[1] సోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి దేవుని గురించిన సాక్ష్యం ప్రకటించినప్పుడు మాటకారితనం గానీ ఉన్నత జ్ఞానం గానీ వినియోగించుకోలేదు.
[2] ఎందుకంటే యేసు క్రీస్తు తప్ప – సిలువ పాలైన ఆయన తప్ప – మీ మధ్య మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని నిశ్చయించు కొన్నాను.
[3] మీ మధ్య దౌర్బల్యంతో, భయంతో, ఎంతో వణుకుతో ఉన్నాను.
[4] మీ విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాదు గాని దేవుని బలప్రభావాలే కావాలని నా ఉద్దేశం.
[5] కనుక నా సందేశం, ప్రబోధంలో ఒప్పించే మానవ జ్ఞాన వాక్కులతో కాక దేవుని ఆత్మ బలప్రభావాల ప్రదర్శనతో ఉండేది.
[6] అయినా ఆధ్యాత్మికంగా ఎదిగినవారి మధ్య జ్ఞానం వాడుకొని మాట్లాడుతాం. ఆ జ్ఞానం ఈ లోకానికి చెందినది కాదు, ఎందుకూ కొరగాకుండా పోయే ఈ లోక అధికారుల జ్ఞానమూ కాదు.
[7] మేము మాట్లాడేది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, మరుగై ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనతకోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం.
[8] ఈ జ్ఞానం లోకపాలకులలో ఎవరికీ తెలియదు. ఒక వేళ అది తెలిసి ఉంటే వారు మహిమా స్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు.
[9] రాసి ఉన్నదాని ప్రకారం, తనను ప్రేమించేవారికోసం దేవుడు సిద్ధం చేసినవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మానవ హృదయంలోకి రాలేదు.
[10] అయితే వాటిని దేవుడు తన ఆత్మద్వారా మనకు వెల్లడి చేశాడు. దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని లోతైన సంగతులను కూడా పరిశోధిస్తాడు.
[11] ఒక మనిషి విషయాలు ఆ మనిషిలో ఉన్న తన ఆత్మకు తప్ప మరే మనిషికి తెలుసు? అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు.
[12] దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవేవో తెలుసుకొనేలా మనం పొందినది లౌకికాత్మ కాదు గాని దేవునినుంచి వచ్చిన ఆత్మే.
[13] మేము ఆధ్యాత్మికమైన విషయాలను ఆధ్యాత్మికమైన వాటితో పోలుస్తూ మానవ జ్ఞానం నేర్పే మాటలలో కాక, దేవుని ఆత్మ నేర్పే మాటలలో వాటిని చెపుతాం.
[14] సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలు స్వీకరించడు. అవి అతనికి తెలివితక్కువతనంగా అనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగా మాత్రమే విలువకట్టాలి గనుక అతడు వాటిని గ్రహించలేడు.
[15] ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటిని సరిగా పరిశీలించి అంచనా కడతాడు, గాని అతణ్ణి ఎవరూ సరిగా పరిశీలించి అంచనా కట్టరు.
[16] ప్రభు మనసు తెలుసుకొని ఆయనకు ఉపదేశించ గలవాడెవడు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.