Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:33

[1] అయితే అననీయ అనే మనిషి, అతని భార్య సప్పీరా సమ్మతితో ఆస్తిని అమ్మాడు,

[2] ఆ డబ్బులో కొంత ఉంచుకొని కొంత తెచ్చి క్రీస్తురాయబారుల పాదాల దగ్గర పెట్టాడు. అతని భార్యకు అదంతా బాగా తెలుసు.

[3] పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా! భూమి అమ్మిన డబ్బులో కొంత ఉంచుకొని పవిత్రాత్మకు అబద్ధం చెప్పడానికి సైతాను నీ హృదయాన్ని పూర్తిగా ఆక్రమించు కొన్నాడేమిటి?

[4] అది నీ అదుపులో ఉన్నంత వరకు నీదే గదా. అమ్మిన తరువాత కూడా ఆ డబ్బు నీ వశంలోనే ఉంది గదా. ఈ విషయం ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు అబద్ధమాడినది మనుషులతో కాదు, దేవునితోనే!”

[5] ఈ మాటలు వినగానే అననీయ కుప్పకూలి ప్రాణం విడిచాడు. ఈ విషయాల గురించి విన్నవారందరినీ మహా భయం ఆవరించింది.

[6] అప్పుడు యువకులు లేచి అతణ్ణి గుడ్డతో చుట్టి బయటికి మోసుకుపోయి పాతిపెట్టారు.

[7] సుమారు మూడు గంటల సేపటికి అతడి భార్య లోపలికి వచ్చింది. జరిగినది ఆమెకు తెలియదు.

[8] పేతురు ఆమెను “మీరు భూమిని అమ్మినది ఇంతకేనా? నాతో చెప్పు” అని అడిగాడు. ఆమె “అవును, ఇంతకే” అంది.

[9] అప్పుడు పేతురు ఆమెతో అన్నాడు, “‘మీరెందుకు ప్రభు ఆత్మను పరీక్షించడానికి ఏకీభవించారు? ఇదిగో! నీ భర్తను పాతిపెట్టినవారి కాళ్ళు గుమ్మం దగ్గరే ఉన్నాయి. వారు నిన్ను కూడా బయటికి మోసుకుపోతారు!”

[10] తక్షణమే ఆమె అతని కాళ్ళదగ్గర కూలి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చచ్చి ఉండడం చూశారు. ఆమెను బయటికి మోసుకుపోయి ఆమె భర్తదగ్గర పాతిపెట్టారు.

[11] క్రీస్తు సంఘమంతటినీ ఈ సంగతులు విన్నవారందరినీ ఎంతో భయం చుట్టుకొంది.

[12] ప్రజలమధ్య అనేక సూచకమైన క్రియలూ అద్భుతాలూ క్రీస్తు రాయబారుల చేత జరిగాయి. నమ్మిన వారంతా ‘సొలొమోను మంటపం’లో ఏక మనసుతో సమకూడేవారు.

[13] వారితో చేరడానికి తక్కినవారిలో ఇంకెవరికీ ధైర్యం లేదు. అయినా వారిని ప్రజలు గౌరవించేవారు.

[14] అధిక సంఖ్యలో విశ్వాసులైన స్త్రీ పురుషులు ప్రభువుతో చేరుతూ వచ్చారు.

[15] దీనంతటి ఫలితంగా వీధులలో వెళ్తూవున్న పేతురు నీడైనా రోగులలో కొందరిమీదైనా పడాలని ప్రజలు వారిని వీధులలోకి తీసుకువచ్చి మంచాలమీద, పరుపులమీద ఉంచారు.

[16] అంతేగాక, జెరుసలం పరిసరాలలో ఉన్న గ్రామాలనుంచి కూడా జనసమూహాలు రోగులనూ మలిన పిశాచాలచేత బాధలపాలైన వారినీ తీసుకువచ్చారు. వారంతా పూర్తిగా నయం అయ్యారు.

[17] అప్పుడు ప్రముఖయాజి, అతడి పక్షంవారంతా – అంటే సద్దూకయ్యుల తెగవారంతా – అసూయతో నిండిపోయారు.

[18] వారు లేచి క్రీస్తురాయబారులను పట్టుకొని సామాన్యమైన చెరసాలలో వేశారు.

[19] అయితే ఆ రాత్రే ప్రభు దేవదూత ఒకడు చెరసాల తలుపులు తెరచి వారిని బయటికి తీసుకువచ్చి ఇలా అన్నాడు:

[20] “వెళ్ళి దేవాలయంలో నిలబడి, ఈ జీవాన్ని గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి.”

[21] అది విని వారు వేకువ జామున దేవాలయంలో ప్రవేశించి ఉపదేశించసాగారు. అయితే ప్రముఖ యాజి, అతడి పక్షంవారు వచ్చి సమాలోచన సభనూ ఇస్రాయేల్‌ప్రజల పెద్దలందరినీ సమకూర్చి క్రీస్తురాయబారులను తీసుకురండని భటులను చెరసాలకు పంపించారు.

[22] భటులు అక్కడికి చేరినప్పుడు వారు చెరసాలలో లేకపోవడం చూచి తిరిగి వచ్చి

[23] “చెరసాలకు తాళం భద్రంగా వేసివుంది. బయట తలుపుల దగ్గర కావలివాళ్ళు నిలుచున్నారు. కానీ, తలుపులు తెరచి చూస్తే లోపల మాకెవరూ కనిపించలేదు” అన్నారు.

[24] ఆ మాటలు విని ప్రముఖ యాజి దేవాలయం కావలివాళ్ళ అధికారి, ప్రధాన యాజులు ఈ సంగతులు విని అది ఏమవుతుందో అని వారి విషయం కలవరపడ్డారు.

[25] అయితే ఎవరో ఒకరు వచ్చి “చూడండి! మీరు చెరసాలలో వేసిన మనుషులు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు ఉపదేశం ఇస్తూ ఉన్నారు” అన్నాడు.

[26] అప్పుడు ఆ అధికారి భటులతో వెళ్ళి వారిని తీసుకువచ్చాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారేమో అని భయపడి వారు బలవంతమేమీ చేయలేదు.

[27] వారిని తీసుకువచ్చి సమాలోచన సభలో నిలబెట్టారు. అప్పుడు ప్రముఖ యాజి వారిని ప్రశ్నిస్తూ ఇలా అన్నాడు:

[28] “ఆ పేరున ఉపదేశం చేయకూడదని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞ జారీ చేయలేదా? అయినా, ఇదిగో! మీరు జెరుసలంను మీ ఉపదేశాలతో నింపేశారు. ఆ మనిషి రక్తవిషయమైన అపరాధం మామీదికి తేవాలని చూస్తున్నారు.”

[29] అందుకు పేతురు, తక్కిన క్రీస్తురాయబారులు ఇలా జవాబిచ్చారు: “మేము దేవునికే లోబడాలి గానీ మనుషులకు కాదు.

[30] మీరు మ్రానుమీద వ్రేలాడవేసి చంపించిన యేసును మన పూర్వీకుల దేవుడు సజీవంగా లేపాడు.

[31] ఇస్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రసాదించాలని దేవుడు ఆయననే ప్రధానాధికారిగా, ముక్తిప్రదాతగా తన కుడి ప్రక్కన హెచ్చించాడు.

[32] ఈ సంగతులకు మేము సాక్షులం. తనకు విధేయులైనవారికి దేవుడు ప్రసాదించిన పవిత్రాత్మ కూడా సాక్షి.”

[33] ఇది విని సభ వారు కోపంతో మండిపడి వారిని చంపదలచుకొన్నారు.

[34] అయితే గమలీయేల్ అనే పరిసయ్యుడు ఆ సభలో లేచి నిలబడి క్రీస్తురాయబారులను కాసేపు బయట ఉంచాలని వారిని ఆజ్ఞాపించాడు. అతడు ధర్మశాస్త్ర గురువు, ప్రజలంతా గౌరవించినవాడు.

[35] అప్పుడతడు వారితో అన్నాడు, “ఇస్రాయేల్ మనుషులారా, మీరు ఆ మనుషులను ఏమి చేయాలనుకొంటున్నారో మీ విషయం జాగ్రత్తగా ఉండండి.

[36] కొంత కాలం క్రిందట థూదా బయలుదేరి గొప్పవాణ్ణని చెప్పుకొన్నాడు. దాదాపు నాలుగు వందలమంది మనుషులు వాడి పక్షం చేరారు. అయితే వాణ్ణి చంపడం, వాని అనుచరులందరినీ చెదరగొట్టడం జరిగింది. అదంతా వ్యర్థమైపోయింది.

[37] ఆ మనిషి తరువాత, జనాభా లెక్క వ్రాసే దినాలలో, గలలీవాడైన యూదా బయలుదేరి అనేకమందిని తన వెంట ఈడ్చుకుపోయాడు. కానీ వాడు కూడా నాశనమయ్యాడు. వాని అనుచరులంతా చెల్లా చెదురయ్యారు.

[38] కనుక ఇప్పుడు నేను మీతో చెప్పేదేమిటంటే, ఆ మనుషుల జోలికి వెళ్ళకండి. వారిని విడిచిపెట్టండి. ఆ ఆలోచన, లేక ఆ క్రియాశీలత పని మనుషులమూలంగా కలిగినదైతే అది భంగం అవుతుంది.

[39] అది దేవుని మూలంగా కలిగినదే గనుక అయితే దాన్ని మీరు భంగపరచలేరు. ఒకవేళ మీరు దేవునితోనే పోట్లాడే వారవుతారేమో భద్రం!”

[40] అతనితో వారు సమ్మతించారు. వారు క్రీస్తురాయబారులను పిలిపించి కొరడాలతో కొట్టించి యేసు పేర మాట్లాడకూడదని వారికి ఆజ్ఞాపించారు. అప్పుడు వారిని విడిచిపెట్టారు.

[41] ఆయన పేరుకోసం అవమానానికి పాత్రులుగా ఎంచబడినందుచేత వారు ఆనందిస్తూ సమాలోచన సభనుంచి వెళ్ళిపోయారు.

[42] యేసే అభిషిక్తుడు అని వారు ప్రతి రోజూ దేవాలయంలో, ఇంటింటా ఉపదేశిస్తూ ప్రకటిస్తూ ఉండడం మానలేదు.

అపొస్తలుల కార్యాలు — Chapters