[1] కాబట్టి ప్రతి మనిషి మమ్ములను ఇలా భావించాలి: మేము క్రీస్తు సేవకులం, దేవుని రహస్య సత్యాల విషయంలో నిర్వాహకులం.
[2] ఆ మాటకు వస్తే ప్రతి నిర్వాహకుడు నమ్మకంగా ఉండవలసినదే.
[3] అయితే నేను మీ విమర్శకు గానీ మరే మానవ విమర్శకు గానీ గురి కావడం నాకు అల్పమైన సంగతే అనిపిస్తుంది. అసలు, నన్ను నేను విమర్శించుకోను.
[4] నాకు తెలిసినంత మట్టుకు నేను ఏ విషయంలోనూ దోషిని కాను. కానీ ఇందువల్లే నిర్దోషిగా లెక్కలోకి రాను, నన్ను తీర్పు తీర్చేవాడు ప్రభువే.
[5] ఆ కాలం రాకముందే ప్రభువు వచ్చేంతవరకు దేనికీ తీర్పు తీర్చకండి. ఆయన చీకటిలో దాగివున్నవాటిని వెలుగులోకి తీసుకువస్తాడు, మనుషుల అంతరంగాలలో ఉన్న ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన మెప్పు దేవునివల్ల కలుగుతుంది.
[6] సోదరులారా, మీ మేలుకోసం నన్నూ అపొల్లోనూ ఉదాహరణగా తీసుకొని ఈ విషయాలు వివరించాను. అంటే, మమ్ములనుబట్టి మీరు లేఖనాలలో రాసి ఉన్నదానికంటే మించి ఆలోచించకూడదని నేర్చుకోవాలనీ మీరొకరి పక్షం వహించి మరొకరికి వ్యతిరేకంగా విర్రవీగకూడదనీ అలా చేశాను.
[7] నిన్ను ఏకైక వాణ్ణిగా చేసినదెవరు? నీవు దేవుని నుంచి పొందినది తప్ప నీకు మరేం కలిగి ఉంది? అది పొందినదే గనుక అయితే పొందినది కానట్టే గొప్పలు చెప్పుకొంటున్నావేం?
[8] మీరిప్పటికే పూర్తిగా తృప్తిపడ్డారట గదూ! అప్పుడే ధనవంతులయ్యారట! మేము లేకుండానే రాజులుగా ఏలారట! మీతో కూడా మేము రాజ్యమేలేలా మీరు నిజంగా రాజులు కావాలని నా అభిలాష.
[9] ఎందుకంటే, దేవుడు క్రీస్తురాయబారులమైన మమ్ములను అందరికంటే చివరి వరుసలో, మరణ శిక్షకు గురైన వారుగా ప్రదర్శిస్తున్నాడని నాకనిపిస్తుంది. మేము ప్రపంచానికి – మనుషులకూ దేవదూతలకూ – వింత ప్రదర్శనగా తయారయ్యాం.
[10] మేము క్రీస్తుకోసం మందబుద్ధులం. మీరైతే క్రీస్తులో బుద్ధిమంతులటగా! మేమేమో బలహీనులం. మీరు బలవంతులట! మీరేమో ఘనతకెక్కినవారు! మేము అవమానం పాలైనవారం.
[11] ఈ గడియ వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాం. సరిపోని దుస్తులు తొడుక్కొంటున్నాం. పిడిగుద్దులు తింటున్నాం. నిలువ నీడ లేకుండా ఉన్నాం.
[12] సొంత చేతులతో కష్టపడి పని చేస్తున్నాం. నిందల పాలయినప్పుడు దీవిస్తాం. హింసలకు గురి అయితే ఓర్చుకొంటాం.
[13] అపనిందలు వచ్చినప్పుడు వేడుకొంటాం. ఇప్పటివరకూ మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తాచెదారంలాగా, అన్నిట్లో నీచమైనదానిలాగా ఉన్నాం.
[14] నేనీ విషయాలు రాసే కారణం మీకు సిగ్గు కలిగిద్దామని కాదు గాని నా ప్రియమైన పిల్లలని హెచ్చరికలు రాస్తున్నాను.
[15] క్రీస్తులో మీకు క్రమశిక్షణ ఇచ్చేవారు పదివేలమంది ఉన్నా, మీకు తండ్రులు అనేకులు లేరు. ఎందుకంటే, క్రీస్తు యేసులో శుభవార్త ద్వారా మీకు తండ్రి అయినది నేనే.
[16] కాబట్టి నాలాగే ప్రవర్తించండని మిమ్ములను వేడుకొంటున్నాను.
[17] ఇందుకోసమే తిమోతిని మీ దగ్గరకు పంపాను. అతడు ప్రభువులో నాకు నమ్మదగిన ప్రియమైన కొడుకు. అతడు క్రీస్తులో నా జీవితవిధానాలు ఎలాంటివో మీకు జ్ఞాపకం చేస్తాడు. అంతటా అన్ని సంఘాలకు నేను ఉపదేశించేది ఈ విధానాలే.
[18] నేను మీ దగ్గరకు రాకుండా ఉన్నట్టు కొందరు విర్రవీగుతూ ఉన్నారు.
[19] అయితే ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వచ్చి విర్రవీగుతూ ఉన్నవారి మాటలు కాదు – వారి బలప్రభావాలు ఎలాంటివో తెలుసుకొంటాను.
[20] దేవుని రాజ్యమంటే మాటలు కాదు, బలప్రభావాలతో కూడినది.
[21] నేను మీ దగ్గరకు బెత్తంతో రావాలా? ప్రేమభావంతో, మృదువైన మనసుతో రావాలా? ఏది మీ కోరిక?