Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:49

[1] ఆయన దేవాలయంలో నుంచి వస్తూ ఉంటే ఆయన శిష్యులలో ఒకడు “గురువర్యా! ఇవిగో, ఎలాంటి రాళ్ళు కట్టడాలు ఇక్కడ ఉన్నాయి!” అన్నాడు.

[2] యేసు అతడితో “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు గదా! ఇక్కడ పడద్రోయబడకుండా ఏ రాయి మరో రాయిమీద నిలవదు” అంటూ జవాబిచ్చాడు.

[3] ఆయన దేవాలయానికి ఎదురుగా ఆలీవ్ కొండమీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు:

[4] “అవి ఎప్పుడు జరుగుతాయి? అవన్నీ నెరవేరబోయే ముందు ఏ సూచన కలుగుతుంది? మాతో చెప్పు.”

[5] అందుకు యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “మిమ్ములను ఎవరైనా మోసగించి తప్పుదారి పట్టించకుండా చూచుకోండి.

[6] అనేకులు నా పేర వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలామందిని మోసగించి తప్పుదారి పట్టిస్తారు.

[7] “మీరు యుద్ధ వార్తలూ యుద్ధ వదంతులూ వింటారు. అప్పుడు కంగారుపడకండి. అవి తప్పక జరగాలి గాని అంతం అప్పుడే రాదు.

[8] జనంమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. కరువులు, అల్లరులు కూడా కలుగుతాయి. ఇవి ప్రథమ ప్రసవ వేదనల్లాంటివి మాత్రమే.

[9] “మీరు జాగ్రత్తగా ఉండండి! ఎందుకంటే, వారు మిమ్ములను ఆలోచన సభలకు పట్టి ఇస్తారు. సమాజ కేంద్రాలలో మిమ్ములను కొట్టడం జరుగుతుంది. నాకోసం వారికి సాక్ష్యంగా మీరు ప్రాంతీయాధికారుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

[10] అంతానికి ముందుగా శుభవార్త అన్ని జనాలకూ ప్రకటించడం జరగాలి.

[11] వారు మిమ్ములను పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు ఏమి చెప్పాలా అని ముందుగా బెంబేలు పడకండి, పూర్వాలోచన చేయకండి. ఆ సమయంలో మీకు ఏ మాటలు ఇవ్వబడుతాయో అవే అనండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు గాని దేవుని పవిత్రాత్మే.

[12] “సోదరుడు సోదరుణ్ణీ, తండ్రి తన సంతానాన్నీ మరణానికి పట్టి ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని చంపిస్తారు.

[13] నా పేరు కారణంగా అందరూ మిమ్ములను ద్వేషిస్తారు. అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది.

[14] “అయితే దానియేలుప్రవక్త చెప్పిన అసహ్యమైన వినాశకారి నిలబడకూడని స్థలంలో నిలుచుండడం మీరు చూచేటప్పుడు (చదివేవారు గ్రహిస్తారు గాక!) యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.

[15] మిద్దెమీద ఉన్న వ్యక్తి తన ఇంటి నుంచి వస్తువేదైనా తీసుకువెళ్ళడానికి దిగి ఇంట్లో ప్రవేశించ కూడదు.

[16] పొలంలో ఉన్న వ్యక్తి పైవస్త్రం తీసుకువెళ్ళడానికి వెనక్కు తిరగకూడదు.

[17] అయ్యో! ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకూ బాలింతలకూ ఎంతో కష్టం కలుగుతుంది!

[18] మీరు పారిపోయేది చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.

[19] ఎందుకంటే, ఆ రోజుల్లో బాధ వస్తుంది. అలాంటిది దేవుడు సృష్టిని సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఆ తరువాత మరెన్నటికీ రాదు.

[20] ప్రభువు ఆ రోజులను తక్కువ చేయకపోతే శరీరం ఉన్న ఎవరూ తప్పించుకొనేవారు కాదు. కానీ ఎన్నికైనవారి కోసం, అంటే తాను ఎన్నుకొన్నవారి కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేశాడు.

[21] “ఆ కాలంలో ఎవరైనా మీతో ‘ఇడుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఇడుగో అక్కడ ఉన్నాడు!’ అంటే నమ్మకండి.

[22] ఎందుకంటే కపట క్రీస్తులూ కపట ప్రవక్తలూ వస్తారు. సాధ్యమైతే, దేవుడు ఎన్నుకొన్నవారిని కూడా మోసగించి తప్పుదారి పట్టించడానికి సూచనలూ అద్భుతాలూ ప్రదర్శిస్తారు.

[23] జాగ్రత్తగా ఉండండి! నేను మీతో అన్ని విషయాలు ముందుగానే చెప్పాను సుమా!

[24] “ఆ రోజుల్లో ఆ బాధకాలం అయిన తరువాత సూర్య మండలాన్ని చీకటి కమ్ముతుంది. చంద్రబింబం కాంతి ఇవ్వదు.

[25] ఆకాశంనుంచి చుక్కలు రాలుతాయి. ఆకాశంలోని శక్తులు కంపించిపోతాయి.

[26] అప్పుడు మానవ పుత్రుడు మేఘాలలో మహా బలప్రభావాలతో, మహిమాప్రకాశంతో రావడం వారు చూస్తారు.

[27] అప్పుడాయన తన దేవదూతలను పంపి నలుదిక్కుల నుంచి, భూమి కొనల నుంచి ఆకాశం కొనల వరకు, తాను ఎన్నుకొన్నవారిని సమకూరుస్తాడు.

[28] “అంజూర చెట్టును చూచి ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు లేతగా తయారై ఆకులు పట్టినప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీకు తెలుసు.

[29] అలాగే ఈ సంగతులు జరుగుతూ ఉండడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలోనే, తలుపు దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.

[30] మీతో నేను ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగేవరకు ఈ జాతి గతించదు.

[31] ఆకాశం, భూమి గతిస్తాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

[32] “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో ఏ మనిషికీ తెలియదు. పరలోకంలోని దేవదూతలకూ తెలియదు. కుమారునికి కూడా తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.

[33] జాగ్రత్తగా ఉండండి! మెళకువగా ఉండండి! ప్రార్థన చేస్తూ ఉండండి! ఎందుకంటే ఆ కాలమెప్పుడు వస్తుందో మీకు తెలియదు.

[34] “ఇది ఎలా ఉంటుందంటే, ఒక మనిషి వేరే దేశానికి వెళ్ళిపోబోతూ తన ఇంటిని విడిచి తన దాసులకు అధికారమిచ్చి ఒక్కొక్కనికి ఒక్కొక్క పని నియమించి, ద్వారపాలకుణ్ణి ఎప్పుడూ మెళకువగా ఉండాలని ఆజ్ఞాపించాడు.

[35] అలాగే మీరూ మెళకువగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో – అది సాయంకాల సమయమో, మధ్యరాత్రి వేళో, కోడి కూసే జామో, తెల్లవారేటప్పుడో మీకు తెలియదు.

[36] ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!

[37] నేను మీకు చెపుతున్నది అందరికీ చెపుతున్నాను – మెళకువగా ఉండండి!”

మార్కు శుభవార్త — Chapters