[1] అప్పుడు అంతియొకయలో ఉన్న క్రీస్తు సంఘంలో కొంతమంది ప్రవక్తలూ ఉపదేశకులూ ఉన్నారు – బర్నబా, నిగెర్ అనే మరో పేరుగల సుమెయోను, కురేనె దేశస్థుడైన లూకియ, రాష్ట్రాధికారి హేరోదుతో పెంచబడ్డ మనయేను, సౌలు.
[2] ఒకసారి వారు ప్రభువుకోసం సేవ చేస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు పవిత్రాత్మ ఇలా అన్నాడు: “నేను బర్నబానూ సౌలునూ పిలిచిన పనికోసం వారిని నాకు ప్రత్యేకించండి.”
[3] వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపారు.
[4] పవిత్రాత్మ పంపగా వారు బయలుదేరి సెలూకయకు వెళ్ళారు. అక్కడ ఓడ ఎక్కి సైప్రస్ ప్రయాణం చేశారు.
[5] సలమీకి చేరుకొని అక్కడి యూదుల సమాజకేంద్రాలలో దేవుని వాక్కు బోధించారు. యోహాను వారికి సహాయం చేసేవాడు.
[6] వారు ఆ ద్వీపం పొడుగున పాఫు వరకు సంచారం చేశారు. అక్కడ మాంత్రికుడూ కపటప్రవక్తా అయిన ఒక యూదుడు కనిపించాడు. పేరు బర్‌యేసు.
[7] అతడు సెర్గి పౌలు అనే ప్రాంతీయాధికారితో ఉన్నాడు. సెర్గి పౌలు తెలివైనవాడు. అతడు దేవుని వాక్కు వినడానికి కోరుతూ బర్నబా సౌలులను పిలిపించాడు.
[8] అయితే ఆ అధికారిని విశ్వాసంనుంచి తొలగించడానికి ఈ ‘ఎలుమ’ ప్రయత్నం చేస్తూ వారిని ఎదిరించాడు (‘ఎలుమ’ అనే పేరుకు మాంత్రికుడని అర్థం).
[9] అప్పుడు సౌలు అతడు పౌలు కూడా అనబడ్డవాడు, పవిత్రాత్మతో నిండినవాడై అతనివైపు తేరి చూస్తూ ఇలా అన్నాడు:
[10] “అపనింద పిశాచం కొడుకా! సమస్త నీతిన్యాయాలకు విరోధీ! అన్ని రకాల కపటంతో, మోసంతో నిండినవాడా, ప్రభువుయొక్క తిన్నని మార్గాలు వక్రంగా త్రిప్పడం మానుకోవా?
[11] ఇదిగో విను! ప్రభువు నీమీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంత కాలం గుడ్డివాడివై సూర్యకాంతిని చూడకుండా ఉంటావు.” అప్పటికప్పుడే నల్లని పొగమంచు అతని మీదికి దిగి వచ్చింది. ఎవరైనా తన చేయి పట్టుకొని నడిపించాలని అతడు దేవులాడుతూ తిరగసాగాడు.
[12] జరిగినది చూచినప్పుడు ఆ ప్రాంతీయాధికారి ప్రభు ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడి నమ్ముకొన్నాడు.
[13] తరువాత పౌలూ అతనితో ఉన్నవారూ ఓడ ఎక్కి పాఫునుంచి బయలుదేరి పంఫూలియాలో ఉన్న పెర్గే చేరారు. అప్పుడు యోహాను వారిని విడిచిపెట్టి జెరుసలంకు తిరిగి వెళ్ళాడు.
[14] వారైతే పెర్గేనుంచి పిసిదియలోని అంతియొకయకు వెళ్ళారు. విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళి కూర్చున్నారు.
[15] ధర్మశాస్త్రంలో ఒక భాగం, ప్రవక్తల లేఖనాలలో ఒక భాగం చదవడం జరిగిన తరువాత సమాజ కేంద్రం అధికారులు వారికి ఈ మాట పంపారు: “అయ్యలారా, సోదరులారా! ప్రజలకోసం మీకు ప్రోత్సాహ వాక్కేదైనా ఉంటే చెప్పండి.”
[16] అప్పుడు పౌలు నిలబడి చేసైగ చేసి ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ మనుషులారా! దేవుడంటే భయభక్తులు ఉన్నవారలారా! వినండి!
