[1] ఉదయం కాగానే ప్రధాన యాజులు పెద్దలతో, ధర్మశాస్త్ర పండితులతో, యూద సమాలోచన సభవారందరితో పాటు సమాలోచన జరిపారు. అప్పుడు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమన్ అధిపతి పిలాతుకు అప్పగించారు.
[2] పిలాతు “నీవు యూదుల రాజువా?” అని ఆయన నడిగాడు. “నీవన్నట్టే” అని ఆయన అతడికి జవాబిచ్చాడు.
[3] ప్రధాన యాజులు ఆయనమీద అనేక నేరాలు మోపారు. అయితే ఆయన జవాబేమి చెప్పలేదు.
[4] కనుక పిలాతు మరో సారి ఆయనను ప్రశ్నిస్తూ “నీవేం జవాబు చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలిస్తున్నారో చూడు!” అన్నాడు.
[5] అయితే యేసు ఇంకా ఏమీ సమాధానం చెప్పలేదు గనుక పిలాతుకు ఆశ్చర్యం వేసింది.
[6] ఆ పండుగలో వారు తనను కోరిన ఒక ఖైదీని విడుదల చేయడం అతడికి అలవాటు.
[7] బరబ్బ అనేవాడు తన తోటి తిరుగుబాటుదారులతో కూడా ఖైదులో ఉన్నాడు. ఆ తిరుగుబాటులో వారు హత్య చేశారు.
[8] జనసమూహం కేకలు పెట్టి ఎప్పటిలాగా తమ కోరిక ప్రకారం చేయాలని పిలాతును అడిగారు.
[9] వారికి పిలాతు జవాబిస్తూ “నేనీ యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అన్నాడు.
[10] ఎందుకంటే, ప్రధాన యాజులు అసూయ కారణంగా ఆయనను తనకు అప్పగించారని అతడు గ్రహించాడు.
[11] అయితే యేసుకు బదులు బరబ్బను విడుదల చేయాలని కోరవలసిందిగా ప్రధాన యాజులు జన సమూహాన్ని పురికొలిపారు.
[12] మరోసారి పిలాతు జవాబిస్తూ వారితో “అలాగైతే మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే యేసును నేనేం చేయాలని కోరుతున్నారు?” అన్నాడు.
[13] వారు మళ్ళీ కేక వేస్తూ “అతణ్ణి సిలువ వేయండి!” అన్నారు.
[14] వారితో పిలాతు “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు?” అన్నాడు. వారు “అతణ్ణి సిలువ వేయండి!” అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టారు.
[15] అప్పుడు పిలాతు జన సమూహాన్ని మెప్పించాలని వారికోసం బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించిన తరువాత సిలువ వేయడానికి అప్పగించాడు.
[16] సైనికులు ఆయనను అధిపతి భవనంలోకి తీసుకువెళ్ళి తక్కిన సైనికుల గుంపునంతా అక్కడికి పిలిచారు.
[17] వారాయనకు ఊదారంగు అంగీ తొడిగారు. ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు.
[18] “యూదుల రాజా! శుభం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు.
[19] రెల్లుకర్రతో ఆయన తలమీద కొట్టారు, ఆయనమీద ఉమ్మివేశారు, మోకరించి ఆయనకు నమస్కరించారు.
[20] ఈ విధంగా వారు ఆయనను వెక్కిరించిన తరువాత ఊదారంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయడానికి బయటికి తీసుకువెళ్ళారు.
[21] అప్పుడు పల్లెసీమ నుంచి కురేనే ప్రాంతీయుడైన సీమోను ఆ త్రోవలో నడిచి వస్తూ ఉన్నాడు (అతడు అలెగ్జాండర్, రూఫస్‌ల తండ్రి). సైనికులు బలవంతాన యేసు సిలువను అతనిచేత మోయించారు.
[22] వారాయనను గొల్గొతా అనే స్థలానికి తీసుకువచ్చారు. గొల్గొతా అంటే కపాల స్థలం అని తర్జుమా.
[23] అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు.
[24] వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలకోసం ఏ బట్ట ఎవడికి కావాలో నిర్ణయించడానికి చీట్లు వేసి వాటిని పంచుకొన్నారు.
