Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:32

[1] పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారంతా ఏకగ్రీవంగా ఒక్క స్థలంలో సమకూడి ఉన్నారు.

[2] హఠాత్తుగా బలమైన గాలి హోరుమని వీచే విధంగా ఒక ధ్వని ఆకాశం నుంచి వచ్చి వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నింపివేసింది.

[3] అప్పుడు జ్వాలల్లాంటి నాలుకలు వారికి కనిపించాయి. అవి విడిపోయి వారిలో ప్రతి ఒక్కరిమీదా వాలాయి.

[4] వారందరూ పవిత్రాత్మతో నిండిపోయారు. ఆ ఆత్మ వారికి మాట్లాడే శక్తి ఇచ్చిన ప్రకారం ఇతర భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు.

[5] ఆ కాలంలో, ఆకాశంక్రింద ఉన్న ప్రతి జనంలో నుంచి వచ్చిన యూదులు – భక్తిపరులైన పురుషులు – జెరుసలంలో నివాసమున్నారు.

[6] ఆ శబ్దం వినిపించినప్పుడు జన సమూహం అక్కడ గుమికూడారు. ప్రతి ఒక్కరూ తన మాతృభాషలోనే శిష్యులు మాట్లాడడం విని కలవరపడ్డారు.

[7] వారు ఆశ్చర్యంతో, విస్మయంతో నిండిపోయి ఒకరితో ఒకరు ఇలా అన్నారు: “చూడండి! మాట్లాడుతున్న వీరంతా గలలీ ప్రాంతీయులే గదా.

[8] మనలో ప్రతి ఒక్కరమూ మన మాతృభాషలో వింటున్నామే. ఇదేమిటి?

[9] పార్తియ దేశస్థులు, మాదీయులు, ఏలాం దేశస్థులు, మెసొపొటేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా,

[10] ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్ట్ ప్రదేశాల నివాసులు, కురేనే దగ్గర ఉన్న లిబియ దేశవాసులు, రోమ్ నుంచి వచ్చి కాపురమున్నవారు, యూదులు, యూద మతంలో ప్రవేశించినవారు,

[11] క్రేతు, అరేబియా దేశాలవారు – మనం మన సొంత భాషలలో వీరు దేవుని మహాక్రియలను గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం!”

[12] వారంతా ఆశ్చర్యపడ్డారు, విస్తుపోయారు, “దీని భావమేమిటి?” అని ఒకరినొకరు అడిగారు.

[13] కొందరైతే “వీరు కొత్త ద్రాక్షమద్యంతో నిండివున్నారు” అంటూ వేళాకోళం చేశారు.

[14] అప్పుడు పేతురు పదకొండుమందితో కూడా నిలబడి స్వరమెత్తి వారితో ఇలా చెప్పాడు: “యూదయ మనుషులారా! జెరుసలం నివాసులారా! మీరంతా ఈ సంగతి తెలుసుకోవాలి – నేను చెప్పేది వినండి.

[15] మీరు అనుకొన్నట్టు వీరు మత్తుగా లేరు. ఇప్పుడు ప్రొద్దున తొమ్మిది గంటలయింది, అంతే.

[16] “కానీ ఇది యోవేలుప్రవక్త చెప్పినది.

[17] అదేమంటే ‘దేవుడు అంటున్నాడు, చివరి రోజుల్లో నా ఆత్మను సర్వ ప్రజలమీద కుమ్మరిస్తాను. మీ కొడుకులూ కూతుళ్ళూ దేవునిమూలంగా పలుకుతారు. మీ యువకులకు దర్శనాలు కనిపిస్తాయి. మీ ముసలివారు కలలు కంటారు.

[18] ఆ రోజుల్లో నా సేవకులమీద, నా సేవికలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు దేవునిమూలంగా పలుకుతారు.

[19] పైన ఆకాశంలో అద్భుతాలు చూపుతాను, కింద భూమిమీద సూచనలు – రక్తం, మంటలు, పొగతో నిండిన ఆవిరి కలిగిస్తాను.

[20] ప్రభు మహా ప్రసిద్ధ దినం రాకముందు సూర్యమండలం చీకటిగానూ చంద్రగోళం రక్తంలాగా మారుతాయి.

[21] అప్పుడు ఎవరైతే ప్రభువు పేర ప్రార్థన చేస్తారో వారికి పాపవిముక్తి కలుగుతుంది.’

[22] “ఇస్రాయేల్ మనుషులారా! ఈ మాటలు వినండి. దేవుడు నజరేతువాడైన యేసుచేత అద్భుతాలు, వింతలు, సూచకమైన క్రియలు మీమధ్య చేయించడంద్వారా ఆయన దేవుని దృష్టిలో యోగ్యుడై ఉన్నట్టు మీకు వెల్లడి చేశాడు. ఇది మీకే తెలుసు.

