[1] అందుచేత, క్రీస్తును గురించిన ప్రాథమికమైనవి మాని సంపూర్ణతకు సాగిపోదాం. అంటే, నిర్జీవ క్రియల విషయం పశ్చాత్తాపపడడమూ, దేవుని మీద నమ్మకం ఉంచడమూ,
[2] బాప్తిసాలను గురించిన ఉపదేశమూ, చేతులుంచడమూ, చనిపోయినవారు లేవడమూ, శాశ్వతమైన తీర్పూ – వీటికి పునాది మళ్ళీ వేయకుండా ముందుకు సాగిపోదాం.
[3] దేవుడు అనుమతి ఇస్తే అలా చేస్తాం.
[4] ఎందుకంటే, ఒకసారి మనోనేత్రాలు వెలుగొంది, ఉచితమైన పరలోక వరాన్ని రుచి చూచి, పవిత్రాత్మలో పాల్గొని,
[5] దేవుని హిత వాక్కునూ వచ్చే యుగ ప్రభావాలనూ రుచి చూచినవారు
[6] ఆ తరువాత దారి ప్రక్కన పతనం అయ్యారు అంటే, వారిని మళ్ళీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకని? వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేసి ఆయనను బట్టబయలుగా అవమానానికి గురి చేస్తారు.
[7] భూమి తరచుగా కురిసిన వాన పీల్చుకొని, ఎవరికోసం వ్యవసాయం జరుగుతున్నదో వారికి తగిన పంట ఇస్తూ దేవుని దీవెనలో పాలు పొందుతుంది.
[8] కానీ ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే అది తిరస్కారమై శాపానికి గురి కాబోతున్నది. చివరికి దానిని కాల్చివేయడం జరుగుతుంది.
[9] అయితే, ప్రియ సోదరులారా, మేమిలా మాట్లాడుతూ ఉన్నా, ఇంతకంటే మీ పరిస్థితులు మంచివనీ విముక్తి, రక్షణ గలదనీ మాకు గట్టి నమ్మకం ఉంది.
[10] ఎందుకంటే దేవుడు అన్యాయస్థుడు కాడు – మీరు చేసిన పనిని ఆయన మరవడు. పవిత్రులకు మీరు ప్రయాసతో సేవ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అందులో తన పేరుపట్ల మీరు చూపిన ప్రేమను ఆయనేమీ మరవడు.
[11] మీలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చయతతో ఆశాభావం అనుభవించడానికి అలాంటి శ్రద్ధాసక్తులు చివరిదాకా చూపాలనీ,
[12] మీరు మందబుద్ధులు కాక, నమ్మకం ద్వారా ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాలకు వారసులైనవారిని అనుకరించాలనీ మా ఆశ.
[13] దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవానితోడని శపథం చేయలేక తన తోడని శపథం చేస్తూ ఇలా అన్నాడు:
[14] “నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను. నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేస్తాను.”
[15] ఈ విధంగా అబ్రాహాము కొంత కాలం ఓపికతో ఎదురు చూచిన తరువాత అతనికి వాగ్దానం నెరవేరింది.
[16] మనుషులు తమకంటే గొప్పవానితోడని శపథం చేస్తారు. అలా పలికినదానిని శపథం బలపరచి ప్రతి వివాదాన్ని అంతం చేస్తుంది.
[17] అలాగే దేవుడు కూడా తాను ఉద్దేశించినది మార్పులేనిదని తన వాగ్దాన వారసులకు చూపాలని కోరి శపథం చేశాడు.
[18] మార్పు చెందని ఈ రెండు ఉన్నాయి. వాటి విషయంలో దేవుడు అబద్ధమాడడం అసాధ్యం. వాటినిబట్టి, మన ముందు ఉంచిన ఆశాభావం చేజిక్కించుకోవడానికి శరణాగతులైన మనకు గట్టి ప్రోత్సాహం ఉండాలని ఆయన కోరిక.
[19] ఈ ఆశాభావం మన ఆత్మకు “లంగరు” లాంటిది, భద్రమైనది, సుస్థిరమైనది, తెర లోపల ఉన్నదానిలోకి ప్రవేశిస్తూ ఉండేది.
[20] యేసు మనకోసం మనకు ముందుగా అందులో ప్రవేశించాడు. ఆయన మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం ప్రముఖయాజి అయ్యాడు.