Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:02

[1] “సోదరులారా! తండ్రులారా! నేనిప్పుడు మీ ఎదుట చెప్పే సమాధానం వినండి.”

[2] అతడు తమతో హీబ్రూ భాషలో మాట్లాడడం విని వారు ఇంకా మౌనం వహించారు. అప్పుడతడు ఇలా అన్నాడు:

[3] “నేను యూదుణ్ణి. నా జన్మస్థలం కిలికియలో ఉన్న తార్సు, గాని ఈ నగరంలోనే గమలీయేల్ పాదాల దగ్గర నన్ను పెంచడం జరిగింది. మన పూర్వీకుల ధర్మశాస్త్రానికి అనుగుణమైన ఖచ్చితమైన విధానంలోనే తర్బీతు పొంది, మీరంతా ఈవేళ ఉన్నట్టే నేనూ దేవునిపట్ల ఆసక్తిపరుడుగా ఉండేవాణ్ణి.

[4] యేసు మార్గాన్ని అనుసరించినవారిని మరణమయ్యేంతవరకు హింసిస్తూ, పురుషులనూ స్త్రీలనూ బంధించి చెరసాలలో వేయిస్తూ వచ్చాను.

[5] దీనికి ప్రముఖయాజి, యూద సభ పెద్దలంతా సాక్ష్యం చెపుతారు. వారు దమస్కులో ఉన్న సోదరులకు లేఖలు రాసి నాకిచ్చారు. దమస్కులో ఈ మార్గాన్ని అనుసరించిన వారిని కూడా ఖైదు చేసి దండనకోసం జెరుసలంకు తీసుకురావాలని అక్కడికి తరలివెళ్ళాను.

[6] “నేను ప్రయాణం చేస్తూ సుమారు మధ్యాహ్న కాలంలో దమస్కు దగ్గరకు చేరాను. ఉన్నట్టుండి ఆకాశంనుంచి గొప్ప వెలుగు నా చుట్టూ మెరిసింది.

[7] నేను నేలమీద పడి ఒక స్వరం నాతో ఇలా మాట్లాడడం విన్నాను: ‘సౌలూ! సౌలూ! నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?’

[8] ‘ప్రభూ! మీరెవరు?’ అని నేను అడిగినప్పుడు ఆయన నాతో ‘నీవు హింసిస్తున్న నజరేతువాడైన యేసునే నేను’ అన్నాడు.

[9] “నాతో ఉన్నవారు ఆ వెలుగు చూచి భయపడ్డారు గాని నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు.

[10] ‘ప్రభూ! నేనేమి చేయాలి?’ అన్నాను. అందుకు ప్రభువు నాతో ఇలా అన్నాడు: ‘లేచి దమస్కులోకి వెళ్ళు. చేయడానికి నీకు నియమించినదంతా అక్కడ నీకు తెలపడం జరుగుతుంది.’

[11] “ఆ కాంతి తేజస్సు కారణంగా నేను ఏమీ చూడలేకపోయాను గనుక నాతో ఉన్నవారు చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉంటే నేను దమస్కులోకి వెళ్ళాను.

[12] “అక్కడ అననీయ అనే వ్యక్తి నా దగ్గరకి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రానికి అనుగుణంగా భయభక్తులున్నవాడు, అక్కడ నివసించే యూదులందరి మధ్య మంచి పేరు గడించినవాడు.

[13] అతడు నా దగ్గర నిలుచుండి ‘సోదరుడా! సౌలూ! దృష్టి పొందండి!’ అన్నాడు. వెంటనే దృష్టి వచ్చి అతణ్ణి చూశాను.

[14] “అప్పుడతడు అన్నాడు ‘తన సంకల్పం తెలుసు కోవడానికీ, ఆ న్యాయవంతుణ్ణి చూడడానికీ, ఆయన నోటి మాట వినడానికీ మన పూర్వీకుల దేవుడు మిమ్ముల్ని ఎన్నుకొన్నాడు.

[15] ఎందుకంటే, మీరు చూచినవీ విన్నవీ చెపుతూ సర్వ ప్రజలకు ఆయన సాక్షిగా ఉంటారు.

