Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:00

[1] మరోసారి ఆయన సరస్సు ఒడ్డున ఉపదేశించడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గర చాలా పెద్ద జన సమూహం సమకూడడంవల్ల ఆయన సరస్సులో పడవ ఎక్కి కూర్చున్నాడు. జన సమూహమంతా సరస్సుదగ్గర నేలమీద ఉన్నారు.

[2] ఆయన ఉదాహరణలలో వారికి అనేక సంగతులు నేర్పుతూ తన ఉపదేశంలో వారితో ఇలా అన్నాడు:

[3] “ఇదిగో వినండి! విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.

[4] విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి.

[5] మరి కొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి నేల మీద పడ్డాయి. మన్ను లోతు లేకపోవడం వల్ల అవి త్వరలోనే మొలకెత్తాయి.

[6] గానీ ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి. వాటికి వేరులు లేవు గనుక వాడిపోయాయి.

[7] మరి కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచివేయడం వల్ల అవి పంటకు రాలేదు.

[8] మరి కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి వృద్ధి అవుతూ పంటకు వచ్చాయి. ముప్ఫయి రెట్లు, అరవై రెట్లు, నూరు రెట్లు పండాయి.”

[9] ఆయన ఇంకా అన్నాడు, “వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక!”

[10] ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులూ ఆయన చుట్టూ ఉన్నవారూ ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు.

[11] ఆయన వారితో ఇలా అన్నాడు: “దేవుని రాజ్యానికి చెందిన రహస్య సత్యం మీకివ్వబడింది. కానీ బయటివారికి ప్రతిదీ ఉదాహరణలలో చెప్పడం జరుగుతున్నది.

[12] కారణమేమంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి; వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేదా, ఒకవేళ వారు మళ్ళుకొని పాపక్షమాపణ పొందుతారేమో.”

[13] ఆయన వారితో ఇంకా అన్నాడు “ఈ ఉదాహరణ అర్థం మీకు తెలియదా? అలాగైతే ఉదాహరణలన్నీ మీరెలా అర్థం చేసుకొంటారు?

[14] విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.

[15] దారిప్రక్కన ఉన్నవారి సంగతి ఇలా ఉంది: అక్కడ వాక్కు చల్లబడుతూ ఉంటే వారు విన్నప్పుడు, వెంటనే సైతాను వచ్చి వారి హృదయాలలో చల్లిన వాక్కును తీసివేస్తాడు.

[16] అదే విధంగా రాతి నేల మీద చల్లిన విత్తనాలు ఎవరంటే వారు వాక్కు వినీ వినడంతోనే సంతోషంతో దానిని అంగీకరిస్తారు.

[17] కానీ వారిలో వేరులు లేకపోవడం వల్ల కొద్ది కాలమే నిలిచి ఉంటారు. అప్పుడు వాక్కు కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే వారు తొట్రుపడిపోతారు.

[18] ముండ్ల తుప్పలలో చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు వింటారు,

[19] గానీ ఇహలోక చింతలు, ధనం మూలమైన మోసం, ఇతరమైనవాటిని గురించిన కోరికలు లోపలికి ప్రవేశించి వాక్కును అణచి ఫలించకుండా చేస్తాయి.

[20] మంచి నేలమీద చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు విని దానిని అంగీకరించి ఫలిస్తారు. కొందరు ముప్ఫయి రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు నూరు రెట్లు ఫలిస్తారు.”

[21] ఆయన వారితో ఇంకా అన్నాడు, “దీపం తెచ్చి బుట్టక్రింద, లేక మంచంక్రింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతారు గదా.

[22] దాచి ఉంచిన ఏదీ తేటతెల్లం కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచిన ప్రతిదీ బట్టబయలు అయ్యేందుకే ఉంది.

[23] ఎవరికైనా వినడానికి చెవులుంటే వింటారు గాక!”

[24] ఆయన వారితో ఇంకా అన్నాడు “మీరేమి వింటారో శ్రద్ధ వహించండి. మీరు ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతోనే మీకు ఇవ్వబడుతుంది. చెవిని పెట్టే మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వబడుతుంది.

[25] కలిగిన వ్యక్తికి ఇంకా ఇవ్వడం, లేని వ్యక్తి నుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది.”

[26] ఆయన ఇలా అన్నాడు: “దేవుని రాజ్యం ఒకతను భూమిమీద విత్తనాలు చల్లినట్టుంది.

[27] రాత్రింబగళ్ళు అతడు నిద్రపోతూ మేల్కొంటూ ఉంటే, అతనికి తెలియని విధంగానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతాయి.

[28] ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొక్కను, తరువాత వెన్నును, ఆ తరువాత వెన్నులో ముదిరిన గింజలను పుట్టిస్తుంది.

[29] పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు వెంటనే కొడవలి పెట్టి కోస్తాడు.”

[30] ఆయన ఇంకా అన్నాడు “దేవుని రాజ్యం దేనితో సరిపోల్చాలి? ఏ ఉదాహరణతో దానిని వివరించాలి?

[31] అది ఆవగింజ లాంటిది. భూమిలో చల్లే విత్తనాలన్నిటిలో ఆవగింజ చిన్నది.

[32] అయినా దానిని చల్లిన తరువాత అది మొలిచి పెరిగి కూర మొక్కలన్నిటి కంటే పెద్దదవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూళ్ళు కట్టుకోగలిగేటంత పెద్ద కొమ్మలు అది వేస్తుంది.”

[33] వారు గ్రహించగలిగిన కొద్ది యేసు ఇలాంటి అనేక ఉదాహరణలతో వాక్కు వారికి ఉపదేశించాడు.

[34] ఉదాహరణ లేకుండా ఆయన వారికి ఉపదేశించలేదు. అయితే ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ వివరించి చెప్పాడు.

[35] ఆ రోజే సాయంకాలమైనప్పుడు ఆయన వారితో “అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.

[36] ఉన్నపాటున ఆయనతో కూడా వారు జనసమూహాన్ని విడిచిపెట్టి పడవలో బయలుదేరారు. ఆయన వెంట మరి కొన్ని పడవలు వచ్చాయి.

[37] అప్పుడు పెద్ద తుఫాను రేగింది. అలలు పడవలోకి కొట్టినందుచేత అది నీళ్ళతో నిండిపోతూ ఉంది.

[38] ఆయనైతే పడవ వెనుక భాగంలో దిండుమీద నిద్రపోతూ ఉన్నాడు. వారాయనను మేల్కొలిపి “బోధకుడా, నశించిపోతున్నాం! నీకేమీ పట్టదా?” అన్నారు.

[39] ఆయన లేచి గాలిని మందలించి సరస్సుతో “ఊరుకో! నిశ్శబ్దంగా ఉండు!” అన్నాడు. గాలి ఆగిపోయింది. అంతా పూర్తిగా ప్రశాంతమైపోయింది.

[40] అప్పుడాయన వారితో “మీకు ఇంత భయమెందుకని? మీకు నమ్మకం లేకపోవడమెందుకు?” అన్నాడు.

[41] వారు అధికంగా భయపడుతూ ఒకరితో ఒకరు “ఈయన ఎవరో! గాలి, సరస్సు సహా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.

మార్కు శుభవార్త — Chapters