Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:24

[1] అందుచేత, పరలోకసంబంధమైన పిలుపులో పాల్గొన్న పవిత్రులైన సోదరులారా, మనం ఒప్పుకొన్న రాయబారి, ప్రముఖయాజి క్రీస్తు యేసును గురించి బాగా తలపోయండి.

[2] మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాగే యేసు కూడా తనను నియమించినవానికి నమ్మకంగా ఉన్నాడు.

[3] కానీ ఇంటికంటే ఇల్లు కట్టేవాడు ఎక్కువగా గౌరవార్హుడు. అలాగే ఈయన మోషేకంటే ఎక్కువ మహిమకు తగినవాడుగా లెక్కలోకి వచ్చాడు.

[4] ప్రతి ఇల్లూ ఎవరో ఒకరు నిర్మిస్తారు గాని సమస్తమూ నిర్మించినవాడు దేవుడే.

[5] మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నది సేవకుడుగానే. అది తరువాత చెప్పబడేవాటికి సాక్ష్యంగా ఉంది.

[6] క్రీస్తు అయితే నమ్మకంగా ఉన్నది కుమారుడుగానే తన సొంత ఇంటి మీదే. మనం అంతంవరకూ ఆశాభావంవల్ల కలిగే ధైర్యాన్నీ అతిశయాన్నీ గట్టిగా చేపట్టామంటే మనమే ఆయన ఇల్లు.

[7] అందుచేత పవిత్రాత్మ ఇలా చెపుతున్నాడు: “ఈ రోజు మీరు ఆయన స్వరం వింటే,

[8] మీ పూర్వీకులు నాకు కోపం రేపే సందర్భంలో ఎడారిలో ఆ పరీక్ష రోజున జరిగినట్టు మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి.

[9] అప్పుడు వారు నన్ను శోధిస్తూ పరీక్షించారు. నలభై సంవత్సరాలు నా కార్యకలాపాలు చూశారు కూడా.

[10] గనుక నేను ఆ తరంవారిమీద కోపపడ్డాను. ‘వారు హృదయాల్లో ఎప్పుడూ దారి తప్పి పోతున్నారు. నా త్రోవలు వారు ఎరగనే ఎరగరు’ అన్నాను.

[11] అందుచేత నేను నా ఆగ్రహంతో ‘వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని శపథం చేశాను.”

[12] సోదరులారా! మీలో ఎవరికైనా ఒక వేళ నమ్మకం లేని చెడ్డ హృదయం, దేవుణ్ణి విడిచిపెట్టిపోయే హృదయం ఉందేమో అని జాగ్రత్త వహించండి!

[13] “ఈ రోజు ఆయన స్వరం వింటే మీ పూర్వీకులు నాకు కోపం రేపిన సందర్భంలో జరిగినట్టు మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి” అని ఆయన చెప్పాడు గదా.

[14] అందుచేత “ఈ రోజు” అనే సమయం ఇంకా ఉండగానే మీలో ఎవరైనా ఒకవేళ పాపం ద్వారా కలిగే మోసంచేత కఠినులు కాకుండా దినదినం ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి.

[15] ఎందుకంటే, మొదట మనకున్న విశ్వాస నిశ్చయత అంతం వరకూ గట్టిగా చేపట్టితేనే క్రీస్తులో పాలిభాగస్తులమయ్యాం.

[16] దేవుని స్వరం విని ఆయనకు కోపం రేపినదెవరు? ఈజిప్ట్దేశం నుంచి మోషే తీసుకువచ్చిన వారంతా గదా!

[17] నలభై సంవత్సరాలపాటు దేవుడు కోపపడినది ఎవరిమీద? అపరాధం చేసినవారిమీదే గదా! వారి మృత దేహాలు ఎడారిలో కూలిపోయాయి కూడా.

[18] తన విశ్రాంతిలో ప్రవేశించరని ఆయన శపథం చేసినది ఎవరిని గురించి? అవిధేయులను గురించే గదా.

[19] గనుక వారు అవిశ్వాసం కారణంగా ప్రవేశించలేక పోయారని గ్రహిస్తున్నాం.

హీబ్రూవారికి లేఖ — Chapters