Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:11

[1] అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు పౌలు ఎత్తయిన ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఎఫెసుకు వెళ్ళాడు. అక్కడ కొందరు శిష్యులను చూచి

[2] “మీరు నమ్ముకొన్నప్పుడు పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు. అందుకు వారు “పవిత్రాత్మ ఉన్న విషయమే మేము వినలేదు” అని అతనితో చెప్పారు.

[3] అప్పుడతడు “అయితే మీరు దేనిలోకి బాప్తిసం పొందారు?” అని వారిని అడిగాడు. వారు “యోహాను బాప్తిసంలోకి” అన్నారు.

[4] అందుకు పౌలు ఇలా అన్నాడు: “యోహాను పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిసం ఇచ్చాడు. తన వెనుక వచ్చేవానిమీద, అంటే క్రీస్తు యేసు మీద నమ్మకం ఉంచాలని అతడు ప్రజలతో చెప్పాడు.”

[5] ఇది విని వారు యేసు పేరులోకి బాప్తిసం పొందారు.

[6] పౌలు వారిమీద చేతులుంచినప్పుడు పవిత్రాత్మ వారిమీదికి వచ్చాడు. వారు వేరే భాషలలో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు.

[7] అంతా కలిసి వారు దాదాపు పన్నెండుగురు పురుషులు.

[8] తరువాత అతడు యూద సమాజకేంద్రానికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతూ, దేవుని రాజ్యాన్ని గురించి ఒప్పించే విధంగా తర్కిస్తూ ఉన్నాడు. ఇలా మూడు నెలలు గడిపాడు.

[9] అయితే కొందరు కఠిన హృదయులై, నమ్మడానికి నిరాకరించి, ప్రజల గుంపుల ముందు ప్రభు మార్గాన్ని దూషించారు. అప్పుడు అతడు వారిని విడిచి శిష్యులను తీసుకువెళ్ళి తరన్నస్ ప్రసంగశాలలో ప్రతి రోజూ తర్కించాడు.

[10] రెండు సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉండడంచేత ఆసియా రాష్ట్రంలో కాపురమున్న యూదులేమీ గ్రీసు దేశస్థులేమీ అందరూ ప్రభు వాక్కు విన్నారు.

[11] పౌలుచేత దేవుడు అసాధారణ అద్భుతాలు చేయించాడు –

[12] అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గానీ నడికట్లు గానీ రోగుల దగ్గరకు తెచ్చినప్పుడు రోగాలు వారిని విడిచాయి. దయ్యాలు వారిలో నుంచి వెళ్ళాయి.

[13] అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై “పౌలు ప్రకటించే యేసు పేర ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు.

[14] యూద ప్రధానయాజి ఒకడైన స్కెవ కొడుకులు ఏడుగురు అలా చేశారు.

[15] ఆ దయ్యం వారితో “యేసంటే నాకు తెలుసు. పౌలు కూడా తెలుసు గానీ మీరెవరు?” అంది.

[16] అప్పుడు దయ్యం ఎవరిలో ఉన్నదో అతడు వారిమీద ఎగిరి దూకి వారిని అణచివేసి ఓడగొట్టాడు గనుక గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు.

[17] ఈ సంగతి ఎఫెసు నగరవాసులైన యూదులకూ గ్రీసు దేశస్థులకూ అందరికీ తెలిసింది. అందరినీ భయం ఆవరించింది. ప్రభువైన యేసు పేరుకు ఘనత కలిగింది.

[18] విశ్వాసులనేకులు వచ్చి తాము చేసిన చెడు క్రియాకలాపాలు తెలియజేసి ఒప్పుకొన్నారు.

[19] అంతేగాక మంత్రవిద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వాటి వెల లెక్కించారు – ఆ మొత్తం యాభై వేల వెండి నాణేలు.

[20] ఇలా ప్రభు వాక్కు ప్రభావంతో అధికం అవుతూ వ్యాపిస్తూ ఉంది.

[21] ఇలా జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయల గుండా ప్రయాణం చేస్తూ జెరుసలంకు వెళ్ళాలని ఆత్మలో నిశ్చయించుకొన్నాడు. “అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ కూడా చూడాలి” అన్నాడు.

[22] కనుక తనకు సహాయం చేసేవారిలో ఇద్దరిని మాసిదోనియకు పంపాడు. వారు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియాలో ఇంకా కొంత కాలం ఉండిపోయాడు.

[23] ఆ కాలంలో క్రీస్తు మార్గాన్ని గురించి చాలా కల్లోలం పుట్టింది.

[24] దేమేత్రియస్ అనే కంసాలి అర్తెమిదేవికి వెండి గర్భగుళ్ళ నమూనాలను చేయిస్తూ ఆ పనివారికి చాలా లాభం కలిగించేవాడు.

[25] అతడు వారినీ అలాంటి పని చేసే ఇతరులనూ పోగుచేసి ఇలా అన్నాడు: “అయ్యలారా, ఈ వ్యాపారంవల్ల మనకు బాగా జీవనం జరుగుతూ ఉందని మీకు తెలుసు.

[26] అంతే కాదు. చేతులతో చేసిన దేవతలు దేవతలే కావని ఈ పౌలు చెప్తూ ఎఫెసులో మాత్రమే గాక దాదాపు ఆసియా రాష్ట్రం అంతటా ప్రజలనేకులను ఒప్పించి తిప్పివేశాడు. ఈ సంగతి మీరు విన్నారు, చూశారు.

[27] ఇప్పుడు అపాయం ఉంది– ఈ మన వృత్తికి చెడ్డ పేరు వస్తుందేమో. ఇంతే గాక, అర్తెమి మహా దేవి గుడి తృణీకారానికి గురి అయి ఆసియా అంతటా, లోకమంతటా పూజలందు కుంటున్న ఈమె దివ్యత్వం నాశనం అవుతుందేమో.”

[28] ఇది విని వారు కోపోద్రేకంతో నిండిపోయి “ఎఫెసువారి అర్తెమి గొప్పది!” అని కేకలు పెట్టసాగారు.

[29] నగరమంతా గందరగోళం అయిపోయింది. వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియవారైన గాయియసును అరిస్తర్కసును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు.

[30] పౌలు ప్రజల దగ్గరకు వెళ్ళాలని కోరాడు గాని శిష్యులు అతణ్ణి వెళ్ళనివ్వలేదు.

[31] ఆసియా రాష్ట్రాధికారులలో కొందరు అతనికి స్నేహితులు. వారు కూడా “నాటకశాలలోకి వెళ్ళవద్ద”ని వేడుకొంటూ అతనికి కబురు పంపారు.

[32] ఆ సభ గందరగోళంగా ఉండడం కారణంగా కొందరు ఇలా, మరికొందరు అలా కేకలు వేస్తూ వచ్చారు. ఎక్కువమంది అసలు తాము ఎందుకు గుమికూడారో తెలుసుకోలేదు.

[33] యూదులు అలెగ్జాండర్‌ను ముందుకు తోస్తే, ఆ సమూహంలో కొందరు అతణ్ణి సభ ఎదుటికి తెచ్చారు. ప్రజలతో ప్రతివాదన చెప్పుకోవాలని అలెగ్జాండర్ చేసైగ చేశాడు.

[34] కానీ అతడు యూదుడని అప్పుడు వారు గుర్తించి ఏక కంఠంతో సుమారు రెండు గంటల సేపు “ఎఫెసువారి అర్తెమి గొప్పది!” అని అరిచారు.

[35] ఆ తరువాత కరణం ఆ గుంపును శాంతపరచి ఇలా అన్నాడు: “ఎఫెసు మనుషులారా! మహా దేవి అర్తెమి గుడికీ ఆకాశంనుంచి పడ్డ శిలకూ ధర్మకర్తగా ఉన్నది ఎఫెసు నగరమే అని తెలియనివారెవరు?

[36] ఈ విషయాలు ఎవరూ కాదనలేరు గనుక మీరు శాంతం వహించి దుడుకుగా ఏమీ చేయకూడదు.

[37] మీరు ఈ మనుషులను తీసుకువచ్చారు. వీరు గుళ్ళు దోచుకొనేవారు కారు, మీ దేవిని దూషించినవారూ కారు.

[38] అందుచేత దేమేత్రియస్, అతనితో ఉన్న చేతిపనివారు ఎవరైన ఒక వ్యక్తిమీద ఫిర్యాదు చేయాలని ఉంటే వారు ఒకరితో ఒకరు వ్యాజ్యెమాడవచ్చు – న్యాయసభలు సమావేశమైవున్నాయి, రాష్ట్రాధికారులూ ఉన్నారు.

[39] మీరు ఇంకా వేరే విచారణ ఏదైనా చేయాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం కావాలి.

[40] ఈ రోజు అల్లరి గురించి మనమీద నేరం మోపడం జరుగుతుందేమో అనే ప్రమాదంలో ఉన్నాం. అలాంటప్పుడు ఇలా దొమ్మిగా కూడినందుకు తగిన కారణం చెప్పలేము.”

[41] ఇలా చెప్పి అతడు సమకూడినవారిని పంపివేశాడు.

అపొస్తలుల కార్యాలు — Chapters