[17] ఇస్రాయేల్‌ప్రజల దేవుడు మన పూర్వీకులను ఎన్నుకొన్నాడు. ఈ ప్రజలు ఈజిప్ట్‌దేశంలో విదేశీయులుగా ఉన్న కాలంలో ఆయన వారిని ఉన్నత స్థితికి హెచ్చించి పైకెత్తిన హస్తంతో అక్కడనుంచి తీసుకువచ్చాడు.
[18] ఎడారిలో సుమారు నలభై ఏండ్లు వారిని ఓర్చుకొన్నాడు.
[19] కనాను దేశంలో ఆయన ఏడు జాతులను నాశనం చేసి వాటి దేశాన్ని వీరికి వారసత్వంగా పంచి ఇచ్చాడు.
[20] “ఆ తరువాత ఆయన సుమారు నాలుగు వందల యాభై ఏళ్ళుగా ప్రవక్త అయిన సమూయేలు వరకు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు.
[21] అప్పుడు రాజు కావాలని వారు కోరారు. బెన్యామీను గోత్రికుడూ కీషు కొడుకూ అయిన సౌలును దేవుడు వారికి నియమించాడు. అతడు నలభై ఏళ్ళు పరిపాలించాడు.
[22] అతణ్ణి తొలగించిన తరువాత ఆయన దావీదును వారికి రాజుగా హెచ్చించాడు, అతని విషయం ఇలా సాక్ష్యమిస్తూ చెప్పాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా హృదయానికి అనుగుణంగా ఉన్నవాడు, నా సంకల్పమంతా నెరవేరుస్తాడు.’
[23] “అతని సంతానంలో నుంచి దేవుడు తన వాగ్దానం ప్రకారం ఇస్రాయేల్‌కు ఒక రక్షకుణ్ణి హెచ్చించాడు. ఆయనే యేసు.
[24] ఆయన రాకముందు యోహాను ఇస్రాయేల్ ప్రజలందరికీ పశ్చాత్తాపం విషయమైన బాప్తిసం మొదట ప్రకటించాడు.
[25] యోహాను తన సేవ ముగిస్తూ ‘నేను ఎవరిననుకొంటున్నారు? నేను ఆయనను కాను. ఇదిగో వినండి, నా తరువాత ఒకరు వస్తున్నారు. ఆయన కాళ్ళకు ఉన్న చెప్పులు విప్పడానికి కూడా నేను తగను’ అన్నాడు.
[26] “అయ్యలారా, సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! మీ మధ్య దేవుడంటే భయభక్తులున్నవారలారా! ఈ రక్షణ సందేశం మీకు పంపబడి ఉంది.
[27] జెరుసలం నివాసులూ వారి అధికారులూ ఆయనను గుర్తించలేదు. ప్రతి విశ్రాంతి దినమూ చదివే ప్రవక్తల పలుకులను కూడా గ్రహించలేదు. అందుచేతే ఆయనకు శిక్ష విధించడం ద్వారా వారు ఆ పలుకులను నెరవేర్చారు.
[28] మరణశిక్షకు తగిన కారణం దొరకకపోయినా ఆయనను చంపించాలని పిలాతును ప్రాధేయపడ్డారు.
[29] ఆయన విషయం రాసి ఉన్నదంతా వారు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుంచి దింపి సమాధిలో పెట్టారు.
[30] “అయితే దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడు.
[31] తరువాత ఆయన, తనతో గలలీనుంచి జెరుసలంకు వచ్చినవారికి అనేక దినాలు కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన ప్రజలకు వారు ఆయన సాక్షులు.
[32] మేము మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. ఏమంటే, దేవుడు యేసును లేపి మన పూర్వీకులకు చేసిన వాగ్దానం వారి సంతానమైన మనకోసం నేరవేర్చాడు.
[33] దీనికి అనుగుణంగా రెండో కీర్తనలో ఇలా రాసి ఉంది: ‘నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను’.
[34] “ఆయన శరీరం ఎన్నడూ కుళ్ళిపోకుండా ఆయనను చనిపోయినవారిలో నుంచి దేవుడు ఆయనను లేపిన సంగతిని గురించి ఇలా అన్నాడు: ‘దావీదు గురించిన నిశ్చయమైన దీవెనలు నీకిస్తాను.’
