Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:51

[1] అయినా, సోదరులారా, నేను ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడే విధంగా మీతో మాట్లాడలేక పోయాను. శరీర స్వభావులతోనే క్రీస్తులో ఉన్న చంటి బిడ్డలతోనే మాట్లాడే విధంగా మీతో మాట్లాడ వలసి వచ్చింది.

[2] నేను మీకిచ్చినది పాలే గాని అన్నం కాదు. ఇంతవరకు అన్నం తినడం మీ చేతకాదు. ఇప్పుడు కూడా మీ చేత కాదు.

[3] ఎందుకంటే మీరు శరీర స్వభావుల్లాంటివారు. మీ మధ్య అసూయ, జగడాలు, విభాగాలు ఉన్నాయి అంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించే మామూలు మనుషులైనట్టున్నారు గదా.

[4] ఒకరేమో “నేను పౌలు పక్షంవాణ్ణి” అని, మరొకరు “నేను అపొల్లో మనిషిని” అని అంటూ ఉంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించేవారు కారా?

[5] పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? పరిచారకులే గదా. వీరిద్దరికీ ప్రభువు అవకాశాలు ఇచ్చినప్పుడు వీరిద్వారా మీరు నమ్మారు.

[6] నేను నాటాను, అపొల్లో నీళ్ళు పెట్టాడు, అంతేగాని పెరిగేలా చేసినది దేవుడే.

[7] అలాగైతే నాటేవాడిలో గానీ నీళ్ళు పెట్టేవాడిలో గానీ ఏమీ లేదు. పెరిగేలా చేసిన దేవునిలోనే అంతా ఉంది.

[8] నాటేవాడు నీళ్ళు పెట్టేవాడు ఒకటిగా ఉన్నారు. ఒక్కొక్కరికి తన కృషికొలది ప్రతిఫలం దొరుకుతుంది.

[9] మేము దేవునితో కలిసి పని చేసేవారం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.

[10] దేవుడు నాకు ప్రసాదించిన కృపప్రకారం నేను నేర్పుగల నిర్మాతనై పునాది వేశాను. మరొకడు దానిమీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కట్టే ప్రతి ఒక్కరూ తాను ఎలా నిర్మిస్తున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి.

[11] వేసిన ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది గాక వేరేది ఎవ్వరూ వేయలేరు.

[12] ఎవరైనా ఈ పునాదిమీద బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, గడ్డి, కసవు – ఇలాంటివాటితో నిర్మిస్తే,

[13] ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఆ రోజు దాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అది మంటలచేత వెల్లడి అవుతుంది. ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో ఆ మంటలు పరీక్షిస్తాయి.

[14] ఎవరైనా పునాదిమీద కట్టినది నిలిస్తే, అతనికి ప్రతిఫలం లభిస్తుంది.

[15] తాను కట్టినది కాలిపోతే ఆ వ్యక్తి నష్టం అనుభవిస్తాడు. తన మట్టుకు తనకు విముక్తి ఉంటుంది గాని అది మంటలద్వారా వచ్చినట్టే ఉంటుంది.

[16] మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?

[17] దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఆ వ్యక్తిని పాడు చేస్తాడు. ఎందుకంటే, దేవుని ఆలయం పవిత్రమైనది. మీరే ఈ ఆలయం.

[18] ఎవరూ తనను తాను మోసగించుకోకూడదు. మీలో ఎవరైనా ఈ లోకంలో తనను జ్ఞానిని అనుకొంటే జ్ఞానం సంపాదించుకోవడానికి తెలివితక్కువ వ్యక్తిగా అయిపోవాలి.

[19] ఎందుకంటే, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో తెలివితక్కువ తనమే. “ఆయన జ్ఞానులను తమ సొంత యుక్తి మూలంగానే పట్టుకొంటాడు” అని రాసి ఉన్నది గదా.

[20] జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలుసునని కూడా రాసి ఉన్నది.

[21] ఇలా ఉండగా ఎవరూ మనుషులను బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే అంతా మీది.

[22] పౌలు గానీ, అపొల్లో గానీ, కేఫా గానీ, లోకం గానీ, బ్రతుకు గానీ, చావు గానీ, ఇప్పుడున్నవి గానీ, తరువాత వచ్చేవి గానీ – అంతా మీవే!

[23] మీరు క్రీస్తుకు చెందేవారు, క్రీస్తు దేవునికి చెందేవాడు.

1 కొరింతువారికి లేఖ — Chapters