాడు. ఉన్నట్టుండి ఆకాశంనుంచి అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది.
[4] అతడు నేలమీద కూలిపోయి తనతో ఒక స్వరం ఇలా మాట్లాడడం విన్నాడు: “సౌలూ! సౌలూ! నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?”
[5] అతడు “ప్రభూ! నీవెవరవు?” అని అడిగాడు. అందుకు ఆయన “నీవు హింసిస్తున్న యేసునే నేను. ములుకోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం.”
[6] అతడు వణకుతూ విస్మయం చెందుతూ “ప్రభూ, నేనేమి చేయాలని కోరుతున్నావు?” అన్నాడు. అప్పుడు “లేచి నగరంలోకి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ నీకు తెలియజేయబడుతుంది” అని ప్రభువు అతనితో అన్నాడు.
[7] అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు గాని ఎవరినీ చూడలేదు. నోట మాట రాక వారు అక్కడ నిలుచున్నారు.
[8] సౌలు నేలమీదనుంచి లేచి కండ్లు తెరచినప్పుడు ఏమీ చూడలేకపోయాడు. వారు అతని చేయి పట్టుకొని దమస్కులోకి నడిపిస్తూ తీసుకుపోయారు.
[9] అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, త్రాగలేదు.
[10] దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు “అననీయా!” అని అతణ్ణి పిలిచాడు. అతడు “ఇదిగో నేను, ప్రభూ!” అన్నాడు.
[11] అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “లేచి ‘తిన్ననిది’ అనే వీధిలో ఉన్న యూదా ఇంటికి వెళ్ళి తార్సు పట్టణస్తుడైన సౌలు అనే మనిషికోసం విచారించు. ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
[12] తనకు చూపు కలిగేలా, అననీయ అనేవాడు లోపలికి వచ్చి తనమీద చేయి ఉంచడం అతడు దర్శనంలో చూశాడు.”
[13] అందుకు అననీయ “ప్రభూ! ఆ మనిషిని గురించి జెరుసలంలో ఉన్న నీ పవిత్రులకు ఎంతో హాని చేశాడని అనేకులు చెప్పగా విన్నాను.
[14] ఇక్కడ కూడా నీ పేర ప్రార్థన చేసేవారందరినీ నిర్బంధించడానికి అతడు ప్రముఖ యాజుల చేత అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు.
[15] అయితే ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “వెళ్ళు! నేను అతణ్ణి పాత్రగా ఎన్నుకొన్నాను. ఇస్రాయేల్ ప్రజల ఎదుట, ఇతర ప్రజల ఎదుట, రాజుల ఎదుట అతడు నా పేరు భరిస్తాడు.
[16] నా పేరుకోసం అతడు ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను.”
[17] అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతనిమీద చేతులుంచి “సౌలూ! సోదరుడా! మీరు చూపు పొంది పవిత్రాత్మతో నిండిపోయేలా, మీరు వచ్చిన దారిన మీకు కనిపించిన యేసుప్రభువు నన్ను పంపాడు” అన్నాడు.
[18] వెంటనే అతని కండ్లనుంచి పొరల్లాంటివి రాలాయి. తక్షణమే అతనికి చూపు వచ్చింది, అతడు లేచి బాప్తిసం పొందాడు.
[19] భోజనం చేసిన తరువాత అతనికి బలం వచ్చింది. అప్పుడు సౌలు దమస్కులో శిష్యులతో కొన్ని రోజులు గడిపాడు.
[20] వెంటనే “క్రీస్తు దేవుని కుమారుడు” అంటూ యూద సమాజ కేంద్రాలలో ఆయనను గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు.
[21] అతని మాటలు విన్నవారంతా ఆశ్చర్యచకితులై “జెరుసలంలో ఈ పేర ప్రార్థన చేసేవారిని నష్టపరచినవాడు ఇతడేగా! అలాంటివారిని నిర్బంధించి ప్రధాన యాజుల దగ్గరికి తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాడు గదా!” అన్నారు.
[22] అయితే సౌలుకు బలప్రభావాలు అంతకంతకు అధికమయ్యాయి. యేసే అభిషిక్తుడు అని రుజువు చేస్తూ, దమస్కులోని యూదులను కలవరపెట్టాడు.
[23] చాలా రోజుల తరువాత యూదులు అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు.
[24] అయితే వారి కుట్ర సౌలుకు తెలియవచ్చింది. అతణ్ణి చంపడానికి రాత్రింబగళ్ళు వారు నగరద్వారాల దగ్గర కావలి కాస్తూ ఉన్నారు.
