Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:50

[1] మీలో ఎవడికైనా మరొకడి మీద పరిష్కరించుకోవలసిన విషయం ఉంటే అతడు పవిత్రుల ఎదుటికి రాక, అన్యాయస్థుల ఎదుట వ్యాజ్యెమాడడానికి తెగిస్తాడా ఏమిటి?

[2] పవిత్రులు లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా? లోకం మీ తీర్పుకు గురి అవుతుంది అంటే అతి స్వల్ప విషయాలను పరిష్కరించదగనివారా మీరు?

[3] మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మీకు తెలియదా? అలాగైతే ఈ జీవిత విషయాలను గురించి తీర్పు తీర్చవచ్చుననేది మరీ నిశ్చయం.

[4] ఈ జీవితానికి చెందే విషయాలు తీర్పుకోసం రావలసి ఉంటే వాటిని క్రీస్తు సంఘంలో తక్కువ గౌరవం గలవారిచేత పరిష్కారం చేయించుకొంటారా?

[5] మీకు సిగ్గు రావాలని ఇలా అంటున్నాను. సోదరుల మధ్య వివాద పరిష్కారం చేయగల తెలివైనవాడొక్కడు కూడా మీలో లేడా?

[6] సోదరుడు సోదరుడి మీద వ్యాజ్యెమాడుతాడు! తీర్పుకోసం అవిశ్వాసుల దగ్గరకు వెళ్తారు!

[7] కాబట్టి, మీలో ఒకరిమీద ఒకరు వ్యాజ్యెమాడడంవల్ల ఇప్పటికే మీరు పూర్తిగా ఓడిపోయారన్న మాట. దానికి బదులు మీరెందుకు అన్యాయం ఓర్చుకోరు? ఎందుకు మీ వస్తువులు తినివేయడం జరగనియ్యరు?

[8] అది గాక మీరే అన్యాయం చేస్తున్నారు, ఇతరుల సొత్తు తినివేస్తున్నారు. మీరలా చేస్తున్నది సోదరులకే!

[9] న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ

[10] దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు.

[11] గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.

[12] అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. గాని అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. అయితే నన్ను ఏదీ వశపరచుకోనివ్వను.

[13] ఆహారాలు కడుపు కోసం ఉన్నాయి, కడుపు ఆహారాలకోసం ఉంది. అయినా దేవుడు దానినీ వాటిని కూడా నాశనం చేస్తాడు. శరీరం లైంగిక అవినీతికోసం కాదు గాని ప్రభువుకోసమే. ప్రభువు శరీరం కోసం.

[14] దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు, తన బలప్రభావాలతో మనలను కూడా సజీవంగా లేపుతాడు.

[15] మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తుకు చెందిన అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా కానే కాదు.

[16] వేశ్యతో కలిసినవాడు ఆమెతో ఒకటే శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరమవుతార”ని దేవుడు అన్నాడు గదా.

[17] ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకటే ఆత్మ అయి ఉన్నాడు.

[18] లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి. మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతీది శరీరానికి బయటే ఉంది. లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు.

[19] మీ శరీరం పవిత్రాత్మకు ఆలయం. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. ఇదంతా మీకు తెలియదా?

[20] వెల పెట్టి మిమ్ములను కొనడం జరిగింది గనుక దేవునివై ఉన్న మీ శరీరంతో మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండండి.

1 కొరింతువారికి లేఖ — Chapters