Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:34

[1] సోదరులారా, ఈ వాస్తవాలు మీకు తెలియకుండా ఉండకూడదని నా కోరిక: మన పూర్వీకులంతా మేఘం క్రింద ఉన్నారు, అందరూ సముద్రం గుండా వెళ్ళారు.

[2] అందరూ మేఘంలోనూ సముద్రంలోనూ మోషే సంబంధంలోకి బాప్తిసం పొందారు.

[3] అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారం తినేవారు.

[4] అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానీయం త్రాగేవారు. ఎలాగంటే, తమవెంట వస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన బండలోనుంచి వచ్చిన నీళ్ళు త్రాగేవారు. ఆ బండ క్రీస్తే.

[5] అయినా వారిలో ఎక్కువమందివల్ల దేవునికి సంతోషం కలగలేదు గనుక వారి దేహాలు ఎడారిలో చెల్లాచెదురయ్యాయి.

[6] వారు చెడ్డవాటిని కోరారు కూడా. మనం అలా చెడ్డవాటిని కోరకూడదని జరిగిన ఆ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి.

[7] మీరు వారిలో కొందరిలాగా విగ్రహపూజకులు కాకండి. వారి విషయం ఇలా రాసి ఉంది: “ప్రజలు తింటూ త్రాగుతూ ఉండడానికి కూర్చున్నారు, లేచి ఆడారు.”

[8] వారిలో కొందరు వ్యభిచారం చేశారు. మనం అలా చేయకూడదు. ఆ కారణం చేత వారిలో ఇరవై మూడు వేలమంది ఒకే రోజున హతమై కూలారు.

[9] వారిలో కొందరు క్రీస్తును పరీక్షించారు కూడా. మనం అలా చేయకూడదు. అలా చేసినవారు పాముల కాటుచేత నాశనమయ్యారు.

[10] వారిలో కొందరు సణిగారు. మనం సణగకూడదు. సణిగినవారు సంహారకునిచేత నాశనమయ్యారు.

[11] ఈ విషయాలన్నీ ఉదాహరణలుగా వారికి సంభవించాయి. ఇవి యుగాల నెరవేర్పులలో ఉన్న మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి.

[12] కనుక నిలుచున్నాననుకొనే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

[13] మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.

[14] అందుచేత, నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజనుంచి పారిపోండి!

[15] మీరు తెలివైనవారై ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి.

[16] మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా?

[17] మనం అనేకులమైనా ఒకటే రొట్టె, ఒకటే శరీరం ఎందుకంటే మనమంతా ఆ ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం.

[18] శరీర సంబంధంగా ఇస్రాయేల్‌జనాన్ని చూడండి. బలుల మాంసం తినేవారు బలిపీఠంతో భాగస్థులు గదా.

[19] నా భావమేమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైనదానిలో గానీ ఏమైనా ఉందని చెపుతున్నానా?

[20] లేదు, గాని ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకిష్టం లేదు.

[21] మీరు ప్రభు పాత్రలోది, పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్లమీద ఉన్నవాటిలో, పిశాచాల బల్లమీద ఉన్నవాటిలో కూడా వంతు తీసుకోలేరు.

[22] ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయనకంటే మనం బలవంతులమా?

[23] అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది అయితే అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గానీ ప్రతీదీ అభివృద్ధి కలిగించదు.

[24] స్వప్రయోజనం ఎవరూ చూచుకోకూడదు గాని ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం చూడాలి.

[25] అంగడిలో అమ్మే ఏ మాంసం అయినా తినవచ్చు. దాని గురించి అంతర్వాణి కారణంగా ప్రశ్నలేవీ అడగకండి.

[26] ఎందుకంటే, “భూమి, దానిమీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే.”

[27] ప్రభువును నమ్మనివారిలో ఎవరైనా మిమ్ములను భోజనానికి పిలుస్తారనుకోండి. వెళ్ళడానికి మీకిష్టం ఉంటే వెళ్ళి మీకు వడ్డించినది ఏదైనా, దాని గురించి అంతర్వాణినిబట్టి ఏ ప్రశ్నా అడగకుండా, తినండి.

[28] అయితే ఒకవేళ “ఇది విగ్రహాలకు అర్పించినది” అంటూ ఎవడైనా మీతో చెపితే అలా తెలియజేసిన వానికోసం, అంతర్వాణికోసం దాన్ని తినకండి. ఎందుకంటే “భూమి, దాని మీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే.”

[29] “అంతర్వాణి” – మీది కాదు గాని ఎదుటి వ్యక్తి అంతర్వాణి గురించి అంటున్నాను. నా స్వేచ్ఛను వేరొకరి అంతర్వాణి ఎందుకు విమర్శించాలి?

[30] నేను దానిని కృతజ్ఞతతో పుచ్చుకొంటే దేనికోసం దేవునికి కృతజ్ఞత చెపుతానో దానివల్ల నేను నిందపాలు కావడం ఎందుకు?

[31] అందుచేత మీరు తిన్నా, త్రాగినా, ఏమి చేసినా దేవునికి మహిమ కలిగించడానికే అన్నీ చేయండి.

[32] యూదులకు గానీ గ్రీసు దేశస్థులకు గానీ దేవుని సంఘానికీ గానీ అభ్యంతరమేమీ కలిగించకండి.

[33] ఇలాగే నేను కూడా స్వప్రయోజనం చూచుకోకుండా, అనేకులు పాపవిముక్తి పొందాలని వారికి ప్రయోజనం కలిగేలా అందరినీ అన్నిటిలో సంతోష పెడుతున్నాను.

1 కొరింతువారికి లేఖ — Chapters