[35] “అందుచేత మరో కీర్తనలో ఆయన ఇలా అన్నాడు: ‘నీ పవిత్రుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు.’
[36] “దావీదు దేవుని సంకల్పం ప్రకారం తన తరంవారికి సేవ చేసి కన్ను మూశాడు. తన పూర్వీకుల దగ్గర పూడ్చి పెట్టబడి కుళ్ళిపోయాడు.
[37] అయితే దేవుడు లేపినవాడు మాత్రం కుళ్ళిపోలేదు.
[38] “అందుచేత, సోదరులారా, ఈ విషయం మీకు అర్థం కావాలని కోరుతున్నాం – యేసుద్వారానే మీకు పాపక్షమాపణ దొరుకుతుందని ప్రకటిస్తున్నాం.
[39] మోషే ధర్మశాస్త్రం ద్వారా మీరు ఏ విషయాలలో నిర్దోషులుగా ఎంచబడలేకపోయారో ఆ విషయాలన్నిటిలో, యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా నిర్దోషుల లెక్కలోకి వస్తారు.
[40] “కనుక ప్రవక్తల లేఖనాలలో చెప్పినది మీమీదికి రాకుండా చూచుకోండి.
[41] అదేమిటంటే, ‘ఇదిగో వినండి తిరస్కరించే వారలారా! ఆశ్చర్యపడి నశించండి! మీ రోజులలో నేను ఒక పని చేస్తాను. ఆ పని గురించి మీకు ఎవరైనా చెపితే మీరు నమ్మేవారు కారు.”
[42] యూదులు సమాజ కేంద్రంలోనుంచి వెళ్ళిపోతూవుంటే, ఈ సంగతులు మరుసటి విశ్రాంతి దినాన ఈ మాటలు తమతో బోధించాలని యూదులు కాని ప్రజలు వేడుకొన్నారు.
[43] సమాజకేంద్రంలో సభ ముగిసిన తరువాత చాలామంది యూదులూ యూద మతంలో ప్రవేశించిన భక్తిపరులూ పౌలు బర్నబాల వెంట వెళ్ళారు. వీరు వారితో మాట్లాడుతూ దేవుని అనుగ్రహంలో నిలిచి ఉండాలని వారిని ఒప్పించారు.
[44] మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణం అంతా దేవుని వాక్కు వినడానికి సమకూడింది.
[45] అయితే ఆ గుంపుల్ని చూచి యూదులు అసూయతో నిండిపోయారు. పౌలు చెప్పినదానిని కాదంటూ దూషిస్తూ వ్యతిరేకించారు.
[46] అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు: “దేవుని వాక్కు మొట్టమొదట మీకు చెప్పడం తప్పనిసరి. మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే శాశ్వత జీవానికి అయోగ్యులుగా పరిగణించుకొంటున్నారు, గనుక ఇదిగో వినండి, మేమిప్పుడు యూదులు కానివారి వైపుకు తిరుగుతాం.
[47] ఎందుకంటే, ప్రభువు మాకు ఇలా ఆదేశించాడు. నీవు రక్షణగా భూమి కొనలవరకు ఉండేలా నిన్ను ఇతర జనాలకు వెలుగుగా చేశాను.”
[48] ఇది విని యూదులు కాని ప్రజలు సంతోషించి ప్రభు వాక్కును గౌరవించారు. శాశ్వత జీవానికి నిర్ణయించబడ్డ వారందరూ నమ్మారు.
[49] ప్రభు వాక్కు ఆ ప్రాంతమంతటా వ్యాపించింది.
[50] కానీ యూదులు భక్తిమర్యాదలు గల ముఖ్య స్త్రీలనూ ఆ పట్టణం ప్రముఖులనూ పురికొలిపి పౌలు బర్నబాలకు హింస కలిగించి వారిని తమ ప్రాంతంనుంచి బయటికి వెళ్ళగొట్టారు.
[51] వీరు తమ కాళ్ళ దుమ్ము వారికి ఎదురుగా దులిపివేసి ఈకొనియకు వెళ్ళారు.
[52] ఆ శిష్యులు ఆనందంతో, పవిత్రాత్మతో నిండిపోయారు.