[16] అయితే మీరింకా ఆలస్యం చేయడం దేనికి? లేచి బాప్తిసం పొందండి. ఆయన పేర ప్రార్థన చేస్తూ మీ పాపాలు కడిగివేసుకోండి.’

[17] “తరువాత నేను జెరుసలంకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరవశుణ్ణయి ప్రభువును చూశాను.

[18] ఆయన ‘త్వరపడి జెరుసలం విడిచి శీఘ్రంగా వెళ్ళు. నా విషయం నీవు చెప్పే సాక్ష్యాన్ని వారు అంగీకరించరు’ అని నాతో చెప్పాడు.

[19] “అందుకు నేను, ‘ప్రభూ! ప్రతి సమాజ కేంద్రంలో నీమీద నమ్మకం ఉంచినవారిని నేను చెరసాలలో వేయిస్తూ, కొడుతూ ఉండేవాణ్ణని వారికి బాగా తెలుసు.

[20] అంతేగాక, నీ సాక్షి అయిన స్తెఫను రక్తం చిందించబడ్డ సమయంలో నేను కూడా అక్కడే నిలుచుండి అతని మరణానికి సమ్మతిస్తూ అతణ్ణి హతమారుస్తున్నవారి పై వస్త్రాలకు కావలి ఉన్నాను’ అన్నాను.

[21] “అప్పుడు ఆయన నాతో అన్నాడు ‘వెళ్ళు, దూరంగా ఇతర ప్రజల దగ్గరకు నిన్ను పంపుతున్నాను’.”

[22] ఆ మాటవరకు అతడు చెప్పినది వారు వింటూ ఉన్నారు. ఇప్పుడైతే “ఇలాంటివాడు బతకతగడు! భూమిమీద ఉండకుండా వాణ్ణి చంపెయ్యండి!” అని కేకలు పెట్టారు.

[23] వారు అరుస్తూ తమ పైబట్టలు తీసి పారవేస్తూ ఆకాశంవైపు దుమ్మెత్తి పోస్తూ ఉండగా,

[24] అతణ్ణి కోటలోకి తీసుకుపోవాలని సహస్రాధిపతి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఎందుకు కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతణ్ణి కొరడాలతో కొట్టి విచారణ చేయాలని కూడా చెప్పాడు.

[25] వారు పౌలును తోలు వారులతో కట్టివేస్తూ ఉన్నప్పుడు అతడు తనదగ్గర నిలుచున్న శతాధిపతితో “సంగతి విచారణలోకి రాకముందే రోమ్ పౌరుణ్ణి మీరు కొరడా దెబ్బలు కొట్టడం ధర్మమా?” అన్నాడు.

[26] అది విని శతాధిపతి సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి “మీరు చేయబోతున్న దాని గురించి జాగ్రత్త! ఈ మనిషి రోమ్ పౌరుడు!” అన్నాడు.

[27] అప్పుడు ఆ అధిపతి వచ్చి పౌలుతో “నీవు రోమ్ పౌరుడివా? నాకు చెప్పు” అన్నాడు. అతడు “అవును” అన్నాడు.

[28] అధిపతి “చాలా డబ్బిచ్చి ఈ పౌరత్వం సంపాదించు కొన్నాను” అన్నాడు. అందుకు పౌలు “నేనైతే పుట్టుకతోనే రోమ్ పౌరుణ్ణి” అన్నాడు.

[29] అందుచేత అతణ్ణి ప్రశ్నించబోయేవారు వెంటనే వెనక్కు తగ్గారు. అతడు రోమ్ పౌరుడని తెలుసుకొన్నప్పుడు అతణ్ణి బంధించిన కారణంగా సహస్రాధిపతికి కూడా భయం వేసింది.

[30] మరునాడు, యూదులు పౌలుమీద మోపే నేరమేమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆ అధిపతి అతని సంకెళ్ళు తీసివేసి ప్రధానయాజులూ యూద సమాలోచన సభవారూ అంతా హాజరు కావాలని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు పౌలును తీసుకువచ్చి వారిముందు నిలబెట్టాడు.

అపొస్తలుల కార్యాలు — Chapters