[1] ఒకప్పుడు ప్రార్థన కాలంలో – పగలు మూడు గంటలకు – పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
[2] అప్పుడే కొందరు పుట్టు కుంటి మనిషిని ఒకణ్ణి మోసుకువస్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళే వారిదగ్గర బిచ్చం అడుక్కోవడానికి వారు అతణ్ణి ప్రతి రోజూ సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు.
[3] పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉంటే చూచి అతడు బిచ్చమడిగాడు.
[4] పేతురు, యోహానుతోపాటు అతణ్ణి తేరిపార చూస్తూ “మావైపు చూడు” అన్నాడు.
[5] తనకు వారిదగ్గర ఏదైనా దొరుకుతుందని వారివైపు శ్రద్ధతో చూశాడు.
[6] అప్పుడు పేతురు “నేను వెండి బంగారాలు ఉన్నవాణ్ణి కాను గాని నాకున్నదేదో అదే నీకిస్తాను. నజరేతువాడైన యేసు క్రీస్తు పేర లేచి నడువు!” అన్నాడు,
[7] అతని కుడి చేయి పట్టుకొని అతణ్ణి లేవనెత్తాడు. తక్షణమే అతని పాదాలకూ చీలమండలకూ బలం కలిగింది.
[8] అతడు దిగ్గున లేచి నిలబడి నడవసాగాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితోపాటు దేవాలయంలో ప్రవేశించాడు.
[9] అతడు నడవడం, దేవుణ్ణి స్తుతించడం ప్రజలంతా చూశారు.
[10] అతడు సౌందర్యం అనే ద్వారం దగ్గర బిచ్చమెత్తుకోవడానికి కూర్చుని ఉన్నవాడే అని వారు గుర్తెరిగి అతనికి జరిగినదాని కారణంగా ఆశ్చర్యంతో, విస్మయంతో నిండిపోయారు.
[11] బాగుపడ్డ ఆ కుంటివాడు పేతురు యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ‘సొలొమోను మంటపం’లో వారి దగ్గరికి ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడిపోతూ పరుగెత్తు కొంటూ వచ్చారు.
[12] ఇది చూచి పేతురు ప్రజతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ మనుషులారా! దీనిని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా సొంత బలంతో, భక్తితో ఈ మనిషిని నడిచేలా చేసినట్టు ఎందుకు మావైపు తేరి చూస్తున్నారు?
[13] అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు – మన పూర్వీకుల దేవుడు – తన సేవకుడైన యేసును గౌరవించాడు. మీరాయనను పిలాతుకు అప్పగించారు, ఆయనను విడుదల చేసే నిర్ణయానికి అతడు వచ్చినప్పుడు అతని ఎదుట మీరు వద్దన్నారు.
[14] పవిత్రుడూ న్యాయవంతుడూ అయినవాణ్ణి వద్దని చెప్పి హంతకుణ్ణి మీకు విడుదల చేయాలని కోరారు.
[15] మీరు జీవానికి కర్తను చంపించారు గానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు. ఇందుకు మేము సాక్షులం.
[16] యేసు పేరుమీద ఉన్న నమ్మకం వల్ల, ఆయన పేరటే ఈ మనిషికి బలం కలిగింది. ఇతణ్ణి మీరు చూస్తున్నారు. ఇతడెవరో మీకు తెలుసు. యేసుమూలంగా కలిగే నమ్మకమే మీ అందరి ఎదుటా ఇతనికి ఈ పూర్తి ఆరోగ్యాన్ని కలిగించింది.
[17] “సోదరులారా! మీరు చేసినది తెలియక చేశారని నాకు తెలుసు. మీ నాయకుల సంగతి కూడా అంతే.
[18] అయితే తన అభిషిక్తుడు బాధలపాలవుతాడని దేవుడు ప్రవక్తలందరి నోట ముందుగా ప్రకటించినదానిని ఈ విధంగా నెరవేర్చుకొన్నాడు.
[19] “కనుక పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి! ప్రభు సన్నిధానం నుంచి విశ్రాంతి కాలాలు వచ్చేలా,
[20] మీకు ముందుగా ప్రకటించబడిన అభిషిక్తుడైన యేసును ఆయన పంపేలా, మీ పాపాలు నిర్మూలం కావడానికి అలా చేయండి.
[21] అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని లోకారంభం నుంచి దేవుడు తన పవిత్ర ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండాలి.
[22] “మోషే యథార్థంగా పితరులతో అన్నాడు గదా, ‘మీ దేవుడైన ప్రభువు మీకోసం మీ సోదరులలోనుంచి నాలాంటి ప్రవక్తను ఒకణ్ణి బయలుదేరేలా చేస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు చెవిని పెట్టాలి.
[23] ఆ ప్రవక్త మాటలు పెడచెవి పెట్టే ప్రతి ఒక్కరూ ప్రజలలో లేకుండా పూర్తిగా నాశనం అవుతారు.’
[24] “నిజంగా, సమూయేలు మొదలుకొని ఆ తరువాత మాట్లాడిన ప్రవక్తలందరూ ఈ రోజులను గురించి ముందుగా చాటించారు.
[25] మీరు ప్రవక్తల ప్రజలు, మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒడంబడిక ప్రజలు. ఆయన అబ్రాహాముతో అన్నాడు ‘నీ సంతానం మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి.’
[26] దేవుడు తన సేవకుడైన యేసును బయలుదేరదీసి మొట్టమొదట మీదగ్గరకు పంపాడు. మీలో ప్రతి ఒక్కరినీ మీ దుర్మార్గాలనుంచి మళ్ళించడంవల్ల మిమ్ములను ధన్యులుగా చేయాలని ఆయన ఉద్దేశం.”