[1] వారు ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే యాజులు, దేవాలయం కాపలావారికి అధికారి, సద్దూకయ్యులు వారిమీదికి వచ్చారు.
[2] రాయబారులు ప్రజలకు ఉపదేశించి నందుకూ చనిపోయినవారు సజీవంగా లేస్తారని యేసును బట్టి ప్రకటించినందుకూ వీరు చాలా కలవరపడుతూ ఉన్నారు.
[3] వారిని పట్టుకొని, అప్పటికే సాయంకాలం అయిందని మరుసటి రోజువరకు ఖైదులో ఉంచారు.
[4] అయినా వాక్కు విన్నవారిలో చాలామంది నమ్మారు. పురుషుల సంఖ్య ఇంచుమించు అయిదు వేల వరకు అయింది.
[5] మరునాడు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ జెరుసలంలో సమకూడారు.
[6] ప్రముఖ యాజి అన్నా, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రముఖ యాజి వంశీకులంతా కూడా వారితో ఉన్నారు.
[7] వారు తమ మధ్యలో పేతురు యోహానులను నిలబెట్టి “మీరు చేసిన ఈ పని ఏ శక్తితో, ఏ పేరునుబట్టి చేశారు?” అని అడిగారు.
[8] అప్పుడు పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వారితో ఇలా అన్నాడు: “ప్రజల అధికారులారా! ఇస్రాయేల్ పెద్దలారా!
[9] కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి – అతడు ఎలా బాగుపడ్డాడని ఈ రోజు మాకు విమర్శ జరుగుతూ ఉంటే–
[10] మీరంతా, ఇస్రాయేల్ ప్రజలంతా ఒక సంగతి తెలుసుకోవాలి. నజరేతువాడైన యేసు క్రీస్తు పేరటే ఈ మనిషి ఆరోగ్యవంతుడై మీ ఎదుట నిలుచున్నాడు. మీరు యేసును సిలువ వేశారు గానీ దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి లేపాడు.
[11] ఆయన ఎవరంటే, ‘కట్టేవారైన మీరు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.’
[12] “పాపవిముక్తి ఇంకెవరివల్లా కలగదు. ఈ పేరుననే మనం పాపవిముక్తి పొందాలి. ఆకాశంక్రింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాపవిముక్తి కలగదు.”
[13] పేతురు యోహానులు విద్యలేని సామాన్యులని గ్రహించి వారి ధైర్యం చూచి అధికారులు ఆశ్చర్యపోయారు, వారు యేసుతోకూడా ఉండేవారని గుర్తించారు.
[14] బాగుపడ్డ ఆ మనిషి వారితో నిలుచుండడం చూచి దానికి వ్యతిరేకంగా దేన్నీ చెప్పలేక,
[15] “సభనుంచి వెళ్ళిపోండి” అని వారికి ఆజ్ఞ జారీ చేశారు. అప్పుడు ఒకరితో ఒకరు సమాలోచన జరిపి ఇలా అన్నారు:
[16] “ఈ మనుషులను ఏం చేద్దాం? వాళ్ళద్వారా ప్రసిద్ధమైన అద్భుతం నిజంగా జరిగిందని జెరుసలం నివాసులందరికీ తెలిసిపోయింది. అది కాదనలేము.
[17] కానీ ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకూడదు గనుక ఇకమీదట ఈ పేర ఎవరితోనూ మాట్లాడకూడదని వారిని తీవ్రంగా బెదిరిద్దాం.”
[18] అప్పుడు వారిని పిలిపించి, యేసు పేర ఎంత మాత్రమూ మాట్లాడకూడదనీ ఉపదేశించకూడదనీ వారికి ఆజ్ఞ జారీ చేశారు.
[19] పేతురు యోహానులు వారికి ఇలా జవాబిచ్చారు: “దేవుని మాట వినక మీ మాట వినడం దేవుని దృష్టిలో న్యాయమా? మీరే గుర్తించండి.
