[1] కొంతమంది యూదయ నుంచి వచ్చి సోదరులకు ఇలా ఉపదేశించారు. “మోషే నియమించిన ఆచారం ప్రకారం సున్నతి పొందకపోతే మీకు పాపవిముక్తి కలగదు.”
[2] పౌలు బర్నబాలకూ వారికీ మధ్య జరిగిన కలహం, వివాదం ఇంతంత కాదు. అప్పుడు ఈ సమస్యను గురించి పౌలు బర్నబాలూ అక్కడివారిలో మరి కొందరూ జెరుసలంకు క్రీస్తురాయబారుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయింది.
[3] సంఘం వారిని సాగనంపింది. వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యూదేతరులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియజేస్తూ సోదరులందరికీ మహా సంతోషం కలిగించారు.
[4] జెరుసలం చేరినప్పుడు వారికి సంఘం, రాయబారులు, పెద్దలు స్వాగతం చెప్పారు. దేవుడు తమచేత జరిగించినదంతా పౌలు బర్నబాలు తెలియజేశారు.
[5] అప్పుడు పరిసయ్యుల తెగలో విశ్వాసులు కొందరు నిలబడి “యూదేతరులకు సున్నతి సంస్కారం చేయించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని వారిని ఆదేశించాలి” అన్నారు.
[6] ఈ సంగతి విచారించడానికి క్రీస్తు రాయబారులూ పెద్దలూ సమకూడారు.
[7] దీర్ఘ చర్చ జరిగిన తరువాత పేతురు నిలబడి వారితో ఇలా అన్నాడు: “అయ్యలారా, సోదరులారా! యూదులు కానివారు నా నోటిద్వారా శుభవార్త సందేశం విని నమ్ముకొనేలా కొంతకాలం క్రిందట దేవుడు మనలో నన్ను ఎన్నుకొన్నాడు. ఇది మీకు తెలుసు.
[8] హృదయాలను ఎరిగిన దేవుడు మనకు పవిత్రాత్మను ప్రసాదించినట్టే వారికీ ప్రసాదించి తద్వారా వారిని స్వీకరించినట్టు సాక్ష్యమిచ్చాడు.
[9] మనకూ వారికీ భేదమేమీ చూపకుండా వారి హృదయాలను విశ్వాసంచేత శుద్ధి చేశాడు.
[10] అయితే, మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని ఆ శిష్యుల మెడమీద పెట్టడం ద్వారా మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?
[11] ప్రభువైన యేసు క్రీస్తు కృపవల్లే వారికి పాపవిముక్తి లభించినట్టే మనకూ లభిస్తుందని నమ్ముతున్నాం.”
[12] అక్కడివారంతా మౌనం వహించి బర్నబా పౌలులు యూదేతరులమధ్య తమద్వారా దేవుడు చేసిన వింతలూ సూచనకోసమైన అద్భుతాలూ వివరించి చెప్పగా విన్నారు.
[13] వీరు చెప్పడం ముగించిన తరువాత యాకోబు ఇలా అన్నాడు: “అయ్యలారా, సోదరులారా, నేను చెప్పేది వినండి!
[14] దేవుడు తన పేరుకోసం ఇతర ప్రజలలోనుంచి జనాన్ని తీసుకోవడానికి వారిని ఏ విధంగా మొదట్లో కటాక్షించాడో సుమెయోను వివరించి చెప్పాడు.
[15] ఇందుకు ప్రవక్తల మాటలు సమ్మతిస్తున్నాయి. లేఖనాలలో ఇలా ఉంది గదా:
[16] ఆ తరువాత నేను తిరిగి వచ్చి కూలిపోయిన దావీదు నివాసాన్ని మళ్ళీ నిర్మిస్తాను. దాని శిథిలాలను కట్టి, అది మునుపు ఉన్నట్టు దాన్ని మళ్ళీ చేస్తాను.
[17] దానివల్ల మనుషులలో మిగిలినవారికి నా పేరు ధరించిన ఇతర జనాలన్నిటికీ ప్రభువును వెదకడానికి వీలుంటుందని ఇవన్నీ జరిగించే ప్రభువు అంటున్నాడు.
[18] అనాది కాలంనుంచి దేవునికి తన పనులన్నీ తెలుసు.
[19] “కాబట్టి నా నిర్ణయం ఏమిటంటే, ఇతర ప్రజలలో దేవునివైపు తిరిగేవారిని మనం కష్టపెట్టకూడదు.
[20] కానీ వారు విగ్రహాలవల్ల అపవిత్రమైనవాటిని, వ్యభిచారాన్ని నిరాకరించాలనీ గొంతు పిసికి చంపినదానిని, రక్తాన్ని తినకూడదనీ వారికి లేఖలు రాసి పంపుదాం.
[21] ఎందుకంటే, అనేక తరాలనుంచి మోషే ధర్మశాస్త్రం ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారు. దానిని చదవడం ప్రతి విశ్రాంతి దినాన జరుగుతూ ఉంది గదా.”
[22] అప్పుడు క్రీస్తు రాయబారులూ పెద్దలూ సంఘమంతటితో కూడా తమలో కొంతమందిని ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియొకయకు పంపడం మంచిదని భావించుకొన్నారు. వారు బర్‌సబ్బా అనే మారు పేరుగల యూదానూ, సైలసునూ ఎన్నుకొన్నారు. వీరు సోదరులలో నాయకులు.
[23] వీరిచేత వారు ఈ లేఖ రాసి పంపించారు: “అంతియొకయలో, సిరియాలో, కిలికియలో ఉన్న యూదేతరులైన సోదరులకు క్రీస్తురాయబారులూ పెద్దలూ సోదరులూ అభివందనాలు చెప్పి రాసేదేమిటంటే,
[24] మామధ్య నుంచి కొంతమంది వెళ్ళి ‘మీరు సున్నతి సంస్కారం పొంది ధర్మశాస్త్రాన్ని పాటించాలి’ అంటూ తమ మాటలవల్ల మీకు కంగారు కలిగించి మీ మనసులను ఆందోళన పరిచారని విన్నాం. వారికి మేము అలా చేయాలని ఆదేశమివ్వలేదు.
[25] అందుచేత ఏకమనసుతో సమకూడి మనుషులను ఎన్నుకొని,
[26] మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకోసం తమ ప్రాణాలను తెగించిన మన ప్రియమైన బర్నబా పౌలులతో కూడా మీ దగ్గరకు పంపడం మంచిదని మేము భావించుకొన్నాం.
[27] గనుక యూదానూ సైలసునూ పంపుతున్నాం. వారు నోటి మాటలతో ఈ విషయాలు వివరించి చెపుతారు.
[28] విగ్రహాలకు అర్పించినవాటిని మీరు నిరాకరించాలి. రక్తాన్నీ గొంతు పిసికి చంపినదానినీ తినకూడదు. వ్యభిచారం చేయకూడదు –
[29] ఈ ముఖ్యమైన వాటికి మించి మరే భారమూ మీమీద మోపకపోవడం మంచిదని పవిత్రాత్మకూ మాకూ అనిపించింది. మిమ్మల్ని మీరు వీటికి దూరంగా ఉంచుకొంటే మీకు క్షేమం. మీకందరికీ శుభం.”
[30] అప్పుడు వారు పంపబడి అంతియొకయకు వెళ్ళి సంఘాన్ని సమకూర్చి లేఖ అందజేశారు.
[31] అక్కడివారు దానిని చదివి దాని ప్రోత్సాహకరమైన మాటలకు ఆనందించారు.
[32] యూదా, సైలసు కూడా ప్రవక్తలు. వారు చాలా సేపు మాట్లాడి సోదరులకు ప్రోత్సాహం, ధైర్యం కలిగించారు.
[33] అక్కడ కొంత కాలం గడిపిన తరువాత, అక్కడి సోదరులు క్రీస్తు రాయబారుల దగ్గరకు అభివందనాలతో వారిని పంపారు.
[34] అయితే అక్కడే ఉండిపోవడం సైలసుకు మంచిదనిపించింది.
[35] పౌలు బర్నబాలు కూడా అంతియొకయలో ఉండి ఇంకా చాలమందితోకూడా ప్రభు వాక్కు ఉపదేశిస్తూ ప్రకటిస్తూ వచ్చారు.
[36] కొన్ని రోజులైన తరువాత పౌలు బర్నబాతో ఇలా అన్నాడు: “మనం ప్రభు వాక్కు ప్రకటించిన పట్టణాలన్నిటికీ తిరిగి వెళ్ళి వాటిలో ఉన్న సోదరులు ఎలా ఉన్నారో చూద్దాం.”
[37] మార్కు అనే మరో పేరుగల యోహానును వెంటబెట్టుకొని వెళ్ళాలని బర్నబా పట్టుదలతో కోరాడు.
[38] అయితే మునుపు తమతో సేవ చేయడానికి సాగిపోక పంఫూలియాలో తమను విడిచి వెళ్ళినవాణ్ణి తీసుకుపోవడం తగదని పౌలు నొక్కి చెప్పాడు.
[39] వారి మధ్య ఎంత తీవ్ర వివాదం కలిగిందంటే వారిద్దరూ వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి సైప్రస్‌కు వెళ్ళాడు.
[40] పౌలు సైలసును ఎన్నుకొన్నాడు. సోదరులు వారిని దేవుని కృపకు అప్పచెప్పిన తరువాత,
[41] అతడు బయలుదేరి సిరియా, కిలికియ గుండా సంచరిస్తూ సంఘాలను స్థిరపరుస్తూ ఉన్నాడు.