[1] ఆయన వారితో ఇంకా అన్నాడు “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం బలప్రభావాలతో రావడం చూచేవరకు చనిపోరు.”
[2] ఆరు రోజుల తరువాత యేసు పేతురునూ యాకోబునూ యోహానునూ వెంటబెట్టుకొని ఎత్తయిన ఒక పర్వతంమీదికి ఏకాంతంగా వెళ్ళాడు. వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది.
[3] ఆయన వస్త్రాలు హిమమంతగా, భూమిమీద ఎవ్వరూ చలువ చేయలేనంతగా అతి తెల్లగా మారి తళతళ మెరిశాయి.
[4] అప్పుడు ఏలీయా మోషేతో కూడా వారికి కనబడ్డారు. వారు యేసుతో మాట్లాడుతున్నారు.
[5] అప్పుడు అందుకు పేతురు “గురువర్యా, మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలు వేయనియ్యి – ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అని యేసుతో అన్నాడు.
[6] ఎందుకంటే ఏమి చెప్పాలో అతడికి పాలుపోలేదు. ఎందుకంటే శిష్యులకు ఎంతో భయం కలిగింది.
[7] అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. మేఘంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఆయన మాట వినండి.”
[8] తటాలున వారు చుట్టూ చూచేటప్పటికి తమతో యేసు తప్ప ఇంకెవ్వరూ కనబడలేదు.
[9] వారు పర్వతం దిగి వస్తూ ఉన్నప్పుడు, మానవ పుత్రుడు చనిపోయినవారిలో నుంచి తిరిగి సజీవంగా లేచేవరకు వారు చూచినవి ఎవ్వరికీ చెప్పకూడదని ఆయన వారికి ఆదేశించాడు.
[10] వారు ఆ విషయం బయటికి పొక్కనివ్వకుండా చనిపోయినవారిలో నుంచి లేవడం అంటే ఏమిటో అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొన్నారు.
[11] అప్పుడు వారు ఆయనను చూచి “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని అడిగారు.
[12] ఆయన వారికి జవాబిస్తూ “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ పూర్వస్థితికి తెస్తాడు, నిజమే. అయితే మానవపుత్రుడు అనేక బాధలు అనుభవించి తృణీకారానికి గురి అవుతాడని ఎందుకు రాసి ఉన్నట్టు?
[13] కానీ మీతో నేను చెప్పేదేమిటంటే, అతణ్ణి గురించి రాసి ఉన్నట్టు ఏలీయా వచ్చాడు. అతణ్ణి తమకిష్టం వచ్చినట్టు వారు చేశారు” అన్నాడు.
[14] శిష్యుల దగ్గరకు ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జన సమూహం ఉండడం, వారితో కొందరు ధర్మశాస్త్ర పండితులు వాదించడం చూశాడు.
[15] జన సమూహమంతా ఆయనను చూచిన వెంటనే అధికంగా ఆశ్చర్యపడిపోతూ ఆయనదగ్గరకు పరుగెత్తివచ్చి ఆయనకు నమస్కరించారు.
[16] ఆయన “వారితో దేన్ని గురించి వాదిస్తున్నారు?” అని ధర్మశాస్త్ర పండితులనడిగాడు.
[17] జన సమూహంలో ఒకడు ఆయనకిలా జవాబు చెప్పాడు: “బోధకుడా, తమరిదగ్గరికి నా కొడుకును తీసుకువచ్చాను. అతడు దయ్యం పట్టి మూగవాడయ్యాడు.
[18] అది అతణ్ణి పూనినప్పుడెల్లా అతణ్ణి కింద పడేస్తుంది. అతని నోటివెంట నురుగు కారుతుంది. పండ్లు పటపటా కొరుక్కొంటాడు. ఒళ్ళంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని తమరి శిష్యులతో మాట్లాడాను గాని వారు అలా చేయలేకపోయారు.”
[19] ఆయన అతనికిలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను! ఎందాకా మిమ్ములను సహించాలి! అతణ్ణి నా దగ్గరకు తీసుకురండి.”
[20] వారతణ్ణి ఆయనదగ్గరికి తీసుకువచ్చారు. అతడు ఆయనను చూచినవెంటనే ఆ దయ్యం అతణ్ణి విలవిల లాడించింది. అతడు నేలమీద పడి నురుగు కక్కుతూ సుడులు తిరిగాడు.
[21] ఆయన “ఇతనికి ఇది ఎంత కాలంనుంచి ఉంది?” అని అతడి తండ్రిని అడిగాడు. అతడు అన్నాడు “చిన్నప్పటి నుంచీ ఉందండి.
[22] పదేపదే అది అతణ్ణి నిప్పులో, నీళ్ళలో పడేసి నాశనం చేయజూసింది. తమరు ఏమైనా చేయగలిగితే మామీద జాలి చూపి సహాయం చెయ్యండి.”
[23] యేసు అతడితో “నీవు నమ్మగలిగితే – దేవుణ్ణి నమ్మే వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
[24] వెంటనే ఆ పిల్లవాడి తండ్రి కన్నీరు కారుస్తూ బిగ్గరగా అన్నాడు “నేను నమ్ముతున్నాను. నా అపనమ్మకం విషయంలో సహాయం చెయ్యండి.”
[25] అక్కడికి జనం పరుగెత్తి రావడం చూచి యేసు ఆ మలిన పిశాచాన్ని గద్దించి దానితో “మూగ, చెవిటి దయ్యమా! అతనిలో నుంచి బయటికి వచ్చి ఇంకెన్నడూ అతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.
