[1] అప్పుడాయన వారితో ఉదాహరణలలో చెప్పసాగాడు: “ఒక మనిషి ద్రాక్షతోట నాటాడు. దాని చుట్టూ గోడ కట్టి ద్రాక్ష గానుగ తొట్టి కోసం అందులో గుంట తొలిపించి కావలి గోపురం కట్టించాడు. అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూర దేశానికి వెళ్ళాడు.
[2] కోతకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పంటలో కొంత రైతుల దగ్గరనుంచి తెమ్మని వారి దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు.
[3] అయితే వారు అతణ్ణి పట్టుకొని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.
[4] అతడు మళ్ళీ మరో దాసుణ్ణి వారిదగ్గరకు పంపాడు. వారు అతని వైపు రాళ్ళు రువ్వి అతని నెత్తి గాయపరచి అతణ్ణి అవమానించి పంపివేశారు.
[5] అతడు ఇంకొకణ్ణి పంపాడు. అతణ్ణి వారు చంపారు. ఇంకా అనేకులను పంపాడు. వారు కొందరిని కొట్టారు, కొందరిని చంపారు.
[6] “ఇంకా అతనికి తన ప్రియ కుమారుడొక్కడే మిగిలాడు. ‘వారు నా కుమారుణ్ణి గౌరవిస్తారు’ అని చెప్పి చివరిగా అతణ్ణి వారిదగ్గరకు పంపాడు.
[7] కానీ ఆ రైతులు తమలో ఇలా చెప్పుకొన్నారు: ‘వారసుడు వీడే! వీణ్ణి చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది!’
[8] వారతణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేశారు.
[9] “అందుచేత ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను చంపి ద్రాక్షతోటను వేరే వారి చేతికిస్తాడు.
[10] మీరు ఈ లేఖనం చదవలేదా? – కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.
[11] అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.”
[12] వారు తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ ఆయన చెప్పాడని గ్రహించి ఆయనను పట్టుకోవాలని చూశారు గాని జన సమూహానికి భయపడ్డారు. అప్పుడు వారు ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
[13] ఆయనను మాటలలో చిక్కించుకోవడానికి వారు పరిసయ్యులలో, హేరోదు పక్షంవారిలో కొందరిని ఆయన దగ్గరికి పంపారు.
[14] వారు వచ్చి ఆయనతో ఇలా అన్నారు: “బోధకుడా! మీరు యథార్థవంతులనీ ఎవరినీ లెక్క చేయరనీ మాకు తెలుసు. మీరు మనుషులను పక్షపాతంతో చూడకుండా దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తారు. సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా, కాదా?
[15] మనం చెల్లించాలా? చెల్లించకూడదా?” అయితే వారి కపట బుద్ధి తెలిసి ఆయన వారితో “నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తెచ్చి నాకు చూపెట్టండి” అన్నాడు.
[16] వారు నాణెం తెచ్చినప్పుడు “ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు. వారాయనతో “సీజర్‌వి” అన్నారు.
[17] యేసు వారికి జవాబిస్తూ “సీజర్‌వి సీజర్‌కూ దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు. ఆయనంటే వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
[18] అప్పుడు సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. (చనిపోయినవారు సజీవంగా లేవరని వీరు చెప్పేవారు.) వారాయనను ఇలా ప్రశ్నించారు:
[19] “బోధకుడా, మోషే మనకోసం రాసినది ఇది – ఒక మనిషి సోదరుడు తన భార్యను సజీవంగా విడిచి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతడి భార్యను పెళ్ళి చేసుకొని అతడి వంశాన్ని నిలబెట్టాలి.
[20] ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా చనిపోయాడు.
[21] రెండోవాడు ఆమెను పెళ్ళాడాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడోవాడి సంగతి కూడా అంతే.
[22] ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళాడి సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది.
[23] చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు వారిలో ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమె ఆ ఏడుగురికీ భార్యగా ఉంది గదా?”
[24] వారికి జవాబిస్తూ యేసు అన్నాడు “లేఖనాలూ దేవుని బలప్రభావాలూ మీకు తెలియదు. ఈ కారణంచేతే గదా మీరు పొరబడుతున్నారు!
