[1] ఒకవేళ నేను మనుషుల భాషలలో, దేవదూతల భాషలలో మాట్లాడినా నాకు దైవిక ప్రేమ లేకపోతే గణగణమనే గంటలాగా, టింగుటింగుమనే తాళంలాంటి వాడినే.
[2] ఒకవేళ నాకు దేవునిమూలంగా పలికే వరం ఉన్నా, అన్ని రహస్య సత్యాలూ జ్ఞానమంతా తెలిసినా, కొండలను తొలగించి వేసే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, దైవిక ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే.
[3] నా ఆస్తిపాస్తులన్నీ ఖర్చు చేసి బీదల పోషణకోసం ధార పోసినా, నా శరీరాన్ని కాలిపోవడానికి అప్పగించినా, నాకు దైవిక ప్రేమ లేకపోతే ప్రయోజనమంటూ నాకేమీ ఉండదు.
[4] ఈ ప్రేమకు దీర్ఘశాంతం ఉంది. ఈ ప్రేమ దయ చూపుతుంది. ఈ ప్రేమకు అసూయ ఉండదు. ఈ ప్రేమ డంబాలు చెప్పుకోదు, గర్వంతో ఉప్పొంగదు.
[5] అది అయోగ్యంగా ప్రవర్తించదు, సొంత ప్రయోజనం చూచుకోదు. కోపానికి రేకెత్తించబడదు. అపకారాన్ని లెక్క చేయదు.
[6] ఈ ప్రేమ దుర్మార్గం విషయంలో సంతోషించదు గాని సత్యం విషయంలోనే సంతోషిస్తుంది.
[7] అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటిలో నమ్ముతుంది, అన్నిటిలో ఆశాభావంతో ఎదురు చూస్తుంది. అన్నిటినీ ఓర్చుకొంటుంది.
[8] దైవిక ప్రేమ ఎన్నడూ గతించదు. ప్రవక్తలు పలికేవి ఉన్నా అవి నిరర్థకమవుతాయి. భాషలు ఉన్నా అవి అంతరిస్తాయి. తెలివి ఉన్నా అదీ కాలగతి అవుతుంది.
[9] ఎందుకంటే, మనకు తెలిసినది కొంతమట్టుకే మనం ప్రవక్తగా పలకడం కొంత మట్టుకే.
[10] పరిపూర్ణమైనది వచ్చినప్పుడు కొంతమట్టుకే ఉండేవి అంతమవుతాయి.
[11] నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగే మాట్లాడాను. చిన్నవాడిలాగే తలచాను, చిన్నవాడిలాగే భావించాను. కాని పెద్దవాణ్ణయినప్పుడు చిన్నవారికి చెందేవాటిని మానివేశాను.
[12] అలాగే ప్రస్తుతం మనం అద్దంలో చూస్తున్నట్టు అస్పష్టంగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖా ముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసినది కొంతమట్టుకే. అప్పుడైతే దేవునికి నేను తెలిసినప్రకారమే నేను తెలుసుకొంటాను.
[13] ఇప్పుడు విశ్వాసం, ఆశాభావం, దైవిక ప్రేమ – ఈ మూడు నిలిచి ఉన్నాయి. అయితే వీటిలో ఉత్తమమైనది దైవిక ప్రేమే!