Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:51

[1] వారు సరస్సు ఒడ్డున ఉన్న గదరెనివారి ప్రాంతానికి వచ్చారు.

[2] ఆయన పడవ దిగినవెంటనే మలిన పిశాచం పట్టిన ఒక మనిషి సమాధులలో నుంచి ఆయనకు ఎదురుగా వచ్చాడు.

[3] సమాధులలోనే అతడి నివాసం. అతణ్ణి ఎవరూ సంకెళ్ళతో సహా కట్టలేకపోయారు.

[4] అంతకుముందు తరచుగా అతణ్ణి కట్లతో, సంకెళ్ళతో కట్టారు గానీ అతడు సంకెళ్ళను తెంపివేశాడు, కట్లను ముక్కలు చేశాడు. అతణ్ణి లొంగదీసేది ఎవరిచేతా కాలేదు.

[5] రాత్రింబగళ్ళు అతడు సమాధులలో, కొండలలో ఉండి ఎప్పుడూ కేకలు వేస్తూ రాళ్ళతో తనను గాయపరచుకొంటూ ఉన్నాడు.

[6] అతడు దూరంనుంచి యేసును చూచినప్పుడు పరుగెత్తుకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు,

[7] “యేసూ! సర్వాతీతుడైన దేవుని కుమారా! నాతో నీకేం పని? నన్ను వేధించనని దేవుని పేర నిన్ను ఒట్టు పెట్టిస్తున్నాను!” అంటూ గొంతెత్తి అరిచాడు.

[8] ఎందుకంటే ఆయన అతణ్ణి చూచి “మలిన పిశాచమా! ఆ మనిషిని విడిచి బయటికి రా!” అన్నాడు.

[9] ఆయన “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలామందిమి” అని అతడు జవాబిచ్చాడు.

[10] అతడు ఆ దేశంనుంచి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలుకొన్నాడు.

[11] అక్కడ కొండలదగ్గర ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.

[12] “మేము పందులలో దూరేలా మమ్మల్ని వాటిలోకి పంపెయ్యి” అని ఆ దయ్యాలంతా ఆయనను వేడుకొన్నాయి.

[13] వెంటనే యేసు వాటికి సెలవిచ్చాడు. ఆ మలిన పిశాచాలు ఆ మనిషిలోనుంచి బయటికి వచ్చి పందులలో చొరబడ్డాయి. అప్పుడా పందుల మంద ఆ నిట్రమైన స్థలం మీద నుంచి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి మునిగి చచ్చాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి.

[14] పందులు మేపేవారు పారిపోయి ఆ సంగతి ఊరిలో, పల్లెసీమలో చెప్పారు. జరిగినదేమిటో చూద్దామని అక్కడివారు వచ్చారు.

[15] యేసు దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనఃస్థిమితంతో కూర్చుని ఉండడం చూశారు. వారికి భయం వేసింది.

[16] జరిగినది చూచినవారు దయ్యాలు పట్టిన ఆ మనిషి విషయంలో సంభవించినది, పందుల సంగతి కూడా వారికి తెలియజేశారు.

[17] అప్పుడు వారు యేసును చూచి తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకోసాగారు.

[18] ఆయన పడవ ఎక్కుతూ ఉంటే అంతకుముందు దయ్యాలు పట్టినవాడు ఆయనదగ్గర తనను ఉండనిమ్మని బ్రతిమిలాడాడు.

[19] కానీ యేసు అతణ్ణి రానివ్వలేదు. దానికి బదులు అతడితో “నీవు ఇంటికి వెళ్ళి ప్రభువు నీమీద జాలి చూపి నీకెంత గొప్ప క్రియలు చేశాడో నీవారికి చెప్పు” అన్నాడు.

[20] అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో అదంతా దెకపొలిలో చాటించసాగాడు. అందరికి ఎంతో ఆశ్చర్యం వేసింది.