[25] ఆయనను సిలువ వేసినది ఉదయం తొమ్మిది గంటలకు.
[26] “యూదుల రాజు” అని ఆయనమీద మోపిన నేరం రాసి పైగా ఉంచారు.
[27] ఆయనతో కూడా ఇద్దరు దోపిడీ దొంగలను, ఒకణ్ణి ఆయన కుడి వైపున, మరొకణ్ణి ఎడమ వైపున సిలువ వేశారు.
[28] అప్పుడు ఈ లేఖనం నెరవేరింది: “ఆయనను అక్రమకారులలో ఒకడిగా ఎంచడం జరిగింది.”
[29] ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ ఆయనను దూషిస్తూ “ఓహో! దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టేవాడా!
[30] నిన్ను నీవే రక్షించుకో! సిలువనుంచి దిగిరా!” అన్నారు.
[31] అలాగే ప్రధాన యాజులు ధర్మశాస్త్ర పండితులతోపాటు ఆయనను వెక్కిరిస్తూ “ఇతడు ఇతరుల్ని రక్షించాడు, తనను రక్షించుకోలేడు!
[32] ఈ ‘అభిషిక్తుడు’, ఈ ‘ఇస్రాయేల్ రాజు’ ఇప్పుడు సిలువ దిగిరావాలి. అది చూచి నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఆయనతోపాటు సిలువ వేయబడ్డవారు కూడా ఆయనను నిందించారు.
[33] మధ్యాహ్నం పన్నెండు గంటలయినప్పుడు మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది.
[34] మూడు గంటలప్పుడు యేసు “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు “నా దేవా! నా దేవా! నా చేయి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.
[35] దగ్గరలో నిలుచున్నవారిలో కొంతమంది అది విని “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
[36] వారిలో ఒకడు పరుగెత్తుకొంటూ వెళ్ళి స్పంజీని పులిసిపోయిన ద్రాక్షరసంతో నింపి రెల్లుకర్రకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించాడు “ఆయన్ను విడిచిపెట్టండి. ఏలీయా ఇతణ్ణి కిందికి దింపడానికి వస్తాడో రాడో చూద్దాం” అన్నాడు.
[37] యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
[38] అప్పుడు దేవాలయం తెర పైనుంచి క్రిందికి రెండుగా చినగడం జరిగింది.
[39] యేసుకు ఎదురుగా రోమన్ సేన శతాధిపతి నిలిచి ఉండి, ఆయన ఈ విధంగా కేకవేసి ప్రాణం విడిచాడని చూచి “నిజంగా ఈ మనిషి దేవుని కుమారుడు!” అన్నాడు.
[40] స్త్రీలు కొందరు కూడా దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియ, “చిన్న” యాకోబుకూ యోసేకూ తల్లి అయిన మరియ, సలోమి ఉన్నారు.
[41] యేసు గలలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను అనుసరిస్తూ ఆయనకు సేవ చేసేవారు. ఆయన వెంట జెరుసలంకు వచ్చిన ఇంకా అనేకమంది స్త్రీలు కూడా ఉన్నారు.
[42] అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.
[43] అప్పటికి సాయంకాలం అయింది గనుక అరిమతయి గ్రామం వాడైన యోసేపు వచ్చి ధైర్యం తెచ్చుకొని పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. ఈ యోసేపు యూద సమాలోచన సభలో గౌరవనీయుడైన సభ్యుడూ దేవుని రాజ్యంకోసం ఎదురు చూస్తున్నవాడూ.
[44] ఇంతకు ముందే ఆయన చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి ఆయన అప్పటికే చనిపోయాడా అని అతణ్ణి అడిగాడు.
[45] ఆయన చనిపోయాడని శతాధిపతివల్ల తెలుసుకొని ఆయన దేహాన్ని యోసేపుకు ఇప్పించాడు.
[46] యోసేపు సన్నని నారబట్ట కొని యేసును క్రిందకు దింపి ఆ బట్టతో చుట్టాడు. రాతిలో తొలిపించబడ్డ సమాధిలో ఆయనను పెట్టాడు. సమాధి ద్వారానికి రాయి దొర్లించాడు.
[47] ఆయనను పెట్టిన చోటును మగ్దలేనే మరియ, యోసే తల్లి అయిన మరియ చూశారు.