[1] ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను పిలువనంపి వారిని కౌగిలించి మాసిదోనియకు బయలుదేరి వెళ్ళాడు.
[2] ఆ ప్రాంతంలో సంచారం చేస్తూ అక్కడివారిని అనేక మాటలతో ప్రోత్సహిస్తూ గ్రీసు దేశం చేరాడు.
[3] అక్కడ మూడు నెలలు గడిపాడు. అతడు సిరియాకు ఓడ ప్రయాణం చేయబోతూ ఉంటే, యూదులు అతనిమీద కుట్ర పన్నినందుచేత తిరిగి మాసిదోనియ గుండా వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు.
[4] అతనితోకూడా ఆసియాకు వెళ్ళినవారు బెరియ గ్రామస్థుడైన సోపత్రు, అరిస్తర్కస్, తెస్సలొనీక పట్టణస్థుడైన సెకుందస్, దెర్బే పట్టణస్థుడైన గాయియస్, తిమోతి, ఆసియా రాష్ట్రం వారైన తుకికస్, త్రోఫిమస్.
[5] వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మాకోసం చూస్తూ ఉన్నారు.
[6] పొంగని రొట్టెల రోజులయిన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ నుంచి బయలుదేరి అయిదు రోజులలో త్రోయకు వారి దగ్గరకి చేరుకొన్నాం. అక్కడ ఏడు రోజులు గడిపాం.
[7] ఆదివారం నాడు శిష్యులు రొట్టె విరవడానికి సమకూడారు. మర్నాడు వెళ్ళాలని పౌలు ఉద్దేశపడి వారితో మాట్లాడుతూ మధ్యరాత్రివరకు తన సందేశం ముగించకుండా మాట్లాడుతూ ఉన్నాడు.
[8] వారు సమకూడిన మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి.
[9] ఒక కిటికీలో యుతుకస్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. అతనికి గాఢ నిద్ర ముంచుకు వస్తూ ఉంది. పౌలు ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉంటే అతడు బాగా నిద్రపోయి మూడో అంతస్తు నుంచి క్రింద పడిచనిపోయాడు. ఆ చనిపోయినవాణ్ణి ఎత్తి పట్టుకొన్నారు.
[10] అయితే పౌలు క్రిందికి వెళ్ళి అతనిమీద సాష్టాంగపడి కౌగలించుకొని “కంగారుపడకండి. ఇతనిలో ప్రాణం ఉంది” అన్నాడు.
[11] అతడు మళ్ళీ పైకి వెళ్ళి రొట్టె విరిచి తిన్నాడు. చాలా సేపు – ప్రొద్దు పొడిచేవరకూ – వారితో మాట్లాడిన తరువాత వెళ్ళిపోయాడు.
[12] వారు ఆ యువకుణ్ణి సజీవంగా లోపలికి తీసుకువచ్చి ఎంతో ఆదరణ పొందారు.
[13] మేము ముందుగా సాగిపోయి ఓడ ఎక్కి అస్సొసుకు వెళ్ళాం. అక్కడ పౌలును ఓడ ఎక్కించుకోవాలని మా ఉద్దేశం. పౌలు తానే అలా ఏర్పాటు చేశాడు. అతడు కాలి నడకన వెళ్ళాలనుకొన్నాడు.
[14] అస్సొసులో మమ్ములను కలసినప్పుడు మేము అతణ్ణి ఓడ ఎక్కించుకొని మితులేనేకు వెళ్ళాం.
[15] అక్కడనుంచి బయలుదేరి మరునాడు కీయొసుకు ఎదురుగా వెళ్ళాం. మరుసటి రోజు సమొసు ద్వీపం చేరి త్రొగిల్లియంలో ఆ రాత్రి గడిపాం. ఆ మరుసటి రోజు మిలేతస్ చేరుకొన్నాం.
[16] ఆసియా రాష్ట్రంలో కాలం గడపకుండా ఎఫెసును దాటిపోవాలని పౌలు నిశ్చయించుకొన్నాడు. ఎందుకంటే సాధ్యమైతే పెంతెకొస్తు రోజు జెరుసలంలో ఉండాలని అతడు ఆతురతతో ఉన్నాడు.
[17] మిలేతస్ నుంచి అతడు ఎఫెసుకు కబురంపి సంఘం పెద్దలను పిలిపించాడు.
[18] వారు తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు: “నేను ఆసియాలో అడుగు పెట్టిన ఆ మొదటి రోజునుంచి ఇప్పటిదాకా మీమధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు.
