Skip to content
Opens in a new window
Listen to this chapter • 9:07

[1] సోదరులారా, నేను మీకు ప్రకటించిన శుభవార్త ఇప్పుడు మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు అంగీకరించినది ఇదే. ఇందులోనే మీరు నిలిచి ఉన్నారు.

[2] మీరు వట్టిగా నమ్మనివారైతే, నేను మీకు ప్రకటించిన ఉపదేశం గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే దీనివల్లే మీకు పాపవిముక్తి ఉంది కూడా.

[3] నేను అంగీకరించిన దాన్ని ఆరంభంలో మీకు అందించాను. ఏమంటే లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాలకోసం చనిపోయాడు.

[4] లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడమూ, మూడో రోజున ఆయన సజీవంగా లేవడమూ జరిగింది.

[5] అప్పుడాయన కేఫాకు కనబడ్డాడు, తరువాత “పన్నెండుగురి”కి కనిపించాడు.

[6] ఆ తరువాత అయిదు వందలమందికి మించిన సోదరులకు ఒకే సమయంలో కనిపించాడు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ బతికే ఉన్నారు గాని కొందరు కన్ను మూశారు.

[7] ఆ తరువాత ఆయన యాకోబుకు కనిపించాడు. ఆ తరువాత తన రాయబారులందరికీ కనిపించాడు.

[8] చివరగా నాకు – అకాలంగా జన్మించిన వాడిలాంటి నాకు కూడా కనిపించాడు.

[9] క్రీస్తు రాయబారులందరిలో నేను తక్కువవాణ్ణి, క్రీస్తురాయబారి అనే బిరుదుకు తగనివాణ్ణి. ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించాను.

[10] అయితే ఇప్పుడు నేనేమై ఉన్నానో అదై ఉన్నది దేవుని అనుగ్రహంవల్లే. నాపట్ల ఆయన అనుగ్రహం వ్యర్థం కాలేదు. ఎలాగంటే, వారందరికంటే నేనెక్కువగా కష్టించి పని చేశాను – నేను కాదు గాని నాకు తోడైవున్న దేవుని అనుగ్రహమే.

[11] అయితే నేను గానీ వారు గానీ మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.

[12] క్రీస్తును చనిపోయినవారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే, చనిపోయినవారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెపుతున్నారేమిటి?

[13] చనిపోయినవారు లేవడం అనేది లేదూ అంటే, క్రీస్తు కూడా లేవలేదన్న మాటే.

[14] క్రీస్తు లేవకపోతే మా ఉపదేశం వ్యర్థం, మీ నమ్మకం కూడా వ్యర్థం.

[15] అంతేకాదు, మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం. ఎందుకంటే చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేపలేదన్నమాటే, గాని ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్పాం గదా.

[16] చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు.

[17] క్రీస్తు లేవకపోతే మీ నమ్మకం వట్టిదే! మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు.

[18] అంతేకాదు, క్రీస్తులో ఉండి కన్ను మూసినవారు నశించిపోయారు కూడా.

[19] క్రీస్తులో మనకు ఆశాభావం ఈ బ్రతుకు మట్టుకే గనుక ఉంటే మనం మనుషులందరిలోకి జాలిగొలిపేవాళ్ళం.

[20] అయితే క్రీస్తు చనిపోయినవారిలో నుంచి లేచాడు. కన్ను మూసినవారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు.

[21] ఒక మనిషి ద్వారా మరణం కలిగింది గనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషిద్వారా కలిగింది.

[22] ఆదాములో అందరూ చనిపోతారు. అలాగే క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది.

[23] అయితే ప్రతి ఒక్కరికీ తన వరుస ప్రకారమే అలా జరిగేది – మొదట ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుకు, తరువాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రజలకు.

[24] ఆ తరువాత, ఆయన సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, శక్తినీ రద్దుచేసి రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించిన తరువాత, అంతం వస్తుంది.

[25] ఎందుకంటే విరోధులందరినీ తన పాదాలక్రింద పెట్టుకొనేవరకూ క్రీస్తు రాజ్యం చేయాలి.

[26] చివరగా నాశనం కాబోయే విరోధి మరణం.

[27] దేవుడు ఆయన పాదాలక్రింద సమస్తమూ ఉంచాడు. అయితే ఆయన క్రింద సమస్తమూ ఉంచాడని ఆయన చెప్పిన మాటలో ఆయన క్రింద సమస్తమూ ఉంచినవాడు ఉండడని తేటతెల్లమే.

[28] సమస్తమూ కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తంలోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తమూ ఉంచిన ఆయనకు వశమవుతాడు.

[29] ఒకవేళ అలా కాకపోతే చనిపోయినవారికోసం బాప్తిసం పొందినవారు చేసేదేమిటి? చనిపోయినవారు ఎంత మాత్రం లేవరూ అంటే వారికోసం బాప్తిసం పొందడమెందుకని?

[30] అంతేకాదు. మేము ఘడియ ఘడియకూ ప్రాణాపాయంలో ఎందుకుండాలి?

[31] మన ప్రభువైన క్రీస్తు యేసులో మీగురించి నాకున్న అతిశయాన్నిబట్టి నొక్కి చెపుతున్నాను – నేను ప్రతి రోజూ చావుకు గురి అవుతున్నాను.