[20] మేమైతే చూచిందీ విన్నదీ చెప్పకుండా ఉండలేము.”
[21] ఆ నాయకులు వారిని ఇంకా బెదిరించిన తరువాత వారిని విడిచిపెట్టారు. ప్రజల కారణంగా వారిని ఎలా శిక్షించాలో తోచలేదు. ఎందుకంటే జరిగినదానిని బట్టి ప్రజలంతా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు.
[22] ఆ స్వస్థత అద్భుతం ఎవడి విషయంలో జరిగిందో ఆ మనిషి నలభై ఏళ్ళకంటే ఎక్కువ వయసు గలవాడు.
[23] వారు విడుదల అయి తమ సంఘంవారి దగ్గరకు వెళ్ళి ప్రముఖ యాజులూ పెద్దలూ తమతో చెప్పినదంతా తెలియజేశారు.
[24] ఇది విని వారు ఏక మనసుతో దేవునికి స్వరమెత్తి ఇలా అన్నారు: “ప్రభూ! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన దేవుడవు నీవు.
[25] నీవు నీ సేవకుడు అయిన దావీదు నోట ఇలా పలికించావు: జనాలు ఎందుకు అల్లరి చేశాయి? ప్రజలు ఎందుకు వృధాలోచనలు చేశారు?
[26] ప్రభువుకూ ఆయన అభిషిక్తుడికీ వ్యతిరేకంగా భూరాజులు నిలిచారు, పరిపాలకులు సమకూడారు.
[27] “అలాగే ఈ నగరంలో హేరోదు, పొంతి పిలాతు, ఇస్రాయేల్ ప్రజలతోనూ ఇతర ప్రజలతోనూ కలిసి నీచేత అభిషేకం పొందిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా
[28] ఏది జరగాలని నీ అధికారంచేతా సంకల్పంచేతా ముందు నిర్ణయించావో అదే జరిగించడానికి సమకూడారు.
[29] ప్రభూ! ఇప్పుడు వారి బెదిరింపులు గుర్తించి రోగులను బాగు చేయడానికీ నీ పవిత్ర సేవకుడైన యేసు పేరట సూచకమైన అద్భుతాలూ వింతలూ జరిగించడానికీ నీ చేయి చాపు.
[30] తద్వారా నీ దాసులకు నీ వాక్కు ప్రకటించడానికి గొప్ప ధైర్యం ప్రసాదించు.”
[31] వారు ప్రార్థన చేసినప్పుడు వారు సమకూడిన స్థలం కంపించింది. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయి దేవుని వాక్కు ధైర్యంతో చెప్పారు.
[32] నమ్మినవారంతా హృదయంలో, మనసులో ఏకంగా ఉన్నారు. ఎవరూ తనకు కలిగినవాటిలో ఏదీ తనది అనలేదు. అంతా వారికి ఉమ్మడిగా ఉంది.
[33] పునర్జీవితాన్ని గురించి యేసుప్రభుని క్రీస్తు రాయబారులు గొప్ప బలప్రభావాలతో సాక్ష్యమిచ్చారు. దేవుని కృప వారందరికి అధికంగా ఉంది.
[34] భూములైనా ఇండ్లయినా ఉన్నవారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి క్రీస్తురాయబారుల పాదాల దగ్గర పెట్టేవారు.
[35] అక్కరకొద్దీ ప్రతి ఒక్కరికీ దానిని పంచిపెట్టడం జరిగింది, గనుక వారిలో ఎవరికీ కొరత లేకపోయింది.
[36] సైప్రస్ ద్వీపంలో జన్మించిన లేవీ గోత్రికుడొకడు ఉండేవాడు. పేరు యోసే. అతనికి క్రీస్తురాయబారులు బర్నబా అనే పేరు పెట్టారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థం.
[37] అతనికి ఉన్న భూమి అమ్మి ఆ డబ్బు తెచ్చి క్రీస్తురాయబారుల పాదాల దగ్గర పెట్టాడు.