Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:32

[1] అందుచేత, ఆయన విశ్రాంతిలో ప్రవేశించడంకోసం వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నప్పుడు మీలో ఎవరైనా దానిని అందుకోకుండా ఉన్నారేమో అని భయంతో ఉందాం.

[2] శుభవార్తను మనకూ వారికీ ప్రకటించడం జరిగింది. అయితే విన్నవాక్కు వల్ల వారికి ప్రయోజనమేమీ కలగలేదు. ఎందుకంటే, విన్నవారిలో వాక్కుతో నమ్మకం కలిసినది కాదు.

[3] నమ్మిన మనమైతే విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నాం. జగత్తుకు పునాది ఏర్పడినప్పటినుంచీ ఆ కార్యకలాపాలన్నీ ముగిసి ఉన్నా, “నేను ఆగ్రహంతో ‘వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని శపథం చేశాను” అన్నాడు.

[4] అంతే కాదు, ఆయన ఏడో రోజు గురించి “దేవుడు తన పనులన్నీ సంపూర్తి చేసి ఏడో రోజున పని మానుకొన్నాడు” అని ఒక చోట అన్నాడు.

[5] మళ్ళీ ఈ చోట “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.

[6] ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించాలని ఉందన్నమాటే గాని మొదట శుభ సందేశ ప్రకటన విన్నవారు అవిధేయత కారణంగా ప్రవేశించకపోవటం వల్ల

[7] ఆయన మళ్ళీ “ఈ రోజు” అనే మరో సమయాన్ని నియమించాడు. ముందు చెప్పినట్టు “ఈ రోజు మీరు ఆయన స్వరం వింటే మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి” అంటే చాలా కాలానికి దావీదుచేత పలికించాడు.

[8] ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి కలిగించాడూ అంటే ఆ తరువాత మరో రోజును ఉద్దేశించి దేవుడు చెప్పి ఉండడు.

[9] అందుచేత దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది.

[10] ఎందుకంటే, దేవుడు తన పనులు మానుకొన్నట్టే, ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవారు కూడా తమ పనులు మానుకొన్నారు.

[11] అందుచేత ఆ అవిధేయుల పోకడ ప్రకారంగా ఎవరైనా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి శ్రద్ధ వహించుకొందాం.

[12] ఎందుకంటే, దేవుని వాక్కు జీవం గలది, బలప్రభావాలు గలది, రెండంచుల ఎలాంటి ఖడ్గంకంటే కూడా వాడిగలది. అది లోపలికి దూసుకుపోతూ, ప్రాణాన్నీ ఆత్మనూ విభాగిస్తుంది, కీళ్ళనూ మూలుగనూ వేరు చేస్తుంది, తలంపులకూ హృదయభావాలకూ తీర్పు చేస్తుంది.

[13] సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి సమస్తమూ తేటతెల్లంగా, బట్టబయలుగా కనిపిస్తుంది. అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి.

[14] అయితే మనకు గొప్ప ప్రముఖయాజి ఒకడు ఉన్నాడు. ఆయన ఆకాశాల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. అందుచేత మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాం.

[15] ఎందుకంటే, మనకు ఉన్న ప్రముఖయాజి మన బలహీనతల విషయంలో సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నిటిలో విషమపరీక్షలకు గురి అయ్యాడు గాని ఆయన పాపం లేనివాడు.

[16] కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.

హీబ్రూవారికి లేఖ — Chapters