Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:57

[1] విశ్రాంతి దినం తరువాత మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహాన్ని అభిషేకించుదామని సుగంధ ద్రవ్యాలు కొన్నారు.

[2] ఆదివారం నాడు వారు తెల్లవారు జామున ప్రొద్దు పొడవడంతోనే సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు.

[3] “మనకోసం ఎవరు సమాధి ద్వారంనుంచి ఆ రాయి దొర్లించివేస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.

[4] అప్పుడు తలెత్తి చూస్తే ఆ రాయి – అది చాలా పెద్దది – దొర్లించి ఉండడం వారికి కనిపించింది.

[5] వారు సమాధిలోకి వెళ్ళినప్పుడు తెల్లని అంగీ తొడుక్కొన్న యువకుడొకడు కుడి వైపున కూర్చుని ఉండడం వారు చూచి నిర్ఘాంతపోయారు.

[6] అతడు వారితో ఇలా అన్నాడు: “నిర్ఘాంతపోకండి! మీరు వెదుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన సజీవంగా లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఇదిగో, వారు ఆయనను పెట్టిన స్థలం!

[7] వెళ్ళి ఆయన శిష్యులతో – పేతురుతో కూడా – ఇలా చెప్పండి: మీకంటే ముందుగా ఆయన గలలీకి వెళ్ళబోతున్నాడు. ఆయన మీతో చెప్పినట్టే అక్కడ మీరాయనను చూస్తారు.”

[8] వారు త్వరగా బయటికి వెళ్ళి సమాధినుంచి పారిపోయారు. ఎందుకంటే వారికి వణుకు, విస్మయం పట్టుకొన్నాయి. వారు భయం కారణంగా ఎవరితో ఏమీ చెప్పలేదు.

[9] ఆదివారం నాడు యేసు పెందలకడే సజీవంగా లేచిన తరువాత మగ్దలేనే మరియకు మొట్టమొదట కనబడ్డాడు. అంతకుముందు ఆయన ఆమెలోనుంచి ఏడు దయ్యాలను వెళ్ళగొట్టాడు.

[10] మునుపు ఆయనతో ఉండేవారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి యేసు లేచిన సంగతి వారికి తెలియజేసింది.

[11] ఆయన సజీవుడనీ ఆమెకు కనబడ్డాడనీ విని వారు నమ్మలేదు.

[12] ఆ తరువాత వారిలో ఇద్దరు పల్లెసీమలో నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన మరో రూపంలో వారికి ప్రత్యక్షమయ్యాడు.

[13] వారు వెళ్ళి తక్కినవారికి ఆ సంగతి తెలిపారు. కానీ వీరి మాట కూడా వారు నమ్మలేదు.

[14] ఆ తరువాత పదకొండుమంది శిష్యులు భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన వారికి కనిపించాడు. తాను సజీవంగా లేచిన తరువాత తనను చూచినవారి మాట నమ్మకపోయినందు చేత వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం కారణంగా వారిని మందలించాడు.

[15] తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు: “మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టంలోని ప్రతి వ్యక్తికీ శుభవార్త ప్రకటించండి.

[16] దానిని నమ్మి బాప్తిసం పొందే వ్యక్తికి పాపవిముక్తి దొరుకుతుంది. నమ్మని వ్యక్తికి శిక్షావిధి కలుగుతుంది.

[17] ఈ సూచనలు నమ్మినవారి వెంట వస్తాయి: నా పేర దయ్యాలను వెళ్ళగొట్టివేస్తారు, క్రొత్త భాషలు మాట్లాడుతారు.

[18] పాములను పైకెత్తుతారు. ఒక వేళ వారు ప్రాణాంతక పానీయమేదైనా త్రాగితే వారికి ఎలాంటి హానీ కలగదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు రోగులు బాగుపడుతారు.”

[19] ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకంలోకి స్వీకరించబడి దేవుని కుడి వైపున కూర్చున్నాడు.

[20] అయితే శిష్యులు బయలుదేరి అంతటా యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై ఉండి పని జరిగిస్తూ దానితోపాటు ఆ సూచనల ద్వారా తన వాక్కును రూఢి చేస్తూ వచ్చాడు.

మార్కు శుభవార్త — Chapters