[1] అతని చావుకు సౌలు సమ్మతించాడు. ఆ కాలంలో జెరుసలంలో క్రీస్తు సంఘానికి గొప్ప హింస కలిగింది. క్రీస్తురాయబారులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాలలో అంతటా చెదరిపోయారు.
[2] కొందరు భక్తిపరులైన మనుషులు స్తెఫనును పాతిపెట్టి అతని విషయం అధికంగా విలపించారు.
[3] సౌలు అయితే ఆ సంఘం పట్ల దౌర్జన్య చర్యలు చేస్తూ ఉన్నాడు. ఇంటింట చొరబడుతూ పురుషులనూ స్త్రీలనూ ఈడ్చుకుపోయి చెరసాలలో వేయించాడు.
[4] చెదరిపోయినవారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ దేవుని వాక్కు ప్రకటిస్తూ ఉన్నారు.
[5] ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.
[6] ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు విని, చూచి అక్కడి జన సమూహాలు ఏకగ్రీవంగా అతడు చెప్పిన విషయాలు శ్రద్ధతో విన్నారు.
[7] చాలామందికి పట్టిన మలిన పిశాచాలు పెడ బొబ్బలు పెట్టి వారిలోనుంచి బయటికి వెళ్ళాయి. పక్షవాత రోగులూ కుంటివారూ అనేకులు పూర్తిగా నయమయ్యారు.
[8] అందుచేత ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలిగింది.
[9] ఆ పట్టణంలో సీమోను అనేవాడు ఉన్నాడు. అదివరకు అతడు మంత్ర విద్య ప్రయోగిస్తూ తానొక గొప్పవాణ్ణని చెప్పుకొంటూ సమరయ ప్రజలను ఆశ్చర్యంలో ముంచేవాడు.
[10] అందరూ – అల్పులు గానీ గొప్పవారు గానీ – “ఇతడే ‘దేవుని మహా శక్తి’” అంటూ అతడి మాటలు శ్రద్ధతో విన్నారు.
[11] అతడు చాలా కాలం తన మంత్ర విద్యలతో వారికి ఆశ్చర్యం కలిగించినందుచేతే వారు అతడి మాటలు శ్రద్ధతో విన్నారు.
[12] అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించీ యేసు క్రీస్తు పేరును గురించీ ప్రకటించినప్పుడు వారు అతణ్ణి నమ్మారు, పురుషులూ స్త్రీలూ బాప్తిసం పొందారు.
[13] సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. సూచనకోసమైన అద్భుతాలూ మహా వింతలూ జరగడం చూచి ఆశ్చర్యపోతూ ఫిలిప్పుతో ఉండిపోయాడు.
[14] సమరయవారు దేవుని వాక్కు అంగీకరించారని విని జెరుసలంలో క్రీస్తురాయబారులు వారిదగ్గరకు పేతురు యోహానులను పంపారు.
[15] వీరు వచ్చి వారు పవిత్రాత్మను పొందేలా వారికోసం ప్రార్థన చేశారు.
[16] అంతకుముందు పవిత్రాత్మ వారిలో ఎవరిమీదికి రాలేదు. వారు యేసుప్రభువు పేర బాప్తిసం పొందారు అంతే.
[17] అప్పుడు పేతురు యోహానులు వారిమీద చేతులుంచారు, వారు పవిత్రాత్మను పొందారు.
[18] క్రీస్తురాయబారులు చేతులుంచడం ద్వారా పవిత్రాత్మను ప్రసాదించడం జరిగిందని చూచి సీమోను వారికి డబ్బు ఇవ్వజూపి ఇలా అన్నాడు:
[19] “నేను ఎవరిమీద చేతులుంచుతానో వారు పవిత్రాత్మను పొందేలా నాకు కూడా ఈ అధికారం ఇవ్వండి.”
[20] అతడితో పేతురు ఈ విధంగా అన్నాడు: “నీ డబ్బు నీతోకూడా నశిస్తుంది గాక! ఎందుకంటే ద్రవ్యమిచ్చి దేవుని ఉచిత వరాన్ని కొనుక్కోవచ్చు అనుకొన్నావు నీవు!
[21] దేవుని ఎదుట నీ హృదయం సరైన స్థితిలో లేదు గనుక ఈ విషయంలో నీకు పాలుపంపులు లేవు.
[22] కాబట్టి ఈ నీ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడి దేవుణ్ణి ప్రార్థించు. ఒకవేళ నీ హృదయాలోచనకు క్షమాపణ దొరకవచ్చునేమో.
[23] నీ సంగతి గ్రహించాను – నీ నిలువెల్లా చేదైన విషమే! దుర్మార్గానికి కట్టుబడి ఉన్నావు.”
[24] అందుకు “మీరు చెప్పినవాటిలో ఏదీ నామీదికి రాకుండా నాకోసం ప్రభువును ప్రార్థించండి” అని సీమోను జవాబిచ్చాడు.
[25] వారు సాక్ష్యం చెప్పి ప్రభు వాక్కు ప్రకటించిన తరువాత జెరుసలంకు బయలుదేరి సమరయవారి అనేక గ్రామాలలో శుభవార్త ప్రకటిస్తూ వెళ్ళారు.
[26] అప్పుడు ప్రభు దేవదూత ఒకడు “నీవు లేచి జెరుసలంనుంచి గాజాకు ఎడారిలో పోయే దారికి దక్షిణంగా వెళ్ళు” అని ఫిలిప్పుతో చెప్పాడు.
[27] అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఇతియొపియ దేశస్థుడైన ఒక నపుంసకుడు దారిలో కనిపించాడు. ఇతియొపియ రాణి అయిన కందాకే క్రింద అతడు గొప్ప అధికారం గలవాడు. ఆమె ధనాగారమంతా అతని అదుపులో ఉండేది. అతడు ఆరాధన కోసం జెరుసలంకు వచ్చాడు.
[28] ఇప్పుడతడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. తన రథంలో కూర్చుని ఉండి యెషయాప్రవక్త గ్రంథం చదువుతూ ఉన్నాడు.
[29] అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో “ఆ రథం దగ్గరకు వెళ్ళి దానిని కలుసుకో!” అన్నాడు.
[30] ఫిలిప్పు దాని దగ్గరకు పరుగెత్తి ఆ మనిషి యెషయా ప్రవక్త గ్రంథం చదవడం విని “మీరు చదువుతున్నది అర్థం అవుతూ ఉందా?” అని అడిగాడు.
[31] అందుకతడు “ఎవరైనా నాకు సలహా చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి రథమెక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకొన్నాడు.
[32] అతడు చదువుతున్న లేఖన భాగమిది: వారు ఆయనను గొర్రెలాగా వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించేవాడి ఎదుట గొర్రెపిల్ల ఊరుకొన్నట్టే ఆయన నోరు తెరవలేదు.
[33] ఆయన దీనస్థితినిబట్టి ఆయనకు తీర్చవలసిన న్యాయం తొలగించబడింది. భూలోకంలో ఉండకుండా ఆయన ప్రాణం తీయడం జరిగింది గనుక ఆయన సంతానాన్ని గురించి ఎవరు ఏమని చెప్పగలరు?
[34] ఆ నపుంసకుడు ఫిలిప్పును ఈ విధంగా అడిగాడు: “ప్రవక్త ఇలా చెప్పేది ఎవరి విషయం? తన విషయమా? మరొకరి విషయమా? నేను నిన్ను అడిగేది ఇదే.”
[35] అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనంతోనే ఆరంభించి యేసును అతనికి బోధించాడు.
[36] వారు దారిలో సాగిపోతూ ఉంటే నీళ్ళున్న చోటికి వచ్చారు. “ఇవిగో నీళ్ళు! నేను బాప్తిసం పొందడానికి ఆటంకమేమిటి?” అని నపుంసకుడు అన్నాడు.
[37] “నీవు హృదయపూర్వకంగా నమ్మితే బాప్తిసం పొందవచ్చు” అని ఫిలిప్పు చెప్పినప్పుడు అతడు “యేసు క్రీస్తే దేవుని కుమారుడని నమ్ముతున్నాను” అని జవాబిచ్చాడు.
[38] అప్పుడు రథం ఆపమని ఆజ్ఞ జారీ చేశాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు.
[39] వారు నీళ్ళలోనుంచి బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకువెళ్ళాడు. నపుంసకుడు అతణ్ణి మరెన్నడూ చూడలేదు. అయినా అతడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళాడు.
[40] అయితే ఫిలిప్పు అజోతు పట్టణంలో కనబడ్డాడు. అక్కడనుంచి ముందుకు వెళ్ళిపోతూ సీజరియకు చేరేవరకు అతడు అన్ని గ్రామాలలో శుభవార్త ప్రకటిస్తూ వచ్చాడు.