[1] నేను క్రీస్తురాయబారిని కానా? నాకు స్వేచ్ఛ లేదా? మన ప్రభువైన యేసు క్రీస్తును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పని ఫలితం కాదా?
[2] ఒకవేళ ఇతరులకు నేను క్రీస్తురాయబారిని కాకపోయినా నిస్సందేహంగా మీ మట్టుకైనా రాయబారినే. ప్రభువులో రాయబారిననే సత్యానికి మీరే ముద్రలాంటివారు.
[3] మీ మధ్య నన్ను విమర్శించేవారికి నా ప్రత్యుత్తరమిదే.
[4] అన్నపానాలకు మాకు హక్కు లేదా?
[5] తక్కిన క్రీస్తురాయబారులు, ప్రభు సోదరులు, కేఫా కూడా, విశ్వాసంలో సోదరీలైన తమ భార్యలను వెంటబెట్టుకొని ప్రయాణిస్తారు. అలాంటి హక్కు మాకు లేదా?
[6] జీవనంకోసం పని చేయకుండా ఉండడానికి బర్నబా, నేను మాత్రమే హక్కు లేనివారమా?
[7] సొంత ఖర్చుపెట్టుకొని సైనికుడుగా యుద్ధానికి వెళ్ళే వాడెవడు? ద్రాక్షతోట వేసుకొని దాని పండ్లు తిననివాడెవడు? మందను కాస్తూ మంద పాలు త్రాగనివాడెవడు?
[8] మానవ రీతిగా ఇలా అంటున్నానా? కాదు. ధర్మశాస్త్రం కూడా ఇలా చెపుతుంది గదా!
[9] “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. అయితే దేవుడు పట్టించుకొనేది ఎద్దుల విషయమేనా?
[10] లేకపోతే, ఇలా చెప్పినది మనకోసమేనా? మన కోసమే రాసి ఉంది. కారణం ఏమిటంటే, దున్నేవాడు ఆశాభావంతో దున్నాలి. కళ్ళం ఆశాభావంతో నూర్పించేవాడు కూడా తాను ఆశాభావంతో పని చేసిన దానిలో పాల్గొనాలి.
[11] మేము మీలో ఆధ్యాత్మిక విత్తనాలు చల్లినవారమైతే మీనుంచి శరీరంకోసమైన వాటిని కోయడం గొప్ప విషయమా?
[12] ఇతరులు మీమీద ఇలాంటి హక్కులో పాల్గొంటూ ఉంటే మాకు ఈ హక్కు మరీ ఎక్కువగా ఉంటుంది గదా. అయినా మేమీ హక్కు వినియోగించుకోలేదు. క్రీస్తు శుభవార్తకు ఆటంకమేమీ కలిగించకూడదని అన్నిటినీ ఓర్చుకొంటున్నాం.
[13] పవిత్రమైన వాటి విషయంలో సేవ చేసేవారు దేవాలయానికి చెందిన భోజనపదార్థాలు తింటారనీ, బలిపీఠందగ్గర పని చేసేవారికి బలిపీఠం అర్పణలలో భాగం ఉంటుందనీ మీకు తెలియదా?
[14] అలాగే శుభవార్త ప్రకటించేవారికి శుభవార్తవల్లే జీవనోపాధి కలగాలని ప్రభువు విధించాడు.
[15] నేనైతే ఈ హక్కులలో ఏవి ఉపయోగించుకోలేదు. నాపట్ల ఆ ప్రకారం జరగాలని నేనిది రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవడైనా నిరర్థకంగా చేయడంకంటే నాకు చావే మేలు.
[16] నేను శుభవార్త ప్రకటిస్తున్నానంటే ఇందులో అతిశయ కారణం ఏమీ లేదు. ఎందుకంటే ప్రకటించే అవసరత నా మీద ఉంచబడి ఉంది. ఒకవేళ నేను శుభవార్త ప్రకటించకపోతే, అయ్యో, నాకెంత నష్టం!
[17] ఇష్టపూర్వకంగా ఈ పని చేస్తే నాకు బహుమతి. ఇష్టపూర్వకంగా చేయక పోయినా నాకు కార్యనిర్వాహకత్వం అప్పగించబడింది.
[18] అలాగైతే నా బహుమతి ఏది? నేను శుభవార్త ప్రకటించే టప్పుడు తద్వారా జీవనం చేసే నా హక్కు అధికంగా వినియోగించుకోకుండా క్రీస్తు శుభవార్త ఉచితంగా అందిచడమే నా బహుమతి.
[19] అందరి విషయంలో నాకు స్వేచ్ఛ ఉంది. అయినా ప్రభువుకోసం ఎక్కువమందిని సంపాదించాలని అందరికీ బానిసనయ్యాను.
[20] యూదులను సంపాదించడానికి యూదులకు యూదుడి లాంటివాణ్ణయ్యాను. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని సంపాదించడానికి ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడి లాంటివాణ్ణయ్యాను.
[21] దేవుని పట్ల ధర్మశాస్త్రం లేనివాణ్ణి కాను గాని క్రీస్తు న్యాయశాస్త్రం క్రింద ఉన్నవాణ్ణి. అయినా ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి వారికి ధర్మశాస్త్రం లేనివాడి లాంటివాణ్ణయ్యాను.
[22] బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడి లాంటివాణ్ణయ్యాను. కొందరికి పాపవిముక్తి కలిగించడానికి అందరికీ అన్ని రకాలవాణ్ణయ్యాను.
[23] శుభవార్తలో వారితో పాలివాణ్ణి కావాలని నేనిలా చేస్తున్నది శుభవార్తకోసమే.
[24] పరుగు పందెంలో పరుగెత్తే వారంతా పరుగెత్తుతారు గానీ బహుమతి లభించేది ఒకరికే అని మీకు తెలియదా? అలాగే మీకూ బహుమతి లభించేలా పరుగెత్తండి.
[25] క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకొంటాడు. వారేమో పాడైపోయే ఆకుల కిరీటం కోసం అలా చేస్తారు. మనమైతే ఎన్నడూ పాడు కాని కిరీటంకోసం అలా చేస్తున్నాం.
[26] అందుచేత నేను పరుగెత్తుతున్నది నిశ్చయత లేకుండా కాదు. నేను ముష్టియుద్ధం చేస్తున్నది గాలిలో దెబ్బలు వేసినట్టు కాదు.
[27] ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే అయోగ్యుణ్ణి అనే తీర్పుకు గురి కాకుండా నా శరీరాన్ని నలగ్గొట్టి వశం చేసుకొంటున్నాను.