[1] మనుషులలో నుంచి ఎంపిక చేయబడ్డ ప్రతి ప్రముఖ యాజిని నియమించినది దేవుని విషయాలలో మనుషుల తరఫున ఉండి పాపాలకోసం యజ్ఞాలూ బలులూ అర్పించడానికే.
[2] అతడు కూడా బలహీనతకు గురి అయినవాడు గనుక తెలివి లేక త్రోవ తప్పినవారిపట్ల మృదుభావంతో వ్యవహరించగలడు.
[3] అందుచేత అతడు ప్రజల నిమిత్తం పాపాలకోసం బలులు అర్పించవలసి ఉన్నట్టే తన నిమిత్తం కూడా అర్పించవలసి ఉంది.
[4] ఈ ఘనత ఎవ్వడూ తనకు తానే తీసుకొన్నది కాదు. అది పొందేవాడు అహరోనులాగే దేవుని పిలుపు అందినవాడు.
[5] అలాగే క్రీస్తు కూడా ప్రముఖయాజి కావడానికి తనను తానే గౌరవించుకోలేదు. “నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను” అని ఆయనతో చెప్పినవాడే అలా ఆయనను గౌరవించాడు.
[6] దీనికి అనుగుణంగానే మరో చోట దేవుడు ఇలా అన్నాడు: “నీవు మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం యాజివి.”
[7] క్రీస్తు భూమిమీద సశరీరంగా ఉన్న రోజులలో తనను చావులోనుంచి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్ళతో ప్రార్థనలూ విన్నపాలూ అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు.
[8] ఆయన కుమారుడై ఉండీ కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకొన్నాడు.
[9] అంతే కాక, ఆయన పరిపూర్ణుడై తన మాట విన్నవారందరికీ శాశ్వతమైన విముక్తికి మూలాధారమయ్యాడు.
[10] దేవుడు ఆయనను మెల్కీసెదెక్ వరుసప్రకారం ప్రముఖ యాజిగా పిలిచి నియమించాడు.
[11] ఆయనను గురించి చెప్పడానికి మాకెన్నో సంగతులున్నాయి గాని వాటిని మీకు వివరించి చెప్పడం కష్టమే. ఎందుకంటే, వినడంలో మీరు మందబుద్ధులయ్యారు.
[12] కాలాన్ని బట్టి చూస్తే మీరిప్పుడు ఉపదేశకులై ఉండాలి గాని మరొకడు మీకు దేవోక్తులలో ఉన్న మొదటి పాఠాలు మళ్ళీ నేర్పవలసి ఉంది. మీకు అవసరమైనది బలమైన ఆహారం కాదు గాని పాలే. అలా తయారయ్యారు.
[13] పాలు మాత్రం తీసుకొనేవారంతా పసి పిల్లలే. అలాంటి వ్యక్తికి నీతిన్యాయాల సందేశం విషయంలో అనుభవం లేదు.
[14] బలమైన ఆహారం పెద్దలకే, అంటే మంచిచెడ్డలు గుర్తించడానికి వారి మనశ్శక్తులు వాడుకోవడంవల్ల వాటిని సాధనం చేసుకున్న వారికే.