[1] వారు తప్పించుకొన్న తరువాత అది మాల్త ద్వీపం అని తెలిసింది.
[2] ద్వీపవాసులు మాపట్ల చూపిన దయ అసాధారణమైనది. ఎలాగంటే, అప్పుడు వర్షం పడుతూ ఉంది, చలిగా ఉంది, గనుక వారు చలిమంట వేసి మమ్మల్నందరినీ చేర్చుకొన్నారు.
[3] అయితే పౌలు ఒక మోపు కట్టెలు ఏరి మంటలో వేస్తూ ఉంటే విషసర్పం ఒకటి మంట సెగకు బయటికి వచ్చి అతని చేయి పట్టుకొంది.
[4] ఆ ప్రాణి అతని చేతినుంచి వ్రేలాడడం చూచి ద్వీపవాసులు “ఈ మనిషి తప్పక హంతకుడై ఉండాలి. సముద్రంనుంచి తప్పించుకున్నా ధర్మదేవత అతణ్ణి బతకనివ్వడం లేదు” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
[5] అతడైతే ఆ విషప్రాణిని మంటలో విదిల్చివేసి ఏమీ హాని పొందలేదు.
[6] అతని ఒళ్ళుకు వాపు వస్తుంది, లేదా అతడు తటాలున పడి చస్తాడు అనుకొని వారు చూస్తూ ఉన్నారు. చాలా సేపు చూచిన తరువాత అతనికి ఏమీ హాని కలగలేదని గ్రహించి మనసు మార్చుకొని “ఇతడు ఒక దేవుడు” అని చెప్పుకొన్నారు.
[7] ఆ ద్వీపంలో ముఖ్యుడు పొప్లి అనేవాడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్ములను చేర్చుకొని మూడు రోజులు స్నేహభావంతో అతిధి సత్కారాలు చేశాడు.
[8] పొప్లి తండ్రి జ్వరంతో, రక్తవిరేచనాలతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. పౌలు లోపలికి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తరువాత అతనిమీద చేతులుంచి అతణ్ణి బాగు చేశాడు.
[9] ఇలా జరిగిన తరువాత ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు.
[10] వారు అనేక విధాలుగా మమ్ములను ఆదరించారు. మేము బయలుదేరి నప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఇచ్చారు.
[11] మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచిపోయిన ఓడలో బయలుదేరాం. అది అలెగ్జాండ్రియ నగరానికి చెందినది. దాని మీద ‘అశ్వినీ’ చిహ్నం ఉంది.
[12] సురకూస్ రేవుకు చేరి అక్కడ మూడు రోజులు గడిపాం.
[13] అక్కడనుంచి చుట్టూ వెళ్ళి రేగియుకు వచ్చి ఒక్క రోజు తరువాత దక్షిణం గాలి వీచడంచేత మరునాడు పొతియొలీ చేరుకొన్నాం.
[14] అక్కడ కొందరు సోదరులను మేము చూశాం. వారు తమదగ్గర ఏడు రోజులు గడపాలని మమ్ములను వేడుకొన్నారు. ఆ విధంగా రోమ్ నగరం వైపుకు వెళ్ళాం.
[15] అక్కడనుంచి సోదరులు మా విషయం విని మమ్ములను ఎదుర్కోవడానికి వచ్చారు. ‘అప్పీయా ఫోరం’ వరకూ ‘త్రియొన్ తాబెర్నొన్’ వరకూ వచ్చారు. వారిని చూచి పౌలు దేవునికి కృతజ్ఞత చెప్పి ధైర్యం తెచ్చుకొన్నాడు.
[16] మేము రోమ్కు చేరినతరువాత శతాధిపతి కావలివారి పై అధిపతికి ఆ ఖైదీలను అప్పగించాడు. అయితే పౌలుకు తనను కావలి కాస్తున్న సైనికుడితోపాటు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు దొరికింది.
