Skip to content
Opens in a new window
Listen to this chapter • 10:21

[1] ఆయన అక్కడ నుంచి బయలుదేరి యూదయ ప్రదేశంలో యొర్దాను నది అవతలికి వెళ్ళాడు. మరో సారి జనం గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు. తన అలవాటు ప్రకారం ఆయన వారికి మళ్ళీ ఉపదేశమిచ్చాడు.

[2] పరిసయ్యులు కొందరు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయనను ఇలా అడిగారు: “పురుషుడు తన భార్యతో తెగతెంపులు చేసుకోవడం ధర్మమా?”

[3] ఆయన “మోషే మీకిచ్చిన ఆజ్ఞ ఏమిటి?” అని వారికి జవాబిచ్చాడు.

[4] “విడాకులు రాయించి ఆమెతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతించాడు” అని వారు చెప్పారు.

[5] అందుకు యేసు వారికి జవాబిచ్చాడు “బండబారిపోయిన మీ హృదయాలను బట్టి అతడు ఆ ఆదేశం మీకు వ్రాశాడు.

[6] కానీ సృష్టి ఆరంభంనుంచి దేవుడు ‘వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు’;

[7] ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు.

[8] వారిద్దరూ ఒకే శరీరమవుతారు’. కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాదు గాని ఒకే శరీరంగా ఉన్నారు.

[9] కనుక దేవుడు ఏకంగా చేసినదాన్ని మనిషి వేరు చేయకూడదు.”

[10] ఇంట్లో ఉన్నప్పుడు ఆయన శిష్యులు మరో సారి ఈ సంగతి గురించి ఆయనను అడిగారు.

[11] ఆయన “భార్యతో తెగతెంపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడేవాడెవడైనా ఆమెకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నాడు.

[12] అలాగే స్త్రీ తన భర్తతో తెగతెంపులు చేసుకొని మరొకణ్ణి పెండ్లాడితే ఆమె వ్యభిచారం చేస్తున్నది” అని వారితో అన్నాడు.

[13] ఆయన చిన్నపిల్లల మీద చేతులుంచాలని కొందరు వారిని తీసుకువచ్చారు గాని శిష్యులు వారిని తీసుకు వచ్చినవారిని మందలించారు.

[14] అది చూచి యేసు చాలా చికాకు చెంది శిష్యులతో ఇలా అన్నాడు: “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆటంక పరచవద్దు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం.

[15] మీతో ఖచ్చితంగా అంటున్నాను, చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారెవరైనా సరే అందులో ఎన్నడూ ప్రవేశించరు.”

[16] అప్పుడు ఆ చిన్నవారిని చేతులలోకి తీసుకొని వారిమీద చేతులుంచి వారిని దీవించాడు.

[17] ఆయన దారిలో బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక మనిషి పరుగెత్తి వచ్చి ఆయన ముందు మోకరించి “మంచి బోధకుడా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

[18] అతడితో యేసు “నన్ను మంచివాడు అంటూ ఎందుకు సంబోధిస్తున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఇంకెవరూ లేరు.

[19] దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు – ‘వ్యభిచారం చేయకూడదు’, ‘హత్య చేయకూడదు’, ‘దొంగతనం చేయకూడదు’, ‘అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు’, ‘వంచించ కూడదు’, ‘తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

[20] అతడు ఆయనతో “బోధకుడా, చిన్నప్పటి నుంచి వీటన్నిటినీ పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.

[21] అతణ్ణి చూస్తూ అతడిపట్ల యేసు ప్రేమభావం కలిగి అతడితో ఇలా అన్నాడు: “నీకు ఒకటి కొదువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. ఆ తరువాత సిలువ నెత్తుకొని వచ్చి నన్ను అనుసరించు.”

[22] అతడు గొప్ప ఆస్తిపరుడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని నొచ్చుకొంటూ వెళ్ళిపోయాడు.

[23] యేసు చుట్టూరా చూచి తన శిష్యులతో “ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టతరం!” అన్నాడు.

[24] ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే యేసు వారితో మళ్ళీ ఇలా అన్నాడు: “పిల్లలారా, ఆస్తిమీద నమ్మకం ఉంచినవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టం!

[25] ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో గుండా వెళ్ళడమే సులభం!”

[26] వారింకా అధికంగా ఆశ్చర్యపడి తమతో తాము “అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు?” అన్నారు.

[27] యేసు వారివైపు చూస్తూ “మనుషులకు ఇది అసాధ్యం గాని దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.

[28] పేతురు ఆయనతో “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా” అని చెప్పసాగాడు.

[29] అందుకు యేసు “మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఎవరైనా సరే నాకోసం, శుభవార్తకోసం ఇంటిని గానీ అన్నదమ్ములను గానీ అక్కచెల్లెళ్ళను గానీ తల్లిని గానీ తండ్రిని గానీ భార్యను గానీ పిల్లలను గానీ భూములను గానీ వదిలివేస్తే

[30] ఆ వ్యక్తికి ఇప్పుడు ఇహంలో ఇండ్లూ అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ తల్లులూ పిల్లలూ భూములూ హింసలతోపాటు నూరు రెట్లు దొరకక తప్పదు. వచ్చే యుగంలో అలాంటి వ్యక్తికి శాశ్వత జీవం ఉంటుంది.

