Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:50

[1] అందుచేత, మనం విన్న సంగతులనుంచి కొట్టుకు పోకుండా వాటిలో మరి ఎక్కువ శ్రద్ధ వహించాలి.

[2] దేవదూతలచేత దేవుడు పలికించిన వాక్కు స్థిరంగా ఉండడంవల్ల ప్రతి అతిక్రమానికీ అవిధేయత క్రియకూ న్యాయమైన ప్రతిఫలం కలిగింది.

[3] ఇలాంటప్పుడు మనం ఇంత గొప్ప ముక్తి లెక్క చేయకపోతే ఎలా తప్పించుకొంటాం? ఈ ముక్తి మొదట ప్రభువు తానే ప్రకటించాడు, ఆయన మాటలు విన్నవారు దానిని మనకు రూఢి చేశారు.

[4] దేవుడు కూడా తన ఇష్టప్రకారం సూచకమైన క్రియలూ వింతలూ నానా విధాల అద్భుతాలూ పవిత్రాత్మ ఉచిత వరాలు అనుగ్రహించడం ద్వారా వారితోపాటు సాక్ష్యం ఇచ్చాడు.

[5] మేము రాబోయే లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దానిని దేవుడు దేవదూతల వశం చేయలేదు.

[6] కానీ ఒక వ్యక్తి ఒక చోట ఇలా సాక్ష్యం చెప్పాడు: “నీవు మనిషిని తలచుకోవడానికి వాడెంతటివాడు? నరపుత్రుణ్ణి గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు?

[7] అతణ్ణి కొంత కాలంపాటు దేవదూతలకంటే తక్కువవాణ్ణి చేశావు గానీ మహిమ, ఘనతలు అతనిమీద కిరీటంలాగా ధరింపచేశావు. నీ చేతితో నిర్మించిన వాటిమీద అతనికి అధికారమిచ్చావు.

[8] సమస్తమూ అతని వశంలో అతని పాదాల క్రింద ఉంచావు.” దేవుడు సమస్తమూ అతని వశంలో అతని క్రింద అంటే అతని క్రింద ఉంచక విడిచిపెట్టింది ఏదీ లేదన్నమాట. అయినా సమస్తమూ అతని క్రింద ఉంచడం మనమింకా చూడలేదు.

[9] అయితే మనం చూచేది ఏమిటంటే, మరణబాధలు అనుభవించడానికి కొంత కాలంపాటు దేవదూతలకంటే తక్కువవాడుగా చేయబడ్డ యేసు మీద మహిమ, ఘనతలు కిరీటంలాగా ధరింపచేయడం. దేవుని అనుగ్రహంవల్ల ప్రతి ఒక్కరికోసమూ ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం.

[10] ఎందుకంటే, ఎవరికోసం సమస్తమూ ఉన్నదో, ఎవరిద్వారా సమస్తమూ ఉన్నదో ఆయన అనేకమంది కుమారులను మహిమలోకి తేవడంలో వారి విముక్తికర్తను బాధల ద్వారా పరిపూర్ణుణ్ణి చేశాడు. అలా చేయడం ఆయనకు తగినదే.

[11] ఎందుకంటే, పవిత్రపరిచేవాడు పవిత్ర పరచబడ్డవారు ఒకరికే చెందినవారు. అందుచేత ఆయన వారిని సోదరులనడానికి సిగ్గుపడడు.

[12] “నీ పేరు నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్య నీ కీర్తిని సంకీర్తనం చేస్తాను” అన్నాడు; “ఆయనమీద నా నమ్మకం ఉంచుతాను” అన్నాడు;

[13] “నన్నూ, దేవుడు నాకిచ్చిన పిల్లలనూ చూడండి” అని కూడా అన్నాడు.

[14] ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్నకారణంగా ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణ శక్తి గలవాణ్ణి, అంటే అపనింద పిశాచాన్ని శక్తిహీనుణ్ణి చేయాలనీ

[15] మరణ భయంచేత తాము బ్రతికినంత కాలం బానిసత్వానికి లోనైనవారిని విడిపించాలనీ అందులో ఆయన ఉద్దేశం.

[16] ఆయన చేపట్టినది దేవదూతలను కాదు గాని అబ్రాహాము సంతానాన్నే.

[17] అందుచేత అన్నిట్లో ఆయనను తన సోదరుల లాంటివాణ్ణిగా చేయవలసివచ్చింది. ఎందుకని? ఆయన దేవుని విషయాలలో జాలి గల నమ్మకమైన ప్రముఖయాజి అయి ప్రజల పాపాలను గురించి తనను బలిగా సమర్పించి దేవుని కోపాన్ని తొలగించవలసివచ్చింది.

[18] ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు.

హీబ్రూవారికి లేఖ — Chapters