Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:17

[1] ఆ రోజుల్లో చాలా పెద్ద జన సమూహం గుమికూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోవడం చేత యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు:

[2] “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తున్నది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా.

[3] ఒకవేళ నేను వారిని ఆకలితోనే వారి ఇండ్లకు పంపివేస్తే దారిలో శోషపోతారు. కొందరు చాలా దూరం నుంచి వచ్చారు.”

[4] అందుకు ఆయన శిష్యులు “ఈ నిర్జన ప్రాంతంలో వీరు తృప్తిగా తినేలా ఎవరు రొట్టెలు పెట్టగలరు?” అని జవాబిచ్చారు.

[5] “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని ఆయన వారినడిగాడు. వారు “ఏడు” అన్నారు.

[6] జనసమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు. అప్పుడా ఏడు రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి జనానికి వడ్డించాలని తన శిష్యులకు అందించాడు. వారు జన సమూహానికి వడ్డించారు.

[7] వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఆయన వాటిని దీవించి ఇవి కూడా జనానికి వడ్డించాలని ఆదేశించాడు.

[8] జనం తృప్తిగా తిన్నారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే ఏడు గంపలు నిండాయి.

[9] తిన్న వారు సుమారు నాలుగు వేలమంది. ఆయన వారిని పంపివేసి,

[10] వెంటనే తన శిష్యులతోపాటు పడవ ఎక్కి దల్మానుతా ప్రాంతానికి వెళ్ళాడు.

[11] పరిసయ్యులు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకంనుంచి సూచనకోసం అద్భుతం ఒకటి చూపించమని కోరుతూ ఆయనతో తర్కించసాగారు.

[12] దానికి ఆయన అంతరాత్మలో దీర్ఘంగా నిట్టూర్చి “ఈ తరంవారు సూచనకోసం అద్భుతం ఎందుకు కోరుతున్నారు? మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఈ తరంవారికి ఏ సూచనా ఇవ్వబడదు” అన్నాడు.

[13] ఆయన వారిని విడిచి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు.

[14] శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మరచిపోయారు. వారి దగ్గర పడవలో ఒకే రొట్టె తప్ప మరెక్కువ ఏమీ లేదు.

[15] ఆయన వారిని హెచ్చరిస్తూ “మీరు శ్రద్ధ కలిగి ఉండండి – పరిసయ్యులకూ హేరోదురాజుకూ సంబంధించిన ‘పొంగజేసే పదార్థం’ గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.

[16] వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ “మనదగ్గర రొట్టెలు లేవు గనుక ఇలా అన్నాడు” అని చెప్పుకొన్నారు.

[17] అది తెలుసుకొని యేసు వారితో అన్నాడు “మీ దగ్గర రొట్టెలు లేవని ఎందుకు చర్చించుకొంటున్నారు? మీరింకా తెలుసుకోలేదా? గ్రహించలేదా? మీకింకా గుండె బండబారి పోయిందా?

[18] కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు జ్ఞాపకం లేదా? –

[19] ఆ అయిదు వేలమందికి నేను ఆ అయిదు రొట్టెలు విరిచి పంచిన సమయంలో మిగిలిన ముక్కలను ఎన్ని గంపల నిండ ఎత్తారు?” వారాయనతో “పన్నెండు” అన్నారు.

[20] “నేను నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు విరిచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని గంపల నిండా ఎత్తారు?” అన్నాడు. వారాయనతో “ఏడు” అన్నారు.

[21] ఆయన వారితో “మీకు అర్థం కాకపోవడమెలాగు?” అన్నాడు.

[22] ఆయన బేత్‌సయిదా చేరుకొన్నప్పుడు కొందరు ఒక గుడ్డివాణ్ణి ఆయనదగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు.

[23] ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి బయటికి తీసుకువెళ్ళాడు. అతడి కండ్లమీద ఉమ్మివేసి అతడి మీద చేతులుంచి “నీకేమైనా కనిపిస్తున్నదా?” అని అతణ్ణి అడిగాడు.

[24] అతడు పైకి చూస్తూ “మనుషులు నడవడం నాకు కనిపిస్తున్నది. వారు చెట్లలాగా ఉన్నారు” అన్నాడు.

[25] మరో సారి ఆయన అతడి కండ్లమీద చేతులుంచి పైకి చూడమన్నాడు. అప్పుడతడు పూర్తిగా నయమయ్యాడు. అందరూ తేటగా అతనికి కనిపించారు.

[26] అతణ్ణి అతని ఇంటికి పంపిస్తూ ఆయన “ఊరిలోకి వెళ్ళకు, ఈ సంగతి ఊరిలో ఎవరికి చెప్పకు” అన్నాడు.

[27] యేసు, ఆయన శిష్యులు కలిసి సీజరియ ఫిలిప్పీలో ఉన్న గ్రామాలకు బయలుదేరారు. దారిలో ఆయన తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “నేనెవరినని మనుషులు చెప్పుకొంటున్నారు?”

[28] వారు “బాప్తిసమిచ్చే యోహానంటారు కొందరు. ఏలీయావని అంటారు మరి కొందరు. మరి కొందరేమో ప్రవక్తలలో ఒకరివంటారు” అన్నారు.

[29] “అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటున్నారు?” అని ఆయన వారినడిగాడు. “నీవు అభిషిక్తుడవే!” అని పేతురు ఆయనకు సమాధానం చెప్పాడు.

[30] అప్పుడు ఆయన తనను గురించి ఎవరికీ చెప్పకూడదని వారిని హెచ్చరించాడు.

[31] అప్పుడాయన వారికి ఈ సంగతులు నేర్పడం ఆరంభించాడు: మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవించి పెద్దల, ప్రధాన యాజుల, ధర్మశాస్త్ర పండితుల నిరాకరణకు గురి అయి చంపబడి మూడు రోజుల తరువాత మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి అని.

[32] ఈ విషయం తేటతెల్లంగా చెప్పాడు. అయితే పేతురు ఆయనను ఒక్కణ్ణే తీసుకువెళ్ళి మందలించసాగాడు.

[33] అందుకు యేసు మళ్ళుకొని తన శిష్యులను చూచి పేతురును మందలిస్తూ “సైతానూ! నా వెనుకకు పో! మనుషుల సంగతుల మీదే గాని దేవుని సంగతులమీద నీ మనసు ఉండడం లేదు.”

[34] అప్పుడాయన తన శిష్యులనూ జన సమూహాన్నీ దగ్గరకు పిలిచి వారితో అన్నాడు “ఎవరైనా సరే నావెంట రావాలనుకొంటే, తనను తిరస్కరించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి.

[35] తమకోసం ప్రాణాన్ని దక్కించుకోవాలి అనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు. కానీ నాకోసం, శుభవార్త కోసం తమ ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకొంటారు.

[36] ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొంటే ఆ వ్యక్తికి లాభమేమిటి?

[37] మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు?

[38] వ్యభిచార సంబంధమైన ఈ పాపిష్ఠి తరంలో ఎవరైనా సరే నన్ను గురించి గానీ నా మాటల గురించి గానీ సిగ్గుపడుతూ ఉంటే, మానవ పుత్రుడు కూడా తన తండ్రి మహిమతోనూ పవిత్ర దేవదూతలతోనూ వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి సిగ్గుపడుతాడు.”

మార్కు శుభవార్త — Chapters