[32] నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడినది మానవ ఉద్దేశంతోనే గనుక అయితే నాకు లాభమేమిటి? చనిపోయిన వారు లేవకుండా ఉంటే “రేపు చచ్చిపోతాం గనుక తిందాం, తాగుతాం”.

[33] మోసపోకండి – “చెడు సహవాసం మంచి అలవాట్లను చెడగొడతుంది”.

[34] దేవుని విషయమైన తెలివి కొందరికి లేదు – మీకు సిగ్గు కలిగించాలని ఈ మాట చెపుతున్నాను – గనుక నీతిన్యాయాలను గురించి బుద్ధి తెచ్చుకొని పాపం చేయకండి.

[35] అయితే ఎవడైనా ఒకడు ఇలా అనవచ్చు: “చనిపోయినవారిని లేపడమెలాగు? వారికెలాంటి దేహం ఉంటుంది?”

[36] తెలివితక్కువవాడా, మీరు చల్లే విత్తనం చావకపోతే దానిలో నుంచి జీవం ఉట్టిపడదు గదా.

[37] అంతేకాదు, మీరు విత్తేది – అది గోధుమ గింజ కానివ్వండి, మరే గింజయినా కానివ్వండి – గింజే గాని కలగబోయే ఆకారం మీరు విత్తరు.

[38] దేవుడు ఆ గింజలోనుంచి ఏ ఆకారం కలగాలని ఇష్టపడ్డాడో అదే కలిగిస్తున్నాడు, విత్తనాలలో ప్రతి దానికి దాని సొంత ఆకారం కలిగిస్తాడు.

[39] అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం ఒక రకం, మృగ మాంసం వేరే రకం, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు.

[40] అలాగే ఆకాశంలో ఆకారాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి. అయితే ఆకాశంలో ఉన్నవాటి వైభవం ఒక తీరు. భూమిమీద ఉన్నవాటి వైభవం మరో తీరు.

[41] సూర్యమండలం వైభవం ఒక తీరు, చంద్రబింబం వైభవం మరో తీరు, నక్షత్రాల వైభవం ఇంకో తీరు. వైభవం విషయంలో నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదం ఉంది.

[42] చనిపోయినవారు సజీవంగా లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించే శరీరాన్ని విత్తడం, నశించని శరీరాన్ని లేపడం జరుగుతుంది.

[43] దానిని గౌరవం లేని స్థితిలో విత్తడం, దివ్య స్థితిలో లేపడం జరుగుతుంది. దానిని దౌర్బల్య స్థితిలో విత్తడం, బలమైన స్థితిలో లేపడం జరుగుతుంది.

[44] ఈ ప్రకృతిసిద్ధమైన శరీరంగా దానిని విత్తడం, ఆధ్యాత్మికమైన శరీరంగా లేపడం జరుగుతుంది. ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంది.

[45] ఈ సందర్భంలో, మొదటి మనిషి ఆదాము సజీవుడయ్యాడని రాసి ఉంది. అయితే చివరి ఆదాము బ్రతికించే ఆత్మ.

[46] మొదట కలిగింది ఆధ్యాత్మికమైనది కాదు గాని ప్రకృతి సిద్ధమైనదీ. తరువాత ఆధ్యాత్మికమైనది కలిగేది.

[47] మొదటి మానవుడు భూసంబంధి, మట్టినుంచి రూపొందినవాడు. రెండో మానవుడు పరలోకంనుంచి వచ్చిన ప్రభువు.

[48] మట్టివారు ఆ మట్టివానిలాంటివారు, పరలోక సంబంధులు ఆ పరలోక సంబంధిలాంటివారు.

[49] మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకొంటాం.

[50] సోదరులారా, నేను చెప్పేదేమిటంటే, రక్తమాంసాలకు దేవుని రాజ్యంలో వారసత్వం ఉండదు. నశించేదానికి నశించనిదానిలో వారసత్వముండదు.

[51] ఇదిగో వినండి, ఒక రహస్య సత్యం మీకు తెలియజేస్తున్నాను – మనమంతా కన్ను మూయము గాని మనమంతా మార్పు చెందుతాం.

[52] ఇది ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటునే, చివరి బూర సమయంలోనే జరుగుతుంది. ఆ బూర మ్రోగుతుంది, చనిపోయినవారిని నశించనివారుగా లేపడం జరుగుతుంది, మనకు మార్పు కలుగుతుంది.

[53] ఈ నశించేది నశించనిదానిని ధరించు కోవాలి, ఈ మరణించేది మరణించని దానిని ధరించుకోవాలి.

[54] ఈ నశించేది నశించనిదాన్ని ధరించుకొని ఈ మరణించేది మరణించనిదాన్ని ధరించు కొన్నప్పుడు, రాసి ఉన్న ఈ మాట నెరవేరుతుంది: విజయం మృత్యువును మ్రింగివేసింది.

[55] “ఓ మరణమా, నీ విషపుకొండి ఎక్కడ? మృత్యులోకమా, నీ విజయమెక్కడ?”

[56] మరణం కొండి అపరాధమే. అపరాధానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

[57] కాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు! ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనకు విజయం ఇస్తున్నాడు!

[58] అందుచేత, నా ప్రియ సోదరులారా, సుస్థిరంగా నిశ్చలంగా ఉండండి. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండండి.

1 కొరింతువారికి లేఖ — Chapters