Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:58

[1] సోదరులారా, దేవుడిచ్చే ఆధ్యాత్మిక సామర్థ్యాలను గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు.

[2] పూర్వం మీరు ఇతర జనాలై ఎలాగైనా ఉన్నప్పుడు మూగ విగ్రహాల దగ్గరకు నడిపించబడి కొట్టుకుపోతూ ఉండేవారని మీకు తెలుసు.

[3] అందుచేత నేను మీకు తెలియజేసేదేమిటంటే, దేవుని ఆత్మవల్ల మాట్లడేవారెవరూ “యేసు శాపగ్రస్థుడు” అనరు. అంతేకాదు. పవిత్రాత్మవల్ల తప్ప ఎవరూ “యేసే ప్రభువు” అనలేరు.

[4] దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన ఇచ్చే కృపావరాలు నానా విధాలు.

[5] ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు నానా విధాలు.

[6] అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే గాని కార్యకలాపాలు నానా విధాలు.

[7] దేవుని ఆత్మ ప్రభావ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరుగుతుంది. అది అందరి మేలుకోసమే.

[8] ఆత్మవల్ల ఒకరికి జ్ఞానవాక్కు ఇవ్వబడుతుంది. ఆ ఒకే ఆత్మ ద్వారా మరొకరికి తెలివైన మాట ఉంటుంది.

[9] ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి.

[10] మరొకరికి అద్భుతాలు చేసే సామర్థ్యం, మరొకరికి ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం, మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం, మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం, మరొకరికి భాషల అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది.

[11] ఆ ఒకే ఆత్మ తానే ఇవన్నీ జరిగిస్తూ తనకు ఇష్టమున్నట్టే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు.

[12] శరీరం ఒకటే అయినా దానికి అనేక అవయవాలు ఉన్నాయి. ఆ ఒకే శరీరానికి అనేక అవయవాలున్నా అనేకమైనా అన్నీ ఒకే శరీరం. క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు.

[13] ఎలాగంటే, మనం యూదులమైనా గ్రీసు దేశస్థులమైనా సరే, బానిసలమైనా స్వతంత్రులమైనా సరే, మనమంతా ఒకే ఆత్మలో ఒకే శరీరంలోకి బాప్తిసం పొందాం. మనకందరికి ఒకే ఆత్మలో పానం చేయడానికి అనుగ్రహించబడింది.

[14] శరీరమంటే ఒకే అవయవం కాదు గాని అనేక అవయవాలు.

[15] ఒక వేళ పాదం “నేను చేయిని కాను గనుక శరీరంలో లేను” అంటే దాన్నిబట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా?

[16] చెవి “నేను కన్నును కాను గనుక శరీరంలో లేను” అంటే దాన్నిబట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా?

[17] శరీరమంతా కన్నే అయితే వినడం ఎలా? అంతా వినడమైతే వాసన చూడడం ఎలా?

[18] కానీ దేవుడు తన ఇష్టప్రకారమే అవయవాలలో ప్రతిదానినీ శరీరంలో ఉంచాడు.

[19] అవన్నీ ఒకటే అవయవమైతే శరీరం ఏమవుతుంది?

[20] ఇప్పుడైతే అవయవాలు అనేకం, శరీరం ఒక్కటే.

[21] ఇలాంటప్పుడు కన్ను చేయితో “నువ్వు నాకక్కరలేదు” అనలేదు. తల పాదాలతో “మీరు నాకక్కరలేదు” అనలేదు.

[22] అసలు, శరీరంలో తక్కువ బలమున్నట్లు అనిపించుకొనే అవయవాలే ఎక్కువ అవసరం.

[23] మనం ఏ అవయవాలకు తక్కువ ఘనత ఉందనుకొంటామో వాటినే ఎక్కువగా ఘనపరుస్తాం. ఏ అవయవాలకు అందం లేదో వాటికే ఎక్కువ అందం కలిగిస్తాం.

[24] అందం ఉన్న అవయవాలకు అలా కలిగించడం అక్కర్లేదు. శరీరంలో ఏమీ అనైక్యత ఉండకూడదనీ, అవయవాలన్నీ ఒకదానికోసం ఒకటి ఒకే విధంగా శ్రద్ధ వహించాలనీ

[25] దేవుడు తక్కువదానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని రూపొందించాడు.

[26] శరీర అవయవాల్లో ఒకటి బాధపడితే దానితోకూడా తక్కిన అవయవాలన్నీ బాధపడుతాయి. ఒకదానికి గౌరవం కలిగితే తక్కిన అవయవాలన్నీ సంతోషిస్తాయి.

[27] క్రీస్తు శరీరమంటే మీరు. మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఒక అవయవం.

[28] దేవుడు తన సంఘంలో నియమించినవారెవరంటే మొట్టమొదట క్రీస్తు రాయబారులు. రెండో గుంపువారు ప్రవక్తలు, మూడో గుంపువారు ఉపదేశకులు, తరువాత అద్భుతాలు చేసేవారు, తరువాత రోగులను బాగు చేసే కృపావరాలు గలవారు, ఉపకారాలు చేసేవారు, నాయకత్వం వహించగలవారు, నానా భాషలు మాట్లాడేవారు.

[29] అందరూ క్రీస్తురాయబారులు కారు గదా. అందరు ప్రవక్తలు కారు గదా. అందరూ ఉపదేశకులు కారు గదా. అందరూ అద్భుతాలు చేసేవారు కారు గదా.

[30] అందరూ రోగులను బాగు చేసే కృపా వరాలు గలవారు కారు గదా. అందరూ భాషలు మాట్లాడేవారు కారు గదా. అందరూ భాషల అర్థం చెప్పేవారు కారు గదా.

[31] ఆధ్యాత్మిక కృపావరాలలో అన్నిటికంటే మేలి రకమైనవాటిని ఆసక్తితో కోరండి. అయినా అన్నిటినీ మించిన దివ్య మార్గం మీకు వెల్లడి చేస్తాను.

1 కొరింతువారికి లేఖ — Chapters