[26] అది పెడ బొబ్బలు పెట్టి ఆ పిల్లవాణ్ణి అధికంగా విలవిలలాడించి అతనిలోనుంచి బయటికి వచ్చింది. అప్పుడతడు చచ్చినవాడిలాగా అయ్యాడు, గనుక “వాడు చనిపోయాడు” అని చాలామంది చెప్పుకొన్నారు.
[27] అయితే యేసు అతడి చేయి పట్టుకొని అతణ్ణి లేవనెత్తాడు. అతడు లేచి నిలబడ్డాడు.
[28] ఆయన ఇంట్లోకి వచ్చిన తరువాత ఆయన శిష్యులు ఒంటరిగా ఆయనను ఇలా అడిగారు: “మేము దానినెందుకు బయటికి వెళ్ళగొట్టలేకపోయాం?”
[29] ఆయన వారితో “అలాంటిది ప్రార్థనవల్ల, ఉపవాసంవల్ల తప్ప మరి దేనివల్లా బయటికి రాదు” అన్నాడు.
[30] అక్కడనుంచి వారు బయలుదేరి గలలీ మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికైనా తెలియడం ఆయనకిష్టం లేదు.
[31] ఎందుకంటే, తన శిష్యులకు ఉపదేశిస్తూ వారితో “మానవ పుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరగబోతుంది. వారాయనను చంపుతారు. ఆయన చంపబడిన తరువాత మూడు రోజులకు ఆయన సజీవంగా లేస్తాడు” అన్నాడు.
[32] వారైతే ఆ మాట గ్రహించలేదు. ఆయనను అడగడానికి వారికి భయంగా ఉంది కూడా.
[33] ఆయన కపెర్‌నహూం చేరారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన “దారిలో మీరు దేన్ని గురించి వాదిస్తున్నారు?” అని వారినడిగాడు.
[34] వారు ఊరుకొన్నారు. ఎందుకంటే, దారిన వారు తమలో ఎవరు గొప్ప అని వాదించారు.
[35] ఆయన కూర్చుని ఆ పన్నెండుమందిని పిలిచి “ఎవడైనా ప్రముఖుడుగా ఉండాలి అనుకొంటే అతడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
[36] అప్పుడాయన చిన్న బిడ్డణ్ణి తీసుకొని వారి మధ్య నిలబెట్టాడు, వాణ్ణి తన చేతుల్లోకి తీసుకొని వారితో ఇలా అన్నాడు:
[37] “ఇలాంటి చిన్నవారిలో ఒకణ్ణి నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారు. నన్ను స్వీకరించేవారెవరైనా నన్ను కాదు గాని నన్ను పంపినవాణ్ణి స్వీకరిస్తున్నారు.”
[38] యోహాను ఆయనతో “గురువర్యా, మనల్ని అనుసరించని వాడొకడు నీ పేర దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనల్ని అనుసరించేవాడు కాడు గనక అతణ్ణి అడ్డగించాం” అన్నాడు.
[39] అయితే యేసు అన్నాడు “అతణ్ణి అడ్డగించకండి. నా పేర అద్భుతం చేసేవాడెవడూ తేలికగా నన్ను గురించి చెడు మాట చెప్పలేడు గదా.
[40] మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షంవాడే.
[41] మీతో ఖచ్చితంగా అంటున్నాను, మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేర మీకు త్రాగడానికి గిన్నెడు నీళ్ళు ఇస్తే అతడు తన బహుమతిని ఎంత మాత్రమూ పోగొట్టుకోడు.
[42] కానీ నన్ను నమ్ముకొన్న ఇలాంటి ఒక చిన్న బిడ్డడికి ఎవరైనా ఆటంకంగా ఉన్నారా, అలా ఉండడం కంటే అతడి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టి అతణ్ణి సముద్రంలో పడవేయబడడమే అతనికి మేలు.
[43] “ఒకవేళ మీ చెయ్యి మీకు ఆటంకంగా ఉందనుకోండి. అలాంటప్పుడు దానిని నరికివేయండి! రెండు చేతులుండి నరకంలోని ఆరని అగ్నిలోకి వెళ్ళిపోవడం కంటే చెయ్యి లేకుండా జీవంలో ప్రవేశించడం మీకు మేలు.
[44] నరకంలో వాళ్ళ పురుగు చావదు, అగ్ని ఆరదు.
[45] ఒకవేళ మీ పాదం మీకు ఆటంకంగా ఉందనుకోండి. అలాంటప్పుడు దానిని నరికివేయండి! రెండు పాదాలుండి నరకంలో ఆరని అగ్నిలో పడవేయబడడం కంటే పాదం లేకుండా జీవంలో ప్రవేశించడం మీకు మేలు.
[46] నరకంలో వాళ్ళ పురుగు చావదు, అగ్ని ఆరదు.
[47] అలాగే మీ కన్ను మీకు ఆటంకంగా ఉంటే దానిని పీకి పారవెయ్యి! రెండు కండ్లుండి నరకంలో పడవేయబడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు.
[48] నరకంలో వాళ్ళ పురుగు చావదు. అగ్ని ఆరదు.
[49] ప్రతి ఒక్కరూ మంటలతో ఉప్పన చేయబడుతారు. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది.
[50] “ఉప్పు మంచిదే గాని ఒకవేళ ఉప్పు దాని ఉప్పదనాన్ని కోల్పోతే మీరు దానికి ఉప్పదనం కలిగించడం ఎలాగా? మీలో ఉప్పదనం కలిగి ఉండండి. ఒకరితో ఒకరు శాంతితో ఉండండి.”