[1] మేము చెపుతున్న సంగతులలో ముఖ్యాంశమిదే: ఇలాంటి ప్రముఖయాజి ఒకడు మనకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్న మహా ఘనపూర్ణుని సింహాసనం కుడిప్రక్కన కూర్చుని ఉన్నాడు.
[2] పవిత్ర గర్భాలయంలో, అంటే నిజమైన ఆరాధన గుడారంలో ఆయన సేవ చేస్తున్నవాడు. ఈ ఆరాధన గుడారాన్ని వేసినది మనుషులు కాదు గాని ప్రభువే.
[3] ప్రతి ప్రముఖయాజీ అర్పణలూ బలులూ అర్పించడానికి నియమితమైనవాడు. అందుచేత ఈ ప్రముఖయాజికి కూడా అర్పించడానికి ఒకటి ఉండాలి.
[4] ఈయన భూమిమీద ఉంటే యాజిగా ఉండనే ఉండడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారమైన అర్పణలు అర్పించేవారు ఉన్నారు.
[5] అయితే వారు సేవ చేసేది పరలోక విషయాలకు సూచనగా, నీడగా ఉన్న దాన్ని మాత్రమే. మోషే ఆరాధన గుడారం నిర్మించబోయినప్పుడు దేవుడు అతణ్ణి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: “ఈ పర్వతం మీద నీకు చూపెట్టిన నమూనా ప్రకారమే అన్నీ చేయాలి సుమా.”
[6] ఈయనకైతే దానికంటే మరీ శ్రేష్ఠమైన సేవ లభించింది. అంతేకాకుండా ఆయన పాత ఒడంబడిక కంటే శ్రేష్ఠమైన ఒడంబడికకు మధ్యవర్తి. ఇది పాత వాగ్దానాలకంటే శ్రేష్ఠమైన వాగ్దానాల మీద స్థాపితమైనది.
[7] ఒకవేళ ఆ మొదటి ఒడంబడిక లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం కోసం వెతికి ఉండేది కాదు.
[8] కానీ దేవుడు వారి విషయం తప్పు మోపి ఇలా అన్నాడు: “ఇదిగో విను, ప్రభువు చెప్పేదేమంటే, ఒక కాలం రాబోతుంది. అప్పుడు నేను ఇస్రాయేల్‌వారితోనూ యూదా వారితోనూ కొత్త ఒడంబడిక చేస్తాను.
[9] నేను ఈజిప్ట్‌లోనుంచి వారి పూర్వీకులను చేయి పట్టుకొని నడిపించాను. ఈ కొత్తది నేను ఆ కాలంలో వారితో చేసిన ఒడంబడికలాగా ఉండదు. ఎందుకంటే వారు నా ఒడంబడికలో నిలకడగా ఉండిపోలేదు, గనుక నేను వారిని లెక్క చేయలేదని ప్రభువు చెపుతున్నాడు.
[10] ఆ రోజులైన తరువాత నేను ఇస్రాయేల్‌వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది ప్రభువు చెపుతున్నాడు – నేను నా శాసనాలు వారి మనసులలో ఉంచుతాను, వాటిని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను. వారు నాకు ప్రజలై ఉంటారు.
[11] వారంతా అల్పులైనా ఘనులైనా నన్ను తెలుసుకొంటారు గనుక ‘యెహోవాతో పరిచయం చేసుకో’ అంటూ వారు తమ తమ సాటి పౌరులకూ సోదరులకూ బోధించరు.
[12] నేను వారి అన్యాయాన్ని గురించి కరుణ చూపుతాను, వారి పాపాలనూ ధర్మవిరుద్ధ చర్యలనూ ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను.”
[13] ఆయన “క్రొత్త ఒడంబడిక” అన్నప్పుడు మొదటి దాన్ని పాతదిగా చేశాడు. ఏదైతే పాతగిలి ఉడిగిపోతుందో అది అంతర్థానమైపోవడానికి సిద్ధంగా ఉంటుంది.