[1] సోదర ప్రేమ చూపుతూ ఉండండి.
[2] పరాయివారికి అతిథి సత్కారం చేసే విషయం మనసులో ఉంచండి. దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశారు.
[3] ఖైదులో ఉన్నవారితో కూడా మీరు ఖైదీలై ఉన్నట్టే వారిని జ్ఞాపకముంచుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనుక దౌర్జన్యానికి గురి అయినవారిని తలచుకోండి.
[4] వివాహమంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
[5] మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగినదానితోనే తృప్తిపడుతూ ఉండండి. ఎందుకంటే, ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదలిపెట్టను.
[6] అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.
[7] మీకు దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్నవారిని మనసులో ఉంచుకోండి. వారి జీవిత విధాన ఫలితం తలపోస్తూ వారి విశ్వాస మార్గాన్ని అనుసరించండి.
[8] యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరమూ ఒక్కటే రీతిగా ఉన్నాడు.
[9] ఆయా రకాల విపరీత ఉపదేశాలకు కొట్టుకుపోకండి. భోజనాల గురించిన కట్టుబాట్ల వల్ల గాక, దేవుని కృపవల్లే హృదయం సుస్థిరం కావడం మేలు. ఆ భోజనాలను బట్టి ప్రవర్తించేవారికి ప్రయోజనమేమీ కలగలేదు.
[10] మనకు బలిపీఠం ఒకటి ఉంది. దీనికి సంబంధించిన దానిని తినడానికి ఆరాధన గుడారంలో సేవ చేసేవారికి హక్కు లేదు.
[11] ఎందుకంటే ప్రముఖయాజి ఏ జంతువుల రక్తాన్ని పాపంకోసమైన అర్పణగా పవిత్రస్థలంలోకి తెస్తాడో ఆ జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేయడం జరిగేది.
[12] అందుచేత, యేసు కూడా స్వరక్తం వల్ల తన ప్రజలను పవిత్రపరచడానికి నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు.
[13] కాబట్టి మనం ఆయన నింద భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళిపోదాం.
[14] ఎప్పటికీ నిలిచి ఉండే నగరం ఇక్కడ మనకు లేదు గాని వచ్చే నగరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం.
[15] కనుక ఆయనద్వారా దేవునికి స్తుతి యజ్ఞం – అంటే ఆయన పేరును ఒప్పుకొనే నోటి ఫలం – మనమెప్పుడూ అర్పిస్తూ ఉందాం.
[16] ఉపకారాలూ దానధర్మాలూ చేయడం మరవకండి. ఇలాంటి యజ్ఞాలంటే దేవునికి ఇష్టమే.
[17] మీ సంఘ నాయకుల మాట విని వారికి లోబడండి. ఎందుకంటే, వారు లెక్క అప్పచెప్పవలసినవారుగా మీ ఆత్మలకు కావలి కాస్తున్నారు. వారు ఈ పని దుఃఖంతో చేస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక వారు ఈ పనిని దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలా వారి మాట వినండి.
[18] మాకు మంచి అంతర్వాణి ఉందనీ మేము అన్ని విషయాలలో యోగ్యంగా ప్రవర్తించడానికి కోరుతున్నామనీ మా గట్టి నమ్మకం గనుక మాకోసం ప్రార్థన చేయండి.
[19] నేను మీ దగ్గరకు ఇంకా త్వరలో వచ్చేలా ఈ విధంగా చేయాలని మిమ్ములను మరీ ఎక్కువగా వేడుకొంటున్నాను.
[20] శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా మన ప్రభువైన యేసును – గొర్రెలకు ఆ గొప్ప కాపరిని – చనిపోయినవారిలో నుంచి లేపిన శాంతిప్రదాత దేవుడు
[21] ప్రతి మంచి విషయంలో తన సంకల్పం నెరవేర్చడానికి మిమ్ములను పూర్తిగా సంసిద్ధులను చేస్తాడు గాక! యేసు క్రీస్తు ద్వారా తనకు ప్రీతికరమైనవాటిని మీ లోపల జరిగిస్తాడు గాక! యేసు క్రీస్తుకు యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక! తథాస్తు!
[22] సోదరులారా, నేను మీకు క్లుప్తంగా రాశాను. ఈ ప్రోత్సాహ వాక్కు ఓపికతో స్వీకరించండని మిమ్ములను వేడుకొంటున్నాను.
[23] మన సోదరుడు తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరలో వస్తే అతనితోకూడా వచ్చి మిమ్ములను చూస్తాను.
[24] మీ నాయకులందరికీ, పవిత్రులందరికీ మా అభివందనాలు చెప్పండి. ఇటలీ దేశంవారు మీకు అభివందనాలు చెపుతున్నారు.
[25] మీకందరికీ కృప తోడై ఉంటుంది గాక. తథాస్తు.