[19] యూదుల కుట్రలవల్ల నాకు విషమ పరీక్షలు కలిగినా, కన్నీళ్ళు విడుస్తూ పూర్ణ వినయభావంతో ప్రభువుకు సేవ చేశాను.
[20] మీకు మేలు కలిగించేదేదీ చెప్పకుండా వెనక్కు తీయలేదు గాని దాన్ని ప్రకటిస్తూ బహిరంగంగా, ఇంటింటా మీకు ఉపదేశిస్తూ వచ్చాను.
[21] దేవునిపట్ల పశ్చాత్తాపపడి మన ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులకూ గ్రీసు దేశస్థులకూ విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ వచ్చాను. ఇదంతా మీకు తెలుసు.
[22] “ఇదిగో వినండి, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంవల్ల జెరుసలం వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు.
[23] ఒక సంగతి మాత్రమే తెలుసు. సంకెళ్ళూ బాధలూ నాకోసం కాచుకొని ఉన్నాయని పవిత్రాత్మ ప్రతి పట్టణంలో విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ ఉన్నాడు.
[24] అయితే ఈ విషయాల్లో ఏదీ నన్ను కదిలించదు. నా జీవితం నాకు ప్రియమని ఎంచుకోవడం లేదు. నా లక్ష్యాన్ని ఆనందంతో పూర్తిగా నెరవేర్చాలనీ, యేసుప్రభువు నాకిచ్చిన సేవను, అంటే నేను సాక్షిగా దేవుని కృప శుభవార్త తెలియజేయడం అనే సేవను తుదముట్టించాలనీ ఉన్నాను.
[25] “ఇదిగో వినండి, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ నేను మీ మధ్య సంచరిస్తూ వచ్చాను గాని ఇకమీదట మీలో ఎవరూ నా ముఖం చూడరని నాకు తెలుసు.
[26] కనుక నేను అందరి రక్తం విషయంలో నిర్దోషినని ఈవేళ మీతో సాక్షిగా చెపుతున్నాను.
[27] ఎందుకంటే దేవుని సంకల్పమంతా మీకు తెలియజేయడంలో నేనేమీ వెనక్కు తీయలేదు.
[28] “దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకొన్న ఆయన సంఘానికి మీరు కాపరులుగా ఉండాలని పవిత్రాత్మ మిమ్మల్ని నాయకులుగా చేశాడు. అందువల్ల మిమ్మల్ని గురించీ మంద అంతటిని గురించీ జాగ్రత్తగా ఉండండి.
[29] నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళలాంటివారు మీమధ్యలో ప్రవేశిస్తారని నాకు తెలుసు. వారు మంద మీద ఏమీ జాలి చూపరు.
[30] అంతేగాక, శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని మీలోనే మనుషులు తలెత్తి కుటిలమైన మాటలు చెపుతారు.
[31] కాబట్టి మెళకువగా ఉండండి! నేను మూడేళ్ళు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ప్రతి ఒక్కరినీ హెచ్చరించడం మానలేదని జ్ఞాపకం ఉంచుకోండి.
[32] “ఇప్పుడు సోదరులారా, దేవునికీ ఆయన కృపవాక్కుకూ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీకు క్షేమాభివృద్ధి కలిగించి పవిత్రులైన వారందరితో కూడా వారసత్వం అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు.
[33] నేను ఎవరి వెండి గానీ బంగారం గానీ వస్త్రాలు గానీ ఆశించలేదు.
[34] అసలు, నా అక్కరలు, నాతో ఉన్నవారి అక్కరలు తీర్చడానికి ఈ చేతులు పని చేశాయి అని మీకే తెలుసు.
[35] ఇలా శ్రమిస్తూ మీరూ కష్టపడి బలహీనులకు సహాయం చేయాలని నేను అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను. ‘తీసుకోవడంకంటే ఇవ్వడమే ధన్యం’ అని యేసుప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకముంచుకోండి.”
[36] అతడు ఇలా చెప్పి, వారందరితోపాటు మోకాళ్ళూని ప్రార్థన చేశాడు.
[37] అప్పుడు వారంతా బాగా ఏడ్చి పౌలును కౌగలించుకొని ముద్దుపెట్టుకొన్నారు.
[38] వారు తన ముఖం ఇకమీదట చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించారు. తరువాత ఓడ వరకు అతణ్ణి సాగనంపారు.