[25] చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు పెండ్లి చేసుకోరు, పెండ్లికియ్యరు. ఇందులో వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు.
[26] చనిపోయినవారు సజీవంగా లేచే విషయమైతే – మోషే వ్రాసిన గ్రంథంలో పొదను గురించిన భాగం మీరు చదవలేదా? దేవుడు అతనితో చెప్పినది ఏమంటే ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’.
[27] ఆయన చనిపోయినవారి దేవుడు కాడు గాని జీవిస్తూ ఉన్న వారి దేవుడు. మీరు అధికంగా పొరబడుతున్నారు.”
[28] ఈలోగా ధర్మశాస్త్ర పండితులలో ఒకడు వచ్చి వారు వాదించడం విన్నాడు. యేసు వారికి బాగా జవాబిచ్చాడని తెలిసి అతడు ఆయనను చూచి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది?” అని అడిగాడు.
[29] యేసు అతడికి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఇది: ‘ఇస్రాయేల్ ప్రజలారా, వినండి. ప్రభువు మన దేవుడు, ప్రభువు ఒక్కడే.
[30] హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా, బలమంతటితో మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.
[31] రెండోది, దానిలాంటిది ఇది: ‘మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’. వీటికంటే గొప్ప ఆజ్ఞ మరేదీ లేదు” అని జవాబిచ్చాడు.
[32] ఆ ధర్మశాస్త్ర పండితుడు ఆయనతో “ఉపదేశకా, మీరు బాగా చెప్పారు. దేవుడు ఒక్కడే అనీ ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పినది నిజమే.
[33] హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బుద్ధి అంతటితో, బలం అంతటితో ఆయనను ప్రేమించడమూ మనలను ప్రేమించుకొన్నట్టే పొరుగువారిని ప్రేమించడమూ అన్ని హోమాలకంటే, బలులకంటే అధికం” అన్నాడు.
[34] అతడు జ్ఞానంతో జవాబివ్వడం చూచి యేసు అతడితో “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ఏ ప్రశ్నా అడగడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది.
[35] యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ “అభిషిక్తుడు దావీదు కుమారుడు అని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు?
[36] దావీదు తానే దేవుని పవిత్రాత్మ మూలంగా అన్నదేమంటే, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు – నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచేవరకు నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.’
[37] దావీదు తానే ఆయనను ‘ప్రభువు’ అంటున్నాడు. అలాంటప్పుడు ఆయన అతనికెలా కుమారుడు అవుతాడు?” అన్నాడు. జన సమూహం ఆయన ఉపదేశం ఎంతో సంతోషంతో వింటున్నారు.
[38] ఆయన ఉపదేశంలో వారితో ఇంకా ఇలా అన్నాడు: “ధర్మశాస్త్ర పండితుల విషయం జాగ్రత్త! పొడుగాటి అంగీలు తొడుక్కొని తిరగడం, సంత వీధులలో వందనాలు అందుకోవడం,
[39] సమాజ కేంద్రాలలో అగ్ర స్థానాలు, విందులలో ముఖ్య స్థలాలు వారికిష్టం.
[40] విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగివేసేవారు కూడా వీరే. వారు నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వారు మరీ కఠినమైన శిక్షావిధికి గురి అవుతారు.”
[41] యేసు దేవాలయంలో కానుక పెట్టెకు ఎదురుగా కూర్చుని జన సమూహం ఆ పెట్టెలో డబ్బు వేయడం చూస్తూ ఉన్నాడు. ధనవంతులు అనేకులు పెద్ద మొత్తంలో డబ్బు వేశారు.
[42] అప్పుడు ఒక బీద విధవరాలు వచ్చి రెండు పైసలు అందులో వేసింది.
[43] ఆయన తన శిష్యులను దగ్గరకు పిలిచి “మీతో ఖచ్చితంగా అంటున్నాను, కానుక పెట్టెలో డబ్బు వేసినవారందరి కంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది.
[44] ఎలాగంటే, వారంతా తమ అతి సమృద్ధిలోనుంచి కొంత వేశారు గాని ఈమె తన లేమిలోనుంచి తనకున్నదంతా, తన బ్రతుకుదెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.