[1] ప్రముఖ యాజి “ఈ విషయాలు నిజమేనా?” అని అడిగాడు.
[2] అందుకు స్తెఫను ఇలా చెప్పాడు: “సోదరులారా! తండ్రులారా! వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు, మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమ స్వరూపియైన దేవుడు అతనికి సాక్షాత్కరించాడు,
[3] అతనితో ఇలా అన్నాడు: ‘నీ దేశంనుంచీ నీ బంధువుల దగ్గరనుంచీ బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళిపో!’
[4] “అప్పుడతడు కల్దీయవారి దేశం విడిచివెళ్ళి హారానులో కాపురమేర్పరచుకొన్నాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడనుంచి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశానికి దేవుడు అతణ్ణి తీసుకువచ్చాడు.
[5] అయితే ఆయన ఇందులో అతనికి వారసత్వమేమీ ఇవ్వలేదు – ఒక్క అడుగు మోపేటంత భూమి కూడా ఇవ్వలేదు. కాని, అతనికి సంతానం లేని ఆ సమయంలో దీనిని అతనికీ అతని తరువాత అతని సంతతివారికి సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేశాడు.
[6] “అయితే దేవుడు ఈ విధంగా చెప్పాడు: ‘అతని సంతతివారు వేరే దేశంలో విదేశీయులవుతారు, ఆ దేశం వారు నాలుగు వందల ఏళ్ళు వారిని దాసత్వానికీ బాధలకూ గురి చేస్తారు.
[7] వారు ఏ జనానికి దాసత్వంలో ఉంటారో ఆ జనానికి తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వారు వచ్చి ఈ స్థలంలో నాకు సేవ చేస్తార’ని దేవుడు అన్నాడు.
[8] “ఆయన అతనికి సున్నతితో కూడిన ఒడంబడిక ప్రసాదించాడు. అతడు ఇస్సాకుకు తండ్రి అయి ఎనిమిదో రోజున అతనికి సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబుకు తండ్రి అయ్యాడు. యాకోబు పన్నెండుమంది గోత్రకర్తలకు తండ్రి అయ్యాడు.
[9] “ఆ గోత్రకర్తలు యోసేపు విషయం అసూయపడి అతణ్ణి ఈజిప్ట్‌కు వెళ్ళేలా అమ్మేశారు. అయినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు.
[10] అతని బాధలన్నిటిలోనుంచి అతణ్ణి తప్పించాడు. ఈజిప్ట్ చక్రవర్తి అయిన ఫరోయెదుట అతనికి జ్ఞానాన్నీ దయనూ ప్రసాదించాడు, గనుక ఫరో ఈజిప్ట్ మీద, రాజభవనమంతటి మీదా అతణ్ణి అధికారిగా నియమించాడు.
[11] “తరువాత ఈజిప్ట్ దేశమంతటికీ, కనాను దేశమంతటికీ కరవు, దానితో మహా బాధలు వచ్చాయి, గనుక మన పూర్వీకులకు ఆహారం దొరకలేదు.
[12] ఈజిప్ట్‌లో ధాన్యం ఉందని విని యాకోబు మన పూర్వీకులను అక్కడికి మొదటి సారి పంపాడు.
[13] వారు రెండో సారి వెళ్ళినప్పుడు యోసేపు ఎవరో అతని తోబుట్టువులకు తెలిసిపోయింది. అప్పుడు ఫరోకు యోసేపు కుటుంబం పరిచయమయింది.
[14] అప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును, తన చుట్టాలందరినీ పిలవనంపించాడు. వారు డెబ్భై అయిదు మంది.
[15] యాకోబు ఈజిప్ట్‌కు వెళ్ళాడు. అక్కడ అతడూ మన పూర్వీకులూ చనిపోయారు.
[16] వారిని అక్కడనుంచి షెకెంకు తీసుకురావడం, షెకెంలో హమోరు కొడుకుల దగ్గర అబ్రాహాము వెల యిచ్చి కొనుక్కొన్న సమాధిలో ఉంచడం జరిగింది.
[17] “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం నెరవేర్పు దగ్గరపడ్డప్పుడు ఈజిప్ట్‌లో ఇస్రాయేల్ ప్రజల సంఖ్య వృద్ధి చెంది అధికమైపోయింది.
[18] యోసేపు అంటే ఎవరో తెలియని వేరే చక్రవర్తి అధికారానికి వచ్చే వరకు అలా జరిగింది.
[19] అతడు మన జాతిపట్ల యుక్తిగా వ్యవహరించాడు. వారి శిశువులు బతకకుండా వారిని బయట ఉంచాలని మన పూర్వీకులను బలవంతం చేసి బాధించాడు.
[20] “ఆ కాలంలో మోషే జన్మించాడు. అతడు దేవునికి సుందరుడు. అతని తండ్రి ఇంటిలో అతణ్ణి మూడు నెలలు పెంచారు.
[21] అతణ్ణి బయట ఉంచిన తరువాత ఫరో కూతురు అతణ్ణి తీసుకొని తన కొడుకుగా పెంచింది.
[22] మోషే ఈజిప్ట్‌వారి జ్ఞానమంతటిలో విద్యాభ్యాసం పొందినవాడు. మాటలలో, క్రియలలో బలప్రభావాలు ఉన్నవాడు.
[23] “నలభై ఏళ్ళ ప్రాయంలో తన సోదరులైన ఇస్రాయేల్ వారిని సందర్శించాలని అతని హృదయంలో కోరిక పుట్టింది.
[24] వారిలో ఒకడు దౌర్జన్యానికి గురి కావడం చూచి అతడు అతణ్ణి కాపాడి ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపి బాధపడ్డవాని విషయంలో ప్రతీకారం చేశాడు.
[25] తన ద్వారా వారిని దేవుడు విడిపిస్తాడని తన సోదరులు గ్రహిస్తారనుకొన్నాడు. కానీ వారు గ్రహించలేదు.
[26] మర్నాడు ఇద్దరు పోరాడుతూ ఉంటే అతడు వారికి కనబడి ‘అయ్యలారా! మీరు సోదరులు. ఎందుకు ఒకరికొకరు హాని చేసుకొంటున్నారు?’ అంటూ వారిని సఖ్యపరచడానికి ప్రయత్నం చేశాడు.
[27] అయితే తన పొరుగువానికి హాని చేస్తున్నవాడు మోషేను అవతలికి గెంటివేసి ‘నిన్ను మామీద అధికారిగా, తీర్పరిగా నియమించినదెవరు?
[28] నిన్న ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అన్నాడు.
[29] “ఆ మాట విని మోషే పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడయ్యాడు. అక్కడతడు ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు.
[30] “నలభై ఏళ్ళయిన తరువాత, సీనాయి పర్వతం దగ్గర ఉన్న ఎడారిలో పొదలోని మంటల్లో ప్రభు దూత అతనికి కనిపించాడు.
[31] అది చూచి మోషే ఆ దృశ్యానికి ఆశ్చర్యపడి పరిశీలనగా చూడాలని దాని దగ్గరకు వెళ్ళాడు. వెంటనే ప్రభు స్వరం ఇలా వినిపించింది:
[32] ‘నేను నీ పూర్వీకుల దేవుణ్ణి – అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి.’ అందుకు మోషే వణికిపోతూ అటువైపు చూడడానికి తెగించలేదు.
[33] అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు: ‘నీ చెప్పులు విడువు. నీవు నిలుచున్నది పవిత్ర భూమి.
[34] ఈజిప్ట్‌లో నా ప్రజలకు జరుగుతున్న దౌర్జన్యం నేను పూర్తిగా చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగివచ్చాను. ఇప్పుడు రా, నేను నిన్ను ఈజిప్ట్‌కు పంపుతాను.’
[35] “మునుపు ఈ మోషేను ఇస్రాయేల్ ప్రజలు నిరాకరించి ‘నిన్ను అధికారిగా, తీర్పరిగా నియమించినది ఎవరు?’ అన్నారు. అయితే అతనికి పొదలో కనిపించిన దూత ద్వారా దేవుడు అతణ్ణే అధికారిగా, విమోచకుడుగా ఉండేందుకు పంపాడు.
[36] ఇతడు వారిని బయటికి తీసుకువచ్చాడు. ఈజిప్ట్‌లో, ఎర్ర సముద్రం దగ్గర, నలభై ఏండ్లు ఎడారిలో వింతలూ సూచకమైన అద్భుతాలూ చేశాడు.
[37] ‘దేవుడు మీకోసం మీ సొంత సోదరులలోనుంచి నాలాంటి ప్రవక్త బయలుదేరేలా చేస్తాడు. ఆయన మాట మీరు వినాలి’ అని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పినది ఈ మోషేయే.
[38] సీనాయి పర్వతంమీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ ఎడారిలోని సంఘంలో ఉన్నది ఇతడే. మనకు అందించడానికి అతడు జీవ వాక్కులు పొందాడు.
[39] “మన పూర్వీకులు అతనికి లోబడడానికి ఇష్టం లేక అతణ్ణి నిరాకరించారు. వారి హృదయాల్లో ఈజిప్ట్ వైపుకు తిరిగారు.
[40] వారు అహరోనుతో ఇలా అన్నారు: ‘మా ముందర వెళ్ళడానికి దేవుళ్ళను మాకోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు.’
[41] ఆ రోజులలో వారు దూడను చేసి ఆ విగ్రహానికి బలి అర్పించి తమ చేతులతో చేసినదాని గురించి సంతోషించారు.
