[1] మరో సారి ఆయన సమాజ కేంద్రంలోకి వెళ్ళాడు. అక్కడ చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు.
[2] ఆయన విశ్రాంతి దినాన అతణ్ణి బాగు చేస్తాడేమో అని వారాయనను చూస్తూ ఉన్నారు. ఆయనమీద నేరం మోపాలని వారి ఉద్దేశం.
[3] ఆయన చేయి ఎండిపోయినవాడితో “ఇటు దగ్గరకు రా!” అన్నాడు.
[4] అప్పుడాయన వారితో అన్నాడు, “విశ్రాంతి దినాన మేలు చేయడం, కీడు చేయడం, ప్రాణాన్ని దక్కించడం, చంపడం ఏది ధర్మం?” అందుకు వారు ఊరుకొన్నారు.
[5] ఆయన వారి హృదయ కాఠిన్యానికి నొచ్చుకొని వారివైపు కోపంతో కలయజూశాడు. అప్పుడా మనిషితో “నీ చేయి చాపు!” అన్నాడు. అతడు దానిని చాపగానే అది మరో చేయి ఎంత బాగుగా ఉందో అంత పూర్తిగా నయమయింది.
[6] అప్పుడు పరిసయ్యులు బయటికి వెళ్ళి, వెంటనే హేరోదురాజు పక్షంవారితో కలిసి యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనమీద కుట్ర పన్నారు.
[7] యేసు తన శిష్యులతోపాటు సరస్సు ఒడ్డుకు వెళ్ళిపోయాడు. గలలీనుంచి ఒక పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్ళారు.
[8] అంతే కాదు. ఆయన చేస్తున్న వాటి గురించి విని యూదయ నుంచీ జెరుసలం, ఇదుమియా, యొర్దాను నది అవతల ప్రాంతంనుంచీ తూరు, సీదోను నుంచీ జనం చాలా పెద్ద గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు.
[9] జన సమూహం తనమీద పడకుండా ఉండేందుకు తన కోసం ఒక పడవను సిద్ధం చేయండని ఆయన తన శిష్యులతో చెప్పాడు.
[10] ఆయన అనేకులను బాగు చేసినందుచేత రోగాలతో ఉన్నవారంతా ఆయనను తాకాలని ఆయన దగ్గరకు తోసుకు వస్తూ ఉన్నారు.
[11] మలిన పిశాచాలు పట్టినవారు ఆయనను చూడగానే “నీవు దేవుని కుమారుడివి” అని అరుస్తూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు.
[12] ఆయన తన విషయం తెలియజేయకూడదని ఆ పిశాచాలను ఆజ్ఞాపించాడు.
[13] తరువాత ఆయన కొండమీదికి ఎక్కిపోయి తనదగ్గరకు ఎవరిని పిలవాలని ఇష్టపడ్డాడో వారిని పిలిచాడు. వారు ఆయనదగ్గరకు వచ్చారు.
[14] వారు తనతో ఉండాలనీ ప్రకటించడానికి వారిని పంపాలనీ
[15] వారికి రోగాలను పూర్తిగా నయం చేసేందుకూ దయ్యాలను వెళ్ళగొట్టేందుకూ అధికారం ఉండాలనీ ఆయన పన్నెండుమందిని నియమించాడు.
[16] వారెవరంటే, సీమోను (అతనికి పేతురు అనే పేరు పెట్టాడు),
[17] జెబెదయి కొడుకు యాకోబు, యాకోబు తోబుట్టువు యోహాను (వీరికి బోయనేర్గెస్ అనే పేరు పెట్టాడు. ఆ మాటకు “ఉరిమేవారు” అని అర్థం),
[18] అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
[19] యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా. తరువాత వారు ఒక ఇంటిలో ప్రవేశించారు.
[20] జనసమూహం మళ్ళీ గుమికూడడం చేత వారు భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది.
[21] దీన్ని గురించి విని ఆయన సొంతవారు “అతనికి మతి పోయింది” అని చెప్పి ఆయనను పట్టుకోవడానికి వచ్చారు.
[22] జెరుసలం నుంచి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు “ఇతడు బయల్‌జెబూల్ పట్టినవాడు. ఆ దయ్యాల నాయకుడి సహాయంతోనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తున్నాడు” అన్నారు.
[23] అందుచేత యేసు వారిని తనదగ్గరకు పిలిచి వారితో ఉదాహరణలలో ఇలా అన్నాడు: “సైతాను సైతానును వెళ్ళగొట్టడమెలాగు?
[24] ఏదైనా ఒక రాజ్యం తనను తానే వ్యతిరేకించి చీలిపోతే ఆ రాజ్యం నిలవడం అసాధ్యం.
[25] ఏదైనా ఒక ఇల్లు తనను తానే వ్యతిరేకించి చీలిపోతే ఆ ఇల్లు నిలవడం అసాధ్యం.
[26] అలాగే సైతాను తనమీద తానే విరోధంగా లేచి చీలిపోయాడూ అంటే వాడు నిలవలేక అంతమవుతాడు.
[27] మొదట బలవంతుణ్ణి కట్టివేయకపోతే ఎవరూ ఆ బలవంతుడి ఇంట్లో చొచ్చి వాడి సామాను దోచుకోలేరు. కట్టివేస్తేనే వాడి ఇంటిని దోచుకోగలరు.
[28] మీతో ఖచ్చితంగా అంటున్నాను, మనుషుల పాపాలన్నిటికీ వారు చెప్పే దూషణలన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది.
[29] కానీ దేవుని పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసే వ్యక్తికి క్షమాపణ అంటూ ఎన్నడూ దొరకదు. అలా చేసే వ్యక్తి శాశ్వత శిక్షావిధికి లోనయ్యేవాడు.”
[30] వారు తనకు మలిన పిశాచం పట్టిందని అన్నందుచేత ఆయన ఈ విధంగా చెప్పాడు.
[31] అప్పుడు ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు వచ్చి బయట నిలుచుండి ఆయనను రమ్మని కబురంపారు.
[32] జనం ఆయన చుట్టూ గుంపుగా కూర్చుని ఉన్నారు. వారు ఆయనతో “మీ తల్లి, మీ తమ్ముళ్ళు బయట ఉండి మీకోసం వెతుకుతూ ఉన్నారు” అన్నారు.
[33] ఆయన వారితో “ఎవరు నా తల్లి? ఎవరు నా తమ్ముళ్ళు?” అని జవాబిచ్చాడు.
[34] తన చుట్టూ కూర్చుని ఉన్నవారిని కలయ చూస్తూ ఆయన ఇంకా అన్నాడు “ఇరుగో నా తల్లి! నా తమ్ముళ్ళు!
[35] ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం ప్రవర్తించేవారే నా తమ్ముడు, నా చెల్లెలు, నా తల్లి.”