[25] కనుక శిష్యులు రాత్రివేళ అతణ్ణి తీసుకువెళ్ళి గంపలో ఉంచి గోడలో కిటికీ గుండా క్రిందికి దించారు.
[26] సౌలు జెరుసలంకు వచ్చి శిష్యులను చేరడానికి ప్రయత్నం చేశాడు గానీ అతడు శిష్యుడని నమ్మక వారంతా అతనికి భయపడ్డారు.
[27] అయితే బర్నబా అతణ్ణి చేరదీసి క్రీస్తురాయబారుల దగ్గరికి తోడుకువెళ్ళాడు. అతడు త్రోవలో ప్రభువును చూశాడనీ ప్రభువు అతనితో మాట్లాడాడనీ అతడు దమస్కులో యేసు పేర ధైర్యంగా బోధించాడనీ వారికి వివరించి చెప్పాడు.
[28] కాబట్టి సౌలు జెరుసలంలో వారితోకూడా వస్తూ పోతూ ఉన్నాడు.
[29] అతడు ప్రభు నామాన ధైర్యంగా బోధిస్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులతో తర్కిస్తూ ఉన్నాడు గాని వారతణ్ణి చంపడానికి కంకణం కట్టుకొన్నారు.
[30] ఇది తెలుసుకొని సోదరులు అతణ్ణి సీజరియకు తీసుకువెళ్ళి తార్సుకు పంపారు.
[31] అప్పుడు యూదయ, గలలీ, సమరయలలో అంతటా క్రీస్తు సంఘాలన్నీ ప్రశాంతత అనుభవిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ప్రభువు మీది భయభక్తులతో, పవిత్రాత్మ ప్రసాదించే ఆదరణతో సాగిపోతూ విస్తరిల్లుతూ ఉన్నాయి.
[32] పేతురు నలుదిక్కులకు దేశ సంచారం చేస్తూ ఉంటే లుద్దలో కాపురం ఉన్న పవిత్రులదగ్గరికి కూడా వెళ్ళాడు.
[33] అక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం పట్టి ఉన్న పక్షవాత రోగి అతనికి కనబడ్డాడు. ఆ మనిషి పేరు ఐనెయస్.
[34] అతనితో పేతురు ఇలా అన్నాడు: “ఐనెయసూ! యేసు క్రీస్తు నిన్ను బాగు చేస్తున్నాడు. లేచి నీ పరుపు సర్దుకో.” తక్షణమే అతడు లేచాడు.
[35] లుద్దలో, షారోనులో కాపురమున్న వారంతా అతణ్ణి చూచి ప్రభువువైపుకు తిరిగారు.
[36] యొప్పేలో ఒక శిష్యురాలు ఉంది. ఆమె పేరు తబితా (గ్రీకు అనువాదం ‘దొర్కస్’). ఆమె జీవితం ఆమె చేసిన మంచి పనులతో ఉదార చర్యలతో నిండి ఉండేది.
[37] ఆ రోజుల్లో ఆమె జబ్బు చేసి చనిపోయింది. ఆమె దేహాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు.
[38] లుద్దకు యొప్పే దగ్గరే గనుక లుద్దలో పేతురు ఉన్నాడని విని శిష్యులు ఇద్దరిని అతని దగ్గరకు పంపి అతడు ఆలస్యం చేయక తమవద్దకు రావాలని ప్రాధేయపడ్డారు.
[39] పేతురు లేచి వారితో వెళ్ళాడు. అతడక్కడ చేరినప్పుడు వారతణ్ణి ఆ మేడగదిలోకి తీసుకువెళ్ళారు. విధవరాండ్రంతా అతని దగ్గర నిలుచుండి ఏడుస్తూ, దొర్కస్ తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలూ వేరే వస్త్రాలూ చూపుతూ ఉన్నారు.
[40] అయితే పేతురు అందరినీ బయటికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేశాడు. అప్పుడు మృత దేహం వైపుకు తిరిగి “తబితా, లే!” అన్నాడు. ఆమె కండ్లు తెరచింది, పేతురును చూచి కూర్చుంది.
[41] అతడు ఆమెకు చేయి చాపి ఆమెను లేవనెత్తి పవిత్రులనూ విధవరాండ్రనూ పిలిచి సజీవంగా ఉన్న ఆమెను వారికి అప్పగించాడు.
[42] ఈ సంగతి యొప్పే అంతటా తెలిసి పోయింది. అక్కడ చాలామంది ప్రభువుమీద నమ్మకం ఉంచారు.
[43] పేతురు యొప్పేలో సీమోను అనే చర్మకారుని దగ్గర అనేక రోజులు గడిపాడు.