[1] మీలో వ్యభిచారం ఉన్నట్టు మాకు వినవచ్చింది. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. ఇలాంటి వ్యభిచారం క్రైస్తవులు కాని ఇతర జనాలలో కూడా సూచించబడడం లేదు.
[2] మీరైతే విర్రవీగుతూ ఉన్నారు. దీనికి బదులు ఆ పని చేసినవాణ్ణి మీమధ్య నుంచి తొలగించడం జరిగేలా మీరు దుఃఖంతో మూలగలేదు.
[3] నా మట్టుకైతే నేను శరీరరీతిగా మీ దగ్గర లేకపోయినా, ఆత్మరీతిగా ఉన్నాను. వాస్తవంగా మీతో ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడికి ఇంతకు ముందే తీర్పు తీర్చాను.
[4] మన ప్రభువైన యేసు క్రీస్తు పేర మీరు సమకూడేటప్పుడు నేను ఆత్మరీత్యా మీతో కూడా ఉండి ప్రభువైన యేసు క్రీస్తు బలప్రభావాలతో
[5] అతని శరీరం నాశనమయ్యేలా అతణ్ణి సైతానుకు అప్పగించండి. ఈ విధంగా యేసుప్రభువు వచ్చే రోజున అతడి ఆత్మకు విముక్తి ఉండాలనే ఉద్దేశంతో అలా చేయండి.
[6] మీరు అతిశయించడం మంచిది కాదు. పొంగుపదార్థం కొంచెమైనా పిండి ముద్దంతటినీ పొంగజేస్తుందని మీకు తెలియదా?
[7] కాబట్టి మీరు క్రొత్త పిండి ముద్దలాగా కావడానికి ఆ పాత పొంగు పదార్థాన్ని తొలగించండి. అసలు మీరు పొంగు పదార్థమేమీ లేనివారే. ఎలాగంటే క్రీస్తు మనకోసం పస్కా బలి అయ్యాడు.
[8] అందుచేత మనం పాత పొంగజేసే పదార్థంతో కాక, చెడుతనం, దుర్మార్గం అనే పొంగజేసే పదార్థంతో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని దానితో ఈ మహోత్సవాన్ని ఆచరించుదాం.
[9] నా ఉత్తరంలో మీరు వ్యభిచారులతో కలిసి మెలిసి ఉండకూడదని రాశాను.
[10] అయితే ఈ లోకానికి చెందే వ్యభిచారులతో, పేరాశపరులతో, వంచకులతో, విగ్రహపూజ చేసేవారితో బొత్తిగా సాంగత్యం చేయకూడదని అర్థం కాదు. అలాగైతే మీరు లోకంలోనుంచి వెళ్ళిపోవలసి వస్తుంది!
[11] ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
[12] బయటివారి విషయం కూడా తీర్పు చెప్పడానికి నాకేం పని? బయటివారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
[13] లోపలి వారికైతే మీరు తీర్పరులు కారా మరి? అందుచేత మీ మధ్య ఉండకుండా ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి.