[1] ఈ మెల్కీసెదెక్ షాలేం పట్టణం రాజు, సర్వాతీతుడైన దేవుని యాజి. రాజులను వధించి తిరిగి వస్తూ ఉన్న అబ్రాహామును అతడు కలుసుకొని అతణ్ణి దీవించినవాడు.
[2] అబ్రాహాము అతనికి అన్నిట్లో పదో భాగం ఇచ్చాడు. మొదట, అతని పేరుకు అర్థం “నీతి న్యాయాలకు రాజు”, తరువాత “షాలేం రాజు” అంటే “శాంతికి రాజు”.
[3] అతడు తల్లి, తండ్రి, వంశవృక్షం లేనివాడు. అతని రోజులకు ఆది జీవితానికి అంతం అంటూ లేవు గాని దేవుని కుమారునిలాగా చేయబడి అతడు ఎప్పటికీ యాజి అయి ఉన్నాడు.
[4] అతడెంత గొప్పవాడో చూడండి. వంశకర్త అబ్రాహాము కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వాటిలో పదో భాగం అతనికిచ్చాడు.
[5] లేవీ సంతానంలో యాజి పదవి పొందినవారు తమ సోదరుల దగ్గర, అంటే అబ్రాహాము వంశంలో జన్మించిన ప్రజల దగ్గర పదో భాగం పుచ్చుకోవాలని ధర్మశాస్త్రంలో ఆదేశం ఉంది.
[6] అయితే వారి వంశానికి చెందనివాడైన మెల్కీసెదెక్ దేవుని వాగ్దానాలు గల అబ్రాహామునుంచి పదో భాగం పుచ్చుకొని అతణ్ణి దీవించాడు.
[7] దీవించేవాడు అధికుడు, దీవెన అందుకొనేవాడు తక్కువవాడనే మాట ఎవరూ కాదనలేరు.
[8] అంతేకాదు. ఇక్కడ చావుకు లోనయ్యే మనుషులు పదో భాగం పుచ్చుకొంటున్నారు. గాని అక్కడ ఎప్పటికీ బ్రతికేవాడని చెప్పబడేవాడు పదో భాగం పుచ్చుకొన్నాడు.
[9] ఒక విధంగా చెప్పాలంటే పదో భాగం పుచ్చుకొన్న లేవీ, అబ్రాహాము ద్వారా పదో భాగం ఇచ్చాడు.
[10] ఎలాగంటే, మెల్కీసెదెక్ అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవీ ఇంకా తన పూర్వీకుడి గర్భంలోనే ఉన్నాడు.
[11] లేవీ వారి యాజి ధర్మం అనే పునాది మీద ఇస్రాయేల్ ప్రజకు ధర్మశాస్త్రం వచ్చింది. యాజిధర్మం ద్వారా సంపూర్ణత కలిగేదైతే అహరోను వరుసలో పిలుపు ప్రకారం కాక మెల్కీసెదెక్ వరుసప్రకారం మరో యాజి రావలసిన అవసరం ఏముంది?
[12] యాజి ధర్మం మారిందీ అంటే దాని ధర్మశాస్త్రం కూడా మారడం తప్పనిసరి.
[13] ఈ సంగతులు ఎవరిని గురించి చెప్పబడ్డాయో ఆయన వేరే గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రికులలో ఎవ్వరూ బలిపీఠం దగ్గర ఎన్నడూ సేవ చేయలేదు.
[14] మన ప్రభువు యూదా వంశంలో జన్మించాడని తేటతెల్లమే. ఈ గోత్రాన్ని ఉద్దేశించి మోషే యాజులను గురించి ఏమీ చెప్పలేదు.
[15] మెల్కీసెదెక్‌ను పోలిన మరో యాజి రావడం కారణంగా, మేము చెప్పినది ఇంకా తేటతెల్లమే.
[16] ఎలాగంటే, ఈ యాజి ధర్మశాస్త్రంలోని దేహసంబంధమైన షరతు ప్రకారం కాక అంతం లేని జీవానికున్న బలప్రభావాల ప్రకారమే వచ్చాడు.
[17] ఇందుకు “నీవు మెల్కీసెదెక్ వరుసప్రకారం సదాకాలం యాజివి” అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు గదా.
[18] ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణమైనదిగా చేయలేదు. యాజులను గురించిన మొదటి విధి బలహీనమైనది, పనికిమాలినది, గనుక దానిని రద్దు చేయడమూ
[19] దానికంటే శ్రేష్ఠమైన ఆశాభావాన్ని తెచ్చిపెట్టడమూ జరిగింది. దీనినిబట్టి మనం దేవుణ్ణి సమీపిస్తున్నాం.
[20] మరో విషయం – శపథం లేకుండా ఇదంతా జరగలేదు.
[21] వారేమో శపథం లేకుండా యాజులు అయ్యారు. యేసైతే శపథంతోనే “నీవు మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం యాజివి. ప్రభువు ప్రమాణం చేశాడు. ఆయన మాటకు తిరుగు లేదు” అని ఆయనతో చెప్పినవాని ద్వారానే యాజి అయ్యాడు.
[22] ఈ విధంగా, పాతదానికంటే మరీ శ్రేష్ఠమైన ఒడంబడికకు యేసు పూచీదారుగా ఉన్నాడు.
[23] మరొకటి, అప్పటి యాజులు అనేకులు. ఎందుకంటే మరణం కారణంగా వారు సేవలో సాగిపోలేకపోయారు.
[24] ఈయన అయితే శాశ్వతంగా సేవలో సాగిపోతూ ఉన్నాడు గనుక ఆయన యాజి ధర్మం మారనిది.
[25] ఈ కారణంచేత తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చినవారిని శాశ్వతంగా రక్షించగలవాడు. ఎందుకంటే వారి పక్షంగా విన్నవించడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నాడు.
[26] ఇలాంటి ప్రముఖయాజి మనకు తగినవాడే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కళంకమేమీ లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు, ఆకాశాలకంటే ఉన్నతుడైనవాడు.
[27] మునుపటి ప్రముఖయాజుల లాగా ఆయన మొదట తన పాపాలకోసం బలులు సమర్పించనక్కరలేదు. తరువాత ప్రజల కోసం రోజు రోజూ బలులు సమర్పించనక్కరలేదు. తనను తాను సమర్పించుకొన్నప్పుడు ఒక్క సారే ఇది చేసి ముగించాడు.
[28] ధర్మశాస్త్రం బలహీనతగల మనుషులను యాజులుగా నియమించేది గాని ధర్మశాస్త్రం తరువాత ప్రమాణంతో వచ్చిన మాట దేవుని కుమారుణ్ణి యాజిగా నియమించింది. ఈయన శాశ్వతంగా పరిపూర్ణసిద్ధి పొందినవాడు.