[1] ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘంలాగా మన చుట్టూ ఆవరించి ఉన్నారు గనుక మనలను ఆటంకపరిచే ప్రతిదాన్నీ, సుళువుగా చిక్కులుపెట్టే పాపాన్నీ త్రోసిపుచ్చి యేసువైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓర్పుతో పరుగెత్తుదాం.
[2] నమ్మకానికి కర్త, దానిని అంతం వరకు కొనసాగించేవాడు ఆయనే. ఆయన తన ముందున్న ఆనందంకోసం సిలువను ఓర్చుకొని ఆ అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నాడు.
[3] మీ ప్రాణాలకు అలసట, నిరుత్సాహం కలగకుండా పాపాత్ములవల్ల కలిగిన మొత్తం వ్యతిరేకత ఓర్చుకున్న ఆయనను బాగా తలపోయండి.
[4] పాపంతో పెనుగులాడడంలో మీ రక్తం చిందేటంతగా మీరింకా దానికి ఎదురాడలేదు.
[5] అంతేగాక, కొడుకులతో చెప్పినట్టు మీతో చెప్పిన ప్రోత్సాహం మరచిపోయారు. అదేమిటంటే, నా కుమారా, ప్రభువు ఇచ్చే శిక్షను చిన్న చూపు చూడకు. ఆయన మందలింపుకు నిరుత్సాహపడకు.
[6] తాను ప్రేమించేవారిని ప్రభువు శిక్షిస్తాడు, స్వీకరించిన ప్రతి కొడుకునూ కొరడా దెబ్బలకు గురి చేస్తాడు.
[7] మీరు శిక్ష ఓర్చుకొంటూ ఉన్నారా, దేవుడు కొడుకులనుగా మిమ్మును చూస్తున్నాడన్న మాట. తండ్రి శిక్షించని కొడుకు ఎవడు?
[8] కొడుకులందరికీ శిక్ష వచ్చేది. ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు గాని అక్రమ సంతానం లాంటివారు.
[9] అంతేకాదు, శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులు మనకు ఉండేవారు, వారిని గౌరవించాం. అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి గదా.
[10] వారేమో తమకు తోచిన విధానం ప్రకారం కొద్ది కాలం మనలను శిక్షించారు. దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు.
[11] ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది గాని సంతోషకరం కాదు. అయినా దానివల్ల శిక్షణ పొందినవారికి తరువాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలం ఇస్తుంది.
[12] అందుచేత దించిన చేతులను, దుర్బలమైన మోకాళ్ళకు బలం చేకూర్చుకోండి.
[13] కుంటికాలు బెణకకుండా కుదురుబడేలా మీ పాదాలకు తిన్నని త్రోవలు చేసుకోండి.
[14] అందరితో సమాధానం, పవిత్రత మీకు ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు.
[15] మీలో దేవుని కృపను అందుకోని వ్యక్తి ఎవరూ ఉండకుండా, ఏదైనా చేదు వేరు మొలిచి కలత పెట్టడంచేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి.
[16] ఒక్క పూట తిండికోసం తన జన్మహక్కును అమ్మివేసిన ఏశావులాంటి వ్యభిచారి గానీ అపవిత్రుడు గానీ మీలో ఉండకుండా చూచుకోండి.
[17] తరువాత ఆ దీవెన కావాలని ఏశావు ఆశించినా అతడు నిరాకరణకు గురి అయిన సంగతి మీకు తెలుసు. తన తండ్రి మనసు మార్చాలని అవకాశంకోసం కన్నీళ్ళతో మనసారా వెదికినా అలాంటిదేమీ అతడికి లభించలేదు.
[18] మీరు చేరినది తాకగల పర్వతానికి కాదు. మండుతూ ఉన్న మంటలు, కారు మబ్బులు, దట్టమైన చీకటి, తుఫాను ఉన్న దానికి కాదు.
[19] బూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు రాలేదు. ఆ మాటల ధ్వని విన్నవారు మరే మాటా తమతో చెప్పవద్దని బతిమాలుకొన్నారు.
[20] “జంతువైనా ఈ పర్వతాన్ని తగిలితే దానిని రాళ్ళతో కొట్టి లేదా, బాణం వేసి చంపాలి” అనే ఆజ్ఞను వారు ఓర్చుకోలేకపోయారు.
[21] ఆ దృశ్యం ఎంత భయంకరం అంటే మోషే “ఎంతో భయంతో వణుకుతున్నాను” అన్నాడు.
[22] గానీ మీరు వచ్చినది సీయోను పర్వతానికి, పరలోకంలోని జెరుసలం అనే సజీవుడైన దేవుని నగరానికి, వేలాదివేలమంది దేవదూతల దగ్గరకు,
[23] ప్రముఖుడైన క్రీస్తుసంఘానికి (ఈ సంఘ సభ్యుల పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయి), వారి మహోత్సవ సభకు, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు, పరిపూర్ణ స్థితి పొందిన న్యాయవంతుల ఆత్మల దగ్గరకు,
[24] కొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే మరీ శ్రేష్ఠమైనవాటిని తెలియజేసే ప్రోక్షణ రక్తం దగ్గరకు.
[25] మాట్లాడుతున్నవాణ్ణి నిరాకరించకుండా చూచుకోండి. భూమిమీద హెచ్చరించిన ఈయనను నిరాకరించినవారు తప్పించుకోలేకపోతే పరలోకంనుంచి హెచ్చరించే ఈయనను విడిచిపెట్టిపోతే మనం తప్పించుకోలేమనేది మరీ నిశ్చయం గదా!
[26] అప్పుడు ఆయన స్వరం భూమిని కదిలించింది. ఇప్పుడైతే ఆయన వాగ్దానం ఇలా ఉంది: మరోసారి నేను భూమిని మాత్రమే గాక ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.
[27] “మరో సారి” అనే మాట ఏమి సూచిస్తుందంటే, కదిలించబడలేనివి మిగిలేలా కదిలించబడ్డ వాటిని – అంటే సృజించబడ్డవాటిని – తీసివేయడమే.
[28] అందుచేత, కదిలించబడలేని రాజ్యం మనకు లభించే కారణంగా దేవునికి భయభక్తులతో అంగీకారమైన సేవ చేసేలా కృప కలిగి ఉందాం.
[29] ఎందుకంటే మన దేవుడు దహించివేసే జ్వాలలాంటివాడు.