Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:50

[1] పవిత్రులకోసం చందా విషయమైతే, నేను గలతీయ ప్రాంతం సంఘాలను ఆదేశించినట్టు మీరూ చేయాలి.

[2] నేను వచ్చేటప్పుడు చందా ఎత్తకుండా మీలో ఒక్కొక్కరు తాను వర్ధిల్లినకొలది కొంత డబ్బు మిగిల్చి ప్రతి ఆదివారమూ కూడబెట్టాలి.

[3] నేను వచ్చినప్పుడు మీరు ఉత్తరాల ద్వారా ఎవరిని ఆమోదిస్తారో నేను వారిచేత మీ ఈవి జెరుసలంకు పంపుతాను.

[4] ఒకవేళ నేను కూడా అక్కడికి వెళ్ళడం యుక్తమైతే వారు నాతో కలిసి వెళ్తారు.

[5] కాని, నేను మాసిదోనియ ప్రాంతంగుండా ప్రయాణం చేస్తాను. మాసిదోనియగుండా ప్రయాణించి మీ దగ్గరికి వస్తాను.

[6] అప్పుడు ఒకవేళ మీతో కొంత కాలం ఉంటాను. లేదా, చలికాలమంతా గడపవచ్చు. తరువాత నేను ఎక్కడికైనా వెళ్ళితే నా ప్రయాణంలో మీరు నన్ను సాగనంపవచ్చు.

[7] ప్రభువు అనుమతి ఇస్తే మీతో కొంత కాలం ఉండాలని ఆశతో ఎదురు చూస్తున్నాను గనుక ఇప్పుడు ప్రయాణంలో మిమ్ములను సందర్శించడానికి నాకిష్టం లేదు.

[8] కాని, పెంతెకొస్తు పండుగ వరకు ఎఫెసులో ఉండిపోతాను.

[9] ఎందుకంటే, కార్యసాధకమైన గొప్ప ద్వారం నాకు తెరచి ఉంది. అయినా ఎదురాడేవారు చాలామంది.

[10] ఒకవేళ తిమోతి మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఉన్నప్పుడు అతడు నిర్భయంగా ఉండేలా చూచుకోండి. నాలాగే అతడు కూడా ప్రభు సేవ చేస్తున్నాడు.

[11] అందుచేత ఎవరూ అతణ్ణి చిన్న చూపు చూడకూడదు. నా దగ్గరకు వచ్చేలా అతణ్ణి శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో వస్తాడని ఎదురు చూస్తున్నాను.

[12] సోదరుడైన అపొల్లో విషయమేమిటంటే, అతణ్ణి ఆ సోదరులతో మీ దగ్గరకు వెళ్ళమని మరీమరీ వేడుకొన్నాను గాని ఇప్పుడు వెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.

[13] మెళుకువగా ఉండండి. విశ్వాస సత్యాలలో నిలకడగా ఉండండి. పౌరుషంగా ఉండండి. బలంగా ఉండండి.

[14] మీరు చేసేదంతా ప్రేమతో చేయండి.

[15] స్తెఫనస్ ఇంటివారు అకయ ప్రాంతంలో ప్రథమ ఫలమని, పవిత్రులకు పరిచర్య చేయడానికి తమను అప్పగించుకొన్నారనీ మీకు తెలుసు.

[16] సోదరులారా, అలాంటివారికీ, మనతో పనిలో తోడ్పడుతూ ప్రయాసపడుతూ ఉండేవారందరికీ అణిగిమణిగి ఉండాలని మిమ్ములను వేడుకొంటున్నాను.

[17] స్తెఫనస్, ఫొర్‌టునాటన్, అకైకస్ వచ్చినందుచేత సంతోషించాను. ఎందుకంటే మీరు లేని కొరత వీరు తీర్చారు.

[18] నా ప్రాణానికీ, మీ ప్రాణానికీ సేద తీర్చారు. అలాంటివారిని గుర్తించి గౌరవించండి.

[19] ఆసియా రాష్ట్రం లో ఉన్న క్రీస్తు సంఘాలు మీకు అభివందనాలు చెపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘం కూడా ప్రభువులో మనస్ఫూర్తిగా అభివందనాలు చెపుతున్నారు.

[20] సోదరులంతా మీకు అభివందనాలు చెపుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని మీరు ఒకరినొకరు అభివందనాలు చెప్పుకోండి.

[21] ఈ అభివందనం నేను – పౌలును – నా సొంత చేతితో రాస్తున్నాను.

[22] ఎవరికైనా సరే ప్రభువైన యేసు క్రీస్తంటే ప్రేమ లేకపోతే వారు శాపానికి గురి అవుతారు గాక! ప్రభువు వస్తున్నాడు!

[23] మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది గాక!

[24] క్రీస్తు యేసులో నా ప్రేమ మీకందరికీ తోడై ఉంటుంది గాక! తథాస్తు!

1 కొరింతువారికి లేఖ — Chapters