[1] ధర్మశాస్త్రం సంభవించబోయే మంచి విషయాలకు నీడ గలది గాని ఆ విషయాల స్వరూపం దానికి లేదు. అందుచేత ధర్మశాస్త్రం, వారు ఏటేట నిత్యం అర్పించిన ఒకే రకం ఆ బలులచేత సమీపించేవారికి పరిపూర్ణత ఎన్నడూ కలిగించలేకపోయేది.
[2] ఒకవేళ కలిగించగలిగి ఉంటే ఆ బలులు ఇంకా అర్పించడం మానివేయడం జరిగి ఉండదా? ఆరాధించేవారు పూర్తిగా శుద్ధులైన తరువాత పాపాలను గురించి గద్దించే అంతర్వాణి వారికింకా ఉండి ఉండదు గదా.
[3] గానీ ఆ బలులు ఏటేటా పాపాలను గురించి జ్ఞాపకం చేస్తాయి.
[4] ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం.
[5] అందుచేత ఆయన లోకంలోకి వచ్చినప్పుడు దేవునితో అన్నాడు: “బలినీ యజ్ఞాన్నీ నీవు కోరలేదు. అయితే నా కోసం శరీరాన్ని తయారు చేశావు.
[6] హోమాలు, పాపాల కోసమైన అర్పణలు అంటే నీకు సంతోషం కలగలేదు.
[7] అప్పుడు నేనిలా చెప్పాను: ‘ఇదిగో నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంది. ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను.’”
[8] బలినీ యజ్ఞాన్నీ హోమాలను పాపాలకోసమైన అర్పణలను “నీవు కోరలేదు”, వాటిలో “నీకు సంతోషం కలగలేదు” అని ముందు చెప్పాడు – ధర్మశాస్త్రం ప్రకారం ఇవి అర్పించినవి.
[9] అప్పుడాయన “ఇదిగో ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను” అన్నాడు. ఇలా ఆయన ఆ రెండో దానిని స్థాపించడానికి ఆ మొదటిదానిని రద్దు చేశాడు.
[10] ఆ చిత్తంవల్ల, యేసు క్రీస్తు శరీరం బలి కావడం ద్వారా మనం ఎప్పటికీ ఒకే సారి పవిత్రమయ్యాం.
[11] ప్రతి యాజీ రోజు రోజు నిలిచి సేవ చేస్తూ ఒకే రకం బలులు పదే పదే అర్పిస్తూ ఉన్నాడు. ఇవి పాపాలను ఎన్నడూ తీసివేయలేవు.
[12] ఈ మానవుడైతే పాపాలకోసం ఎప్పటికీ నిలిచి ఉండే ఒకే బలి ఇచ్చిన తరువాత దేవుని కుడివైపున కూర్చున్నాడు.
[13] అప్పటినుంచి ఆయన తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.
[14] ఎందుకంటే ఒకే యజ్ఞంచేత ఈయన పవిత్రపరచబడుతున్నవారిని శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.
[15] ఈ విషయంలో పవిత్రాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు.
[16] ఆయన “ఆ రోజులైన తరువాత నేను ఇస్రాయేల్ వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది ప్రభు వాక్కు – నేను నా శాసనాలు వారి హృదయాలలో ఉంచుతాను, వాటిని వారి మనసులమీద వ్రాస్తాను” అని చెప్పిన తరువాత
[17] “వారి అపరాధాలనూ ధర్మవిరుద్ధ చర్యలను అప్పటినుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు.
[18] వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాలకోసం బలి ఇంకెన్నడూ ఉండదు.
[19] సోదరులారా, యేసు తెరద్వారా అంటే తన శరీరం ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గం అంకితం చేశాడు.
[20] కాబట్టి దాని గుండా యేసు రక్తంచేత అతి పవిత్రస్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది.
[21] దేవుని ఇంటిమీద గొప్ప ప్రముఖ యాజి కూడా మనకున్నాడు.
[22] గనుక సంపూర్ణ విశ్వాస నిశ్చయతతో, యథార్థ హృదయంతో, మన శరీరం శుద్ధ జలంతో కడగబడి, అంతర్వాణి నేరారోపణ చేయకుండా ప్రోక్షించబడ్డ హృదయాలు కలిగి దేవుణ్ణి సమీపిద్దాం.
[23] వాగ్దానం చేసినవాడు విశ్వసనీయుడు గనుక నిలకడగా ఉండి మనం ఒప్పుకొన్న ఆశాభావాన్ని గట్టిగా చేపట్టి ఉందాం.
[24] అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం.
[25] సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరచుకొంటూ, ఆ దినం దగ్గరపడడం చూచేకొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఉందాం.
[26] ఎందుకంటే, సత్యాన్ని గురించి తెలుసుకొన్న తరువాత మనం బుద్ధి పూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే ఇకమీదట పాపాలకోసం బలి ఉండదు.
[27] అప్పుడు మిగిలినదేమంటే, న్యాయమైన తీర్పు గురించీ దేవుని విరోధులను దహించివేసే అగ్నిజ్వాలల్లాంటి ఆగ్రహాన్ని గురించీ భయంతో ఎదురు చూడడమే.
[28] ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఇద్దరి, ముగ్గురి సాక్ష్యాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా చావవలసి వచ్చేది.
[29] అలాంటప్పుడు తన పాదాలక్రింద దేవుని కుమారుణ్ణి త్రొక్కివేసి తనను పవిత్రపరచిన ఒడంబడిక రక్తం అపవిత్రమని భావించి కృపాభరితమైన దేవుని ఆత్మను దూషించినవాడికింకా ఎంత ఎక్కువ కఠినమైన దండనకు తగినవాడని ఎంచబడతాడో! ఏమనుకొంటారు?
[30] “పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను” అని ప్రభువు చెపుతున్నాడు; “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని పలికినవాడు మనకు తెలుసు గదా!
[31] జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం!
[32] మునుపటి రోజులు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ మనోనేత్రాలు వెలుగొందిన తరువాత మీరు బాధలతో కూడిన పెద్ద పోరాటం ఓర్చుకొన్నారు.
[33] దానిలో కొంత మీరు నిందలకూ కడగండ్లకూ గురి అయి బహిరంగంగా వింత దృశ్యం కావడంవల్ల కలిగింది. మరి కొంత మీరు అలాంటివాటికి గురి అయినవారితో సహవాసం చేసినందువల్ల కలిగింది.
[34] ఎలాగంటే, మీరు ఖైదీనైన నా మీద జాలి చూపారు. మీ ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా సంతోషంతో అంగీకరించారు. ఎందుకంటే, దానికంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో మీకుందని తెలుసుకొన్నారు.
[35] అందుచేత మీ ధైర్యాన్ని వదలిపెట్టకండి. దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది.
[36] మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తరువాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరం.
[37] “ఇంకా కొద్ది కాలంలో రాబోయేవాడు వస్తాడు, ఆలస్యం చేయడు.
[38] గానీ న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు. ఎవడైనా వెనక్కు తీస్తే అతని విషయంలో నాకు సంతోషం ఉండదు.”
[39] అయితే మనం నాశనానికి వెనక్కు తీసేవారం కాము గాని ఆత్మ రక్షణకు నమ్మేవారమే.