[21] యేసు పడవలో అవతలి ఒడ్డుకు మళ్ళీ చేరినప్పుడు పెద్ద జన సమూహం ఆయన దగ్గర సమకూడింది. ఆయన సరస్సు ఒడ్డున ఉన్నాడు.

[22] అప్పుడు యూద సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఆ అధికారి పేరు యాయీరు.

[23] “నా చిన్న కూతురు చావుబతుకుల్లో ఉంది. ఆమె బాగుపడి బతికేలా మీరు వచ్చి ఆమెమీద చేతులు ఉంచండి” అంటూ యేసును హృదయ పూర్వకంగా బతిమాలుకొన్నాడు.

[24] ఆయన అతడితోకూడా వెళ్ళాడు. పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్ళింది. జనం ఆయనమీద విరగబడుతూ ఉన్నారు.

[25] పన్నెండేళ్ళనుంచి రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది.

[26] ఈమె అనేకమంది వైద్యులచేత అనేక బాధలు అనుభవిస్తూ తనకు కలిగినదంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఎక్కువైంది.

[27] ఆమె యేసును గురించి విని,

[28] “ఆయన బట్టలను తాకితే చాలు, నాకు పూర్తిగా నయమవుతుంది” అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకింది.

[29] వెంటనే ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమయిన అనుభవం శరీరంలో కలిగింది.

[30] వెంటనే యేసు తనలోనుంచి ప్రభావం వెలువడిందని గ్రహించి జన సమూహం వైపుకు తిరిగి “నా బట్టలను తాకినదెవరు?” అన్నాడు.

[31] ఆయన శిష్యులు ఆయనతో “ఈ గుంపు నీమీద విరగబడుతూ ఉండడం చూస్తున్నావు గదా. మరి, ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావా?” అన్నారు.

[32] ఆయనైతే అలా చేసిన ఆమెను చూడడానికి చుట్టూ కలియజూశాడు.

[33] ఆ స్త్రీ తనకు జరిగినది గ్రహించి భయంతో వణకుతూ వచ్చి ఆయన ముందు పడి నిజమంతా చెప్పుకొంది.

[34] ఆయన ఆమెతో అన్నాడు “కుమారీ, నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. బాధ నివారణ పొంది శాంతితో వెళ్ళు.”

[35] ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటినుంచి కొందరు వచ్చి “మీ కూతురు చనిపోయింది. ఇక బోధకుణ్ణి తొందర పెట్టడమెందుకు?” అన్నారు.

[36] వారు చెప్పిన మాట యేసు విన్న వెంటనే సమాజకేంద్రం అధికారితో “భయపడకు! నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.

[37] ఆయన పేతురునూ యాకోబునూ యాకోబు తోబుట్టువైన యోహానునూ తప్ప ఇంకెవరినీ తనవెంట రానివ్వలేదు.

[38] ఆయన సమాజకేంద్రం అధికారి ఇంటిదగ్గర చేరినప్పుడు సందడిగా ఉండడం ఆయన చూశాడు. అక్కడివారు బిగ్గరగా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు.

[39] ఆయన ఇంట్లో ప్రవేశించి “ఎందుకు సందడి చేస్తూ ఏడుస్తూ ఉన్నారు? పిల్ల చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే” అన్నాడు.

[40] వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు. ఆయన వారందరినీ బయటికి పంపిన తరువాత, ఆ పిల్ల తల్లిదండ్రులనూ తనతో ఉన్నవారినీ వెంటబెట్టుకొని పిల్ల పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళాడు.

[41] ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొని “తలితా కుమీ!” అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు “చిన్న పిల్లా, నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.

[42] వెంటనే ఆ పిల్ల లేచి నడిచింది (ఆమె వయస్సు పన్నెండేళ్ళు). దీనితో వారు ఎంతో విస్మయం చెందారు.

[43] ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదని ఆయన వారిని గట్టిగా ఆదేశించి ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు.

మార్కు శుభవార్త — Chapters