[42] “అందుచేత దేవుడు వారినుంచి మళ్ళుకొని ఆకాశ సమూహాల పూజకు వారిని విడిచిపెట్టాడు. ఈ విషయం ప్రవక్తల గ్రంథంలో ఇలా రాసి ఉంది: ‘ఇస్రాయేల్ ప్రజలారా! ఎడారిలో నలభై ఏండ్లు మీరు బలులూ అర్పణలూ నాకు అర్పించారా?
[43] పూజకోసం మీరు చేసుకొన్న మొలెక్ దేవుడి గుడారాన్నీ, మీకు దేవుడుగా అయిన రోంఫా నక్షత్ర రూపాన్నీ మోసుకుపోయారు. కనుక నేను మిమ్మల్ని బబులోను అవతలకు తొలగిస్తాను.’
[44] “దేవుడు నియమించినట్టు ఎడారిలో మన పూర్వీకులకు దేవుని సాక్ష్యం కోసమైన గుడారం ఉంది. మోషే చూచిన నమూనా ప్రకారమే దానిని చేయాలని అతనికి దేవుడు ఆదేశించాడు.
[45] మన పూర్వీకులకు వరసగా అది దక్కింది. మన పూర్వీకుల ముందునుంచి వెళ్ళగొట్టిన జనాల ప్రాంతానికి వారు యెహోషువతో కూడా దానిని తీసుకువచ్చారు. దావీదు రోజులవరకు అది ఉండిపోయింది.
[46] దావీదు దేవుని అనుగ్రహం పొంది, యాకోబు యొక్క దేవునికోసం ఒక ఆలయం నిర్మించేందుకు దేవుని అనుమతి అడిగాడు,
[47] గానీ ఆయనకోసం మందిరం కట్టించినది సొలొమోనే.
[48] “అయితే మానవ హస్తాలతో చేసిన ఆలయంలో సర్వాతీతుడైన దేవుడు నివాసం చేయడు. ప్రవక్త చెప్పాడు గదా,
[49] ‘నా సింహాసనం ఆకాశమే. నా పాదపీఠం భూతలమే. మీరు నాకోసం ఎలాంటి మందిరం కట్టగలరు? నా విశ్రాంతి స్థలమేది?
[50] ఇవన్నీ నా చేతితో చేసినవి కావా? అని ప్రభువు చెపుతున్నాడు.’
[51] “తలబిరుసుగా ఉన్న మనుషులారా! హృదయంలో, చెవులలో సున్నతి లేని వారలారా! మీరు ఎప్పుడూ పవిత్రాత్మను ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులలాగే మసలుకొంటున్నారు.
[52] మీ పూర్వీకులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? న్యాయవంతుడు వస్తాడని మునుపు చాటించిన వారిని వారు చంపారు. మీరిప్పుడు ఆయన విషయంలో ద్రోహులూ హంతకులూ అయ్యారు!
[53] “దేవదూతలద్వారా నియమించిన ధర్మశాస్త్రం మీకు లభించింది గాని మీరు దాన్ని పాటించలేదు.”
[54] ఈ మాటలు విని సభ వారు కోపంతో మండిపడి అతణ్ణి చూచి పటపటా పండ్లు కొరికారు.
[55] అయితే అతడు పవిత్రాత్మతో నిండినవాడై ఆకాశంవైపు తేరి చూస్తూ దేవుని మహిమాప్రకాశం, దేవుని కుడి వైపున యేసు నిలుచుండడం చూశాడు.
[56] అప్పుడతడు “ఇదిగో! ఆకాశాలు తెరచుకోవడం, దేవుని కుడి వైపు మానవ పుత్రుడు నిలుచుండడం నేను చూస్తూ ఉన్నాను” అన్నాడు.
[57] అందుకు వారు పెద్ద స్వరంతో కేకలు వేస్తూ చెవులు మూసుకొని ఏక మనసుతో అతనిమీదికి దొమ్మిగా వచ్చారు.
[58] నగరం బయటికి అతణ్ణి గెంటివేసి రాళ్ళతో కొట్టసాగారు. సాక్షులు తమ పైవస్త్రాలు ఒక యువకుడి పాదాలదగ్గర పెట్టారు. అతడి పేరు సౌలు.
[59] వారు స్తెఫనును రాళ్ళు రువ్వుతూ ఉంటే స్తెఫను “యేసుప్రభూ! నా ఆత్మను చేర్చుకో!” అని ప్రార్థన చేశాడు.
[60] అప్పుడతడు మోకాళ్ళపై పడి “ప్రభూ! వీరిమీద ఈ పాపం మోపకు” అని గొంతెత్తి చెప్పాడు. అలా చెప్పి అతడు కన్ను మూశాడు.