[1] పరిసయ్యులూ, కొందరు ధర్మశాస్త్ర పండితులూ జెరుసలంనుంచి వచ్చి యేసు చుట్టూ గుమికూడి,
[2] ఆయన శిష్యులలో కొందరు అశుద్ధమైన చేతులతో – అంటే, చేతులు కడుక్కోకుండా – రొట్టెలు తినడం చూచినప్పుడు వారు తప్పు పట్టారు.
[3] (పరిసయ్యులు, ఆ మాటకు వస్తే యూదులంతా, తమ పెద్దల సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రత్యేక విధంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు.
[4] బజారునుంచి వస్తే కడుక్కోకుండా తినరు. అంతే గాక, ఇంకా అనేక ఇతర విషయాలను వారు స్వీకరించి పాటిస్తున్నారు, అంటే గిన్నెలూ కుండలూ ఇత్తడి పాత్రలూ పడకలూ కడగడం.)
[5] ఆ పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు తింటున్నారు?” అని యేసును అడిగారు.
[6] ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు “కపట భక్తులైన మీ విషయం యెషయా ప్రవక్త ముందుగా పలికినది సరిగానే ఉంది! అతడు వ్రాసినదేమంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు గానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
[7] వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు.
[8] “మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల సంప్రదాయాలను పట్టుకొన్నవారు. అంటే పాత్రలూ గిన్నెలూ కడగడం, ఇలాంటివి మరి అనేకం చేస్తారు.”
[9] ఆయన వారితో ఇంకా అన్నాడు “మీ సంప్రదాయాన్ని పాటించడానికి మీరు దేవుని ఆజ్ఞ త్రోసివేసే విధం బాగుందయ్యా!
[10] మోషే ఇలా అన్నాడు గదా: మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిని గానీ తండ్రిని గానీ దూషించేవారికి మరణ శిక్ష విధించితీరాలి.
[11] మీరైతే ఇలా అంటారు: ఒక మనిషి తండ్రిని గానీ తల్లిని గానీ చూచి ‘నావల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్తా ‘కొర్బాన్’ (అంటే, దేవునికి అర్పించబడింది) అని చెపితే,
[12] మీరు అతణ్ణి తండ్రికోసం గానీ తల్లికోసం గానీ ఏమీ చేయనివ్వరు.
[13] ఈ విధంగా మీరు అందజేసిన సంప్రదాయంకోసం దేవుని వాక్కు చెల్లకుండా చేస్తున్నారు. ఇలాంటివి అనేకం చేస్తున్నారు.”
[14] అప్పుడాయన జనసమూహమంతటినీ దగ్గరకు పిలిచి వారికిలా చెప్పాడు: “నేను చెప్పేది మీరంతా విని గ్రహించండి!
[15] బయటినుంచి మనిషిలోకి వచ్చేదేదీ అతణ్ణి అశుద్ధం చేయజాలదు గాని మనిషిలోనుంచి బయటికి వచ్చేవే అతణ్ణి అశుద్ధం చేస్తాయి! ఎవరికైనా వినడానికి చెవులుంటే అతడు వింటాడు గాక!”
[17] ఆయన జన సమూహాన్ని విడిచి ఇంట్లోకి వచ్చిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు.
[18] ఆయన వారితో “అయితే మీరు కూడా ఇంత మందబుద్ధులా? బయటినుంచి మనిషిలోకి వచ్చేదేదీ అతణ్ణి అశుద్ధం చేయడం అసాధ్యమని మీరు గ్రహించడం లేదా?
[19] అలాంటిది అతని హృదయంలోకి వెళ్ళక కడుపులోకే పోయి విసర్జించబడుతుంది” అన్నాడు. (ఇలా చెప్పడం ద్వారా ఆయన ప్రతి రకమైన ఆహారం శుద్ధమైనదని ప్రకటించినట్టే).
[20] ఆయన ఇంకా అన్నాడు “మనిషిలోనుంచి వస్తున్నవే అతణ్ణి అశుద్ధం చేస్తాయి.
[21] ఎందుకంటే లోపలనుంచి, అంటే మనిషి హృదయంలోనుంచి చెడ్డ తలంపులు, వ్యభిచారాలు, లైంగిక అవినీతి పనులు, హత్యలు,
[22] దొంగతనాలు, పేరాశ, దుర్మార్గత, మోసం, కామవికారం, అసూయ, దూషణ, గర్వం, మూర్ఖత్వం వస్తాయి.
[23] ఈ చెడ్డవన్నీ లోపలనుంచి వచ్చి మనిషిని అశుద్ధం చేస్తాయి.”
[24] ఆయన అక్కడనుంచి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ఇంట్లో ప్రవేశించాడు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు.
[25] ఒకామె ఆయనను గురించి విని వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడింది. ఆమె చిన్న కూతురుకు మలిన పిశాచం పట్టింది.
[26] ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయ ప్రాంతంలో పుట్టిన గ్రీస్ దేశస్థురాలు. తన కూతురిలోనుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆమె యేసును బ్రతిమిలాడింది.
[27] అయితే యేసు ఆమెతో “మొదట పిల్లలను తృప్తిగా తిననియ్యి. పిల్లల భోజనం తీసి కుక్క పిల్లలకు వేయడం తగదు” అన్నాడు.
[28] అందుకామె ఆయనతో “స్వామీ, నిజమే గానీ బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు సహా పిల్లలు పడేసే ముక్కలు తింటాయి గదా!” అని జవాబిచ్చింది.
[29] అప్పుడాయన ఆమెతో “ఆ మాట చెప్పినందుచేత నీవు వెళ్ళవచ్చు. నీ కూతురిలోనుంచి దయ్యం వెళ్ళిపోయింది” అన్నాడు.
[30] ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే దయ్యం వెళ్ళిపోయి ఆమె కూతురు పడకమీద పడుకొని ఉండడం కనిపించింది.
[31] యేసు తూరు, సీదోను ప్రాంతంనుంచి మళ్ళీ బయలుదేరి దెకపొలి ప్రదేశం గుండా గలలీ సరస్సు దగ్గరికి వచ్చాడు.
[32] అక్కడ చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు.
[33] ఆయన అతణ్ణి జనసమూహం నుంచి వేరుగా తీసుకువెళ్ళి అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి అతడి నాలుకను తాకాడు.
[34] అప్పుడు ఆకాశంవైపు తలెత్తి చూస్తూ నిట్టూర్చి అతడితో “ఎప్ఫతా!” అన్నాడు. ఆ మాటకు “తెరచుకో!” అని అర్థం.
[35] వెంటనే అతడి చెవులు తెరచుకొన్నాయి. నాలుక సడలి అతడు తేటగా మాట్లాడాడు.
[36] ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారిని ఆదేశించాడు గానీ వారినెంత ఎక్కువగా ఆదేశించాడో అంత ఎక్కువగా వారు దానిని చాటించారు.
[37] వారు అమితంగా ఆశ్చర్యపడిపోయారు, “ఈయన అన్నిటినీ బాగు చేశాడు! చెవిటివాళ్ళు వినేలా చేస్తున్నాడు. మూగవాళ్ళను మాట్లాడిస్తున్నాడు!” అని చెప్పుకొన్నారు.