[23] దేవుని నిర్ణయమైన ఏర్పాటు ప్రకారం, భవిష్యత్తును ఎరిగిన జ్ఞానం ప్రకారం ఆయనను అప్పగించడం జరిగింది. మీరు అన్యాయమైన చేతులతో ఆయనను పట్టుకొని సిలువ వేయించి చంపించారు.

[24] అయితే మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు ఆయనను మరణ వేదనలనుంచి విడిపించి సజీవంగా లేపాడు.

[25] ఆయనను గురించి దావీదు ఇలా అన్నాడు: ప్రభువును నా ఎదుటే నేనెప్పుడు చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక ఏదీ నన్ను కదల్చదు.

[26] అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక నా ఆనందాన్ని బయలుపరుస్తున్నది. నా శరీరం కూడా ఆశాభావంతో ఉంటుంది.

[27] ఎందుకంటే, నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారవిడువవు. నీ పవిత్రుణ్ణి కుళ్ళిపోనియ్యవు.

[28] జీవ పథాలు నీవు నాకు చూపావు. నీ సన్నిధానంలో నీవు నన్ను ఆనందంతో నింపుతావు.

[29] “అయ్యలారా, సోదరులారా! పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి పాలయ్యాడు. నేటివరకు అతని సమాధి మన మధ్య ఉంది.

[30] అతడు ప్రవక్త. అతని సంతానంలో శరీర సంబంధంగా అతని సింహాసనం మీద కూర్చోవడానికి క్రీస్తును లేపుతానని దేవుడు శపథం చేసి తనతో ప్రమాణం చేసిన సంగతి అతనికి తెలుసు.

[31] అతడు భవిష్యత్తులోకి చూస్తూ, క్రీస్తును మృత్యులోకంలో విడిచిపెట్టడమూ ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడమూ జరగలేదని చెప్పాడు. క్రీస్తు సజీవంగా లేచిన సంగతిని గురించి చెప్పాడన్న మాటే.

[32] “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.

[33] ఆయనను దేవుని కుడిప్రక్కకు హెచ్చించడం జరిగింది. పవిత్రాత్మను గురించిన వాగ్దానం తండ్రి చేత ఆయన పొంది ఇప్పుడు మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న దీనిని కుమ్మరించాడు.

[34] దావీదు ఆకాశాలలోకి ఎక్కిపోలేదు గాని అతడు ఇలా అన్నాడు: ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు:

[35] నీ శత్రువులను నీ పాదాల క్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.’

[36] “అందుచేత ఇస్రాయేల్‌ప్రజలంతా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయమేమంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగా, అభిషిక్తుడుగా దేవుడు నియమించాడు.”

[37] ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయింది. “పురుషులారా, సోదరులారా! మేమేం చేయాలి?” అని వారు పేతురునూ తక్కిన రాయబారులనూ అడిగారు.

[38] పేతురు వారితో ఇలా అన్నాడు: “పశ్చాత్తాపపడండి! పాపక్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు పేర బాప్తిసం పొందండి. అలా చేస్తే పవిత్రాత్మ అనే వరం మీరు పొందుతారు.

[39] ఈ వాగ్దానం మీ కోసం, మీ సంతానం కోసం, దూరంగా ఉన్న వారందరి కోసం – అంటే, మన ప్రభువైన దేవుడు పిలిచేవారందరికోసం.”

[40] అతడింకా అనేక మాటలతో గంబీరంగా సాక్ష్యమిచ్చి “వక్ర బుద్ధులైన ఈ తరం వారి నుంచి తప్పించుకోండి” అని వారిని హెచ్చరించాడు.

[41] అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించినవారు బాప్తిసం పొందారు. ఆ రోజు సుమారు మూడు వేలమంది వారితో చేరారు.

[42] వీరు క్రీస్తురాయబారుల ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు.

[43] ప్రతి ఒక్కరికీ భయం ముంచుకు వచ్చింది. క్రీస్తురాయబారులు అనేక ఆశ్చర్యకరమైన క్రియలు, సూచకమైన అద్భుతాలు చేశారు.

[44] విశ్వాసులంతా ఒకటిగా కలిసి తమకు కలిగినదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు.

[45] ఇదీ గాక, తమ ఆస్తిపాస్తులు అమ్మి ప్రతి ఒక్కరికీ అక్కరకొలది పంచి ఇస్తూ వచ్చారు.

[46] ప్రతి రోజూ ఎడతెగకుండా వారు ఏకమనస్సుతో దేవాలయంలో ఉన్నారు. ఇంటింట రొట్టె విరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆనందంతోనూ యథార్థ హృదయాలతోనూ కలిసి భోజనం చేసేవారు.

[47] ప్రజలంతా వారిని అభిమానించారు. పాపవిముక్తి పొందుతున్నవారిని ప్రతి రోజూ ప్రభువు తన సంఘంతో చేరుస్తూ వచ్చాడు.

అపొస్తలుల కార్యాలు — Chapters