[31] అయితే మొదటివారు చాలామంది చివరివారవుతారు, చివరివారు చాలామంది మొదటివారు అవుతారు” అన్నాడు.

[32] వారు జెరుసలంకు ప్రయాణమై దారిన వెళ్తూ ఉన్నారు. వారికి ముందు యేసు నడుస్తూ ఉన్నాడు. వారికి ఆశ్చర్యం వేసింది. ఆయనను అనుసరిస్తూ ఉన్నవారు భయపడుతూ ఉన్నారు. ఆయన ఆ పన్నెండు మందిని ప్రక్కకు తీసుకువెళ్ళి తనకు జరగబోయేవాటిని మరో సారి వారికి తెలియజేశాడు,

[33] “ఇదిగో వినండి, మనం జెరుసలం వెళ్ళిపోతున్నాం. అక్కడ మానవ పుత్రుణ్ణి ప్రధాన యాజులకూ ధర్మశాస్త్ర పండితులకూ పట్టి ఇవ్వడం జరుగుతుంది. వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు.

[34] ఆ యూదేతరులు ఆయనను వెక్కిరించి కొరడా దెబ్బలు కొడతారు, ఆయన మీద ఉమ్మివేసి చంపుతారు. మూడో రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు.”

[35] అప్పుడు జెబెదయి కొడుకులైన యాకోబు, యోహానులు ఆయన దగ్గరికి వచ్చి “గురువర్యా, మేము నిన్ను ఏది అడిగితే అది మాకు చేయాలని మా ఆశ” అన్నారు.

[36] వారితో ఆయన “మీకు నేనేమి చేయాలనుకొంటారు?” అన్నాడు.

[37] వారు “నీ మహిమలో మమ్మల్ని ఒకరిని నీ కుడి ప్రక్కన, ఒకరిని ఎడమ ప్రక్కన కూచుని ఉండేలా దయ చెయ్యి” అని ఆయనతో చెప్పారు.

[38] అందుకు యేసు “మీరు అడిగేదేమిటో మీకు తెలియదు. నేను త్రాగే గిన్నెలోది త్రాగడానికీ, నేను పొందే బాప్తిసం పొందడానికీ మీకు చాలినంత బలం ఉన్నదా?” అని వారితో అన్నాడు.

[39] వారాయనతో “మాకు చాలినంతబలం ఉంది” అన్నారు. యేసు వారితో “నేను త్రాగే గిన్నెలోది మీరూ త్రాగుతారు, నేను పొందే బాప్తిసం మీరూ పొందుతారు, నిజమే.

[40] కానీ నాకు కుడి ఎడమల ప్రక్కల కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. ఆ స్థానాలు ఎవరికోసం సిద్ధం చేయబడ్డాయో వారికి అవి దొరుకుతాయి” అన్నాడు.

[41] ఇది విని తక్కిన పదిమంది శిష్యులకు యాకోబు యోహానుల మీద చాలా చిరాకు కలిగింది.

[42] అయితే యేసు వారిని తన దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు: “ఇతర ప్రజలపై అధికారులుగా ఎంచబడ్డవారు వారిమీద పెత్తనం చెలాయిస్తారు, వారి ప్రముఖులు వారిమీద అధికారం ప్రయోగిస్తారు.

[43] మీ విషయంలో మాత్రం అలా కాదు. మీలో ప్రముఖుడు కావాలని ఇష్టమున్నవాడు మీకు సేవకుడై ఉండాలి.

[44] మీలో ప్రధానుడు కావాలని ఇష్టపడేవాడు అందరికీ దాసుడై ఉండాలి.

[45] ఎందుకంటే, మానవ పుత్రుడు సహా తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికే వచ్చాడు. ఇదీ గాక, అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధార పోయడానికి వచ్చాడు.”

[46] వారు యెరికో చేరారు, యెరికోనుంచి తన శిష్యులతో, పెద్ద జన సమూహంతో బయలుదేరుతూ ఉంటే ఒక గుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండి బిచ్చమెత్తుతున్నాడు. అతడు తీమయి కొడుకు బర్‌తీమయి.

[47] వస్తున్నది నజరేతువాడైన యేసు అని విని అతడు “యేసూ! దావీదు కుమారా! నామీద దయ చూపండి!” అని కేకలు పెట్టసాగాడు.

[48] ఊరుకొమ్మని అనేకులు అతణ్ణి గద్దించారు గాని అతడు “దావీదు కుమారా! నామీద దయ చూపండి” అంటూ మరీ ఎక్కువగా కేకలు పెట్టాడు.

[49] యేసు ఆగి “అతణ్ణి పిలవండి” అని ఆదేశించాడు. వారా గుడ్డివాణ్ణి పిలిచి “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు.

[50] అతడు తన పైబట్ట అవతల పారవేసి గబాలున లేచి యేసుదగ్గరికి వచ్చాడు.

[51] అందుకు యేసు “నీకోసం నన్నేమి చెయ్యమంటావు?” అని అతణ్ణి అడిగాడు. గుడ్డివాడు ఆయనతో “బోధకుడా, నాకు చూపు కలిగేలా చేయండి” అన్నాడు.

[52] యేసు అతడితో “నీవు వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. వెంటనే అతడికి చూపు వచ్చింది. అతడు దారిన యేసు వెంట వెళ్ళాడు.

మార్కు శుభవార్త — Chapters