[17] మూడు రోజులైన తరువాత పౌలు యూదుల నాయకులను తనదగ్గరకు పిలవనంపించాడు. వారు సమకూడినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు: “అయ్యలారా, సోదరులారా, నేను మన ప్రజలకు గానీ మన పూర్వీకుల ఆచారాలకూ గానీ వ్యతిరేకమైనది ఏదీ చేయక పోయినా జెరుసలంలోనుంచి రోమ్వారి చేతికి నన్ను ఖైదీగా అప్పగించడం జరిగింది.
[18] వీరు నన్ను విచారణ చేసి నా విషయంలో మరణానికి తగిన కారణం ఏదీ లేదని నన్ను విడుదల చేయాలని ఉద్దేశించారు.
[19] కానీ యూదులు అడ్డం చెప్పినప్పుడు నేను చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననవలసి వచ్చింది. అంతేగాని, నేను స్వజనం మీద ఏదైనా నేరం మోపాలని మాత్రం కాదు.
[20] ఈ కారణంచేతనే మిమ్ములను చూచి మాట్లాడాలని పిలిచాను. ఇస్రాయేల్ ప్రజల ఆశాభావాన్ని బట్టే ఈ సంకెళ్ళ పాలయ్యాను.”
[21] అందుకు వారు అతనితో “యూదయనుంచి మీ గురించి మాకు ఉత్తరాలు రాలేదు. ఇక్కడికి వచ్చిన సోదరులలో ఎవరూ మీ గురించి చెడు సంగతి ఏదీ మాకు తెలపలేదు, ఎవరూ చెప్పుకోలేదు.
[22] అయినా ఈ మతశాఖకు వ్యతిరేకంగా మాట్లాడడం అంతటా జరుగుతూ ఉందని మాత్రం మాకు తెలుసు గనుక మీ ఆలోచనలేవో మీవల్ల వినాలని మా కోరిక.”
[23] అతనికి తేది నియమించి ఆ రోజున అతని బసలోకి అతని దగ్గరకు చాలామంది వచ్చారు. ఉదయంనుంచి సాయంకాలంవరకు అతడు దేవుని రాజ్యాన్ని గురించి వివరిస్తూ సాక్ష్యాధారాలతో చెపుతూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలోనుంచీ ప్రవక్తల వ్రాతల లోనుంచీ సంగతులెత్తి యేసును గురించి వారిని ఒప్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.
[24] అతడు చెప్పిన దానికి కొందరు ఒప్పించబడ్డారు, మరి కొందరు నమ్మడానికి నిరాకరించారు.
[25] వారి మధ్య ఏకీభావం కుదరక వారు వెళ్ళబోతూ ఉంటే పౌలు ఈ మాట వారితో అన్నాడు: “యెషయాప్రవక్త ద్వారా పవిత్రాత్మ మన పూర్వీకులతో చెప్పిన మాట తగినదే.
[26] అదేమిటంటే, నీవు ఈ ప్రజలదగ్గరికి వెళ్ళి ఈవిధంగా చెప్పు, ‘మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు. ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.
[27] ఎందుకంటే, ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి. వారికి ఏదీ చెవికెక్కదు. వారు తమ కండ్లు మూసుకొన్నారు. వారు కండ్లతో చూచి చెవులతో విని వారి హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు తిరగకుండా, నేను వారిని బాగు చేయకుండా అలా చేశారు.
[28] “కాబట్టి, దేవుడు ప్రసాదించిన రక్షణ, పాపవిముక్తి యూదేతరుల దగ్గరకు పంపడం జరిగిందని మీరు తెలుసుకోండి. వారు వింటారు.”
[29] అతడీ మాటలు చెప్పిన తరువాత తమ మధ్య తీవ్ర వివాదం జరిగిస్తూ యూదులు వెళ్ళిపోయారు.
[30] పౌలు రెండేళ్ళు పూర్తిగా అద్దె ఇంట్లో నివాసముండి తన దగ్గరకు వచ్చిన వారందరినీ సత్కరించాడు.
[31] సంపూర్ణ ధైర్యంతో, నిరాటంకంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ప్రభువైన యేసు క్రీస్తును గురించి ఉపదేశిస్